ఏఐటీయూసీని ఎప్పుడు స్థాపించారు?
ట్రేడ్ యూనియన్ ఉద్యమం
పారిశ్రామిక అభివృద్ధి భారతదేశంలో ఒక కొత్త వర్గాన్ని సృష్టించింది. అదే కార్మిక వర్గం. పారిశ్రామిక అభివృద్ధితో పాటు కార్మిక వర్గం కూడా పెరిగింది. ముఖ్యంగా రుణభారంతో సతమతమైన రైతులు, గ్రామీణ ప్రాంతాల్లో చేతివృత్తులవారు కార్మిక వర్గంగా రూపొందారు. మొదట్లో కార్మికులు ఎన్నో కష్టనష్టాలకు గురయ్యారు. పరిశ్రమలు, తోటల్లో తక్కువ వేతనాలు చెల్లించేవారు. అనారోగ్య, హానికరమైన పరిస్థితుల్లో పనిచేయాల్సి వచ్చేది. కార్మికుల శ్రేయస్సు కోసం పారిశ్రామిక వేత్తలు ఏ మాత్రం శ్రద్ధ చూపేవారు కాదు.
1931లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన పోర్‌ట్స యాక్ట్ (Ports Act), 1934లో వర్‌కమెన్‌స కాంపెన్సేషన్ యాక్ట్; కర్మాగారాల చట్టం, 1935లో గనుల చట్టం, 1936లో కనీస వేతనాల చట్టం మొదలైనవి చేసినప్పటికీ, అవి పూర్తి రక్షణ కల్పించలేకపోయాయి. ఈ పరిస్థితుల్లో కార్మిక ఉద్యమం అనివార్యమైంది. భారతీయ కార్మికులు నిరక్ష్యరాస్యులు, సాంస్కృతికంగా వెనుకబడినవారు కావడం వల్ల మొదట్లో ఉద్యమం అంత తీవ్రంగా విస్తరించ లేదు. 1918 తర్వాత క్రమంగా ఊపందుకుంది.
1908లో బొంబాయి దుస్తుల మిల్లు కార్మికుల సమ్మె మినహా ఏ విధమైన ఉద్యమాలు రాలేదు. బాలగంగాధర తిలక్‌ను కారాగారానికి పంపినందుకు నిరసనగా ఈ సమ్మె జరిగింది. అందువల్ల దీన్ని కచ్చితంగా కార్మికుల సమ్మె అనడానికి వీలులేదు. మొదటి ప్రపంచ యుద్ధానంతరం మారిన పరిస్థితుల్లో పూర్తిస్థాయి కార్మిక ఉద్యమాలు, సంస్థలు ప్రారంభమయ్యాయి. ఐరోపా దేశాల్లో ప్రజాస్వామ్య ఉద్యమాలు, రష్యాలో 1917 కమ్యూనిస్టు విప్లవం, భారత్‌లో యుద్ధానంతరం ఏర్పడిన ఆర్థిక మాంద్యం మొదలైన కారణాల వల్ల ఈ ఉద్యమం బలపడింది.
1918-20 మధ్యకాలంలో బొంబాయి, కలకత్తా, మద్రాసు, అహ్మదాబాద్, కాన్పూర్, షోలాపూర్, జంషెడ్‌పూర్ పారిశ్రామిక కేంద్రాల్లో వరుసగా అనేక సమ్మెలు జరిగాయి. ఈ సమ్మెలన్నీ కార్మికుల ఆర్థిక స్థితిగతులను మెరుగుపర్చుకోవడానికే. రౌలత్ శాసనానికి నిరసనగా కార్మికుల ప్రదర్శనలు, ఊరేగింపులు, బహిరంగ సమావేశాలను నిర్వహించారు. భారతదేశంలో కార్మిక వర్గం జాతీయ ఉద్యమంలో పాల్గొనడం అదే తొలిసారి. ఈ సమయంలోనే వివిధ పరిశ్రమల్లో అనేక కార్మిక సంఘాలను ఏర్పాటు చేయడానికి కూడా ప్రయత్నాలు చేశారు. బొంబాయి, మద్రాసు లాంటి పారిశ్రామిక కేంద్రాల్లో వీటిని స్థాపించారు.
ఈ ప్రయత్నాలన్నీ 1920 అఖిల భారత కార్మిక సంఘం (ఏఐటీయూసీ) స్థాపించడంతో ఫలప్రదమయ్యాయి. ఈ ఉద్యