అద్దం ఎంత స్పష్టంగా, ఎలాంటి మరకలు లేకుండా ఉంటే అందులో మన ప్రతిబింబం అంత స్పష్టంగా కనిపిస్తుంది.
అద్దం ఎంత స్పష్టంగా, ఎలాంటి మరకలు లేకుండా ఉంటే అందులో మన ప్రతిబింబం అంత స్పష్టంగా కనిపిస్తుంది. అదే విధంగా మన లక్ష్యం ఎంత స్పష్టంగా ఉంటే దాన్ని సాధించేందుకు అవసరమైన మార్గాలు అంతే స్పష్టంగా కళ్ల ముందు కనిపిస్తాయి.
‘నేను చాలా డబ్బు సంపాదించాలి’
‘నేను మంచి ఉద్యోగంలో చేరాలి’
‘నేను ఉన్నత స్థానంలో ఉండాలి’..
ఇవన్నీ లక్ష్యాలు కావు.. కేవలం కలలు మాత్రమే.
అయితే ఒక కలను లక్ష్యమని చెప్పుకోవాలంటే దానికి ఏమి ఉండాలి? దీనికి సమాధానాన్ని 5-ఈ సూత్రం ద్వారా తెలుసుకోవచ్చు.
1. ఆశయం (Dream)
2. దిశ (Direction)
3. సంకల్పం (Determination)
4. క్రమశిక్షణ (Discipline)
5. తుది గడువు (Deadline)
మీ ఆశయాల (Dreams)కు మిగిలిన 4-ఈలు జతకలిస్తేనే ఆ కలలు లక్ష్యాలు (గోల్స్) అవుతాయి. ఇలాంటి లక్ష్యాలున్న వ్యక్తి అసలైన విజేతగా నిలుస్తాడు. మీ కలలో ఈ ఐదు అంశాల్లో ఏది లోపించినా అది గోల్ కాదు.. ఉత్త కల మాత్రమే!
మీకో ఉదాహరణ చెబుతాను.. ఒక సందర్భంలో మా స్నేహితుడి ఇంటికి వెళ్లినప్పుడు అతని కుమారుడు కనిపించాడు. ఆ కుర్రాడి వయస్సు 16 ఏళ్లు ఉండొచ్చు. ఇంటర్ చదువుతున్నట్లు అనిపించి.. ‘ఏం చేస్తున్నావు?’ అని అడిగాను.
ఈ ప్రశ్నకు అట్నుంచి.. ‘ఇంటర్ చదువుతున్నాను అంకుల్’ అనే సమాధానం వస్తుందని భావించాను. కానీ, ఆ సమాధానం అసలైన లక్ష్య నిర్దేశకుడ్ని నా కళ్లముందు నిలిపింది. కుర్రాడి సమాధానం ఏంటంటే.. ‘నేను ఐఐటీ ముంబైలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో చేరే దిశగా సాగిపోతున్నాను’. ఇలా చెప్పేటప్పుడు అతని ముఖ కవళికల్లో ఎక్కడా అసహజ ధోరణి కనిపించలేదు. సహజంగా ఏదో కోఠీకి వెళ్తున్నా అన్నట్టు చెప్పాడు. ఆ తర్వాత ఆ అబ్బాయి ముంబై ఐఐటీలో సీటు సంపాదించడం, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అహ్మదాబాద్‌లో మేనేజ్‌మెంట్‌లో పీజీ చేయడం చకచకా జరిగిపోయాయి. ప్రస్తుతం అతను అమెరికాలో ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉన్నత స్థానంలో ఉన్నాడు.
మీకింకా అర్థమయ్యేలా చెబుతా.. మీరు పనిమీద బెంగళూరు వెళ్తున్నారనుకుందాం.. దారిలో జడ్చర్లలో ఆగి టీ తాగుతున్నారు. అప్పుడు మీ స్నేహితుడి నుంచి ఫోన్ వచ్చింది. ‘ఏం చేస్తున్నావు?’ అని అతడు అడిగితే జడ్చర్లలో టీ తాగుతున్నాను.. అని చెప్పరు కదా! నేను బెంగళూరు వెళ్తున్నాననే చెబుతారు కదా!
‘నేను ఇంజనీరింగ్ చదువుతున్నాను’, ‘నేను ఇంటర్ చదువుతున్నాను’.. వంటి సమాధానాలు గోల్ పరంగా ఎంత శుష్కంగా ఉన్నాయో విశ్లేషించుకోండి. కెరీర్ విషయంలో మన గోల్ ఎప్పటికప్పుడు ఉత్తేజితుల్ని చేస్తూ ఉండాలి.
అపనమ్మకమే అసలు అడ్డంకి:
మీ లక్ష్యం గురించి చెప్పుకునేందుకు సిగ్గుపడుతున్నారా? మొహమాట పడుతున్నారా? అయితే మీరిలా ఆలోచిస్తూ ఉండవచ్చు.
‘ఒకవేళ నేను నా లక్ష్యాన్ని సాధించలేకపోతే ఎదుటి వారు నవ్వుకుంటారేమో’! అంటే మీ విజయం పట్ల మీరు వంద శాతం నమ్మకంగా లేరు. మీరు మానసికంగా మీ విజయాన్ని శంకించకండి.. న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ (ఎన్‌ఎల్‌పీ) సాధనలో ఇది ముఖ్య సూత్రం. ప్రపంచ వ్యాప్తంగా అనేక సంచలనాలు సృష్టిస్తున్న ‘ది సీక్రెట్’ అనే పుస్తకం ఇదే అంశాన్ని స్పష్టం చేస్తోంది. నిర్హేతుకమైన, అసాధారణమైన, అసాధ్యమైన కలల్ని సైతం పదే పదే బలంగా అనుకుంటే మీ మనసు వాటిని సాధించేందుకు ఉరకలేస్తుంది.. మీ కలలు నూటికి నూరుశాతం ఫలిస్తాయని ఈ పుస్తకం చెబుతోంది. అందుకే 5-ఈతో కూడిన మీ స్పష్టమైన లక్ష్యం తాలూకు విజయావకాశాలను మీరు బలంగా విశ్వసించండి.. విజయం మీ సొంతమవుతుంది.
‘నా జీవిత గమ్యం ఇది’ అని మొదటే బలంగా అనుకొని, సరైన దిశలో, సరైన సంకల్పం, క్రమశిక్షణతో ముందుకెళ్తే మీరు ముందే నిర్దేశించుకున్న గడువులోగా లక్ష్యాన్ని తప్పక సాధిస్తారు. ఇదే అసలైన లక్ష్య నిర్దేశం!
లక్ష్యాలు- రకాలు:
1-స్వల్పకాలిక లక్ష్యాలు (ఏడాదిలో సాధించాల్సినవి)
2- మధ్యకాలిక లక్ష్యాలు (మూడేళ్లలో సాధించాల్సినవి)
3- దీర్ఘకాలిక లక్ష్యాలు (ఐదేళ్లలో సాధించాల్సినవి)
ఈ విధంగా ఒక పెద్ద లక్ష్యాన్ని, చిన్న లక్ష్యాలుగా విడగొట్టొచ్చు.
లక్ష్యం ఎంత స్పష్టంగా ఉంటే, లక్ష్య సాధన అంత తేలికవుతుంది.
‘నేను కంపెనీ గీలో టీం లీడర్ స్థాయికి చేరాలన్న కృతనిశ్చయంతో ఉన్నాను. ఈ లక్ష్యాన్ని 2016, జూన్ 30 నాటికి సాధించాలి’.
ఎప్పుడైతే ఇలా మీ లక్ష్యానికి సంబంధించి స్పష్టత ఉంటుందో అప్పుడు దాన్ని సాధించడానికి అవసరమైన సాఫ్ట్ స్కిల్స్, హార్డ్ స్కిల్స్ ఏమిటో మీకు తెలిసిపోతుంది. వాటిని సాధించే క్రమంలో మీకు తక్షణ లక్ష్యాలు, మధ్యకాలిక లక్ష్యాలు, సుదూర లక్ష్యాలు వాటంతటవే వరుస క్రమంలో (ప్రాధాన్యత క్రమంలో) మీ ముందు ప్రత్యక్షమవుతాయి. 5-ఈ సూత్రాన్ని తు.చ. తప్పకుండా పాటిస్తూ ముందుకెళ్తుంటే తక్షణ లక్ష్యాలు ఎప్పటికప్పుడు నెరవేరుతుంటాయి. ఈ విజయాలు మనల్ని తొలుత మధ్యకాలిక లక్ష్యాలకు, తర్వాత దీర్ఘకాలిక లక్ష్యాల సాధనకు దగ్గర చేస్తాయి.
విజేత జేబులో ఎప్పుడూ ’Things to do - today' అనే పాకెట్ సైజ్ పుస్తకం ఉంటుంది. అందులో ఆరోజున చేయాల్సిన పనులు (తక్షణ లక్ష్యాలు) రాసుకుంటారు. ఒక్కో పని పూర్తవుతుంటే టిక్ చేస్తారు. ప్రతి టిక్ మార్‌క వారికి కొత్త ప్రేరణ ఇస్తుంది.
Vivekanand Rayapeddi
Director, Royal Spoken English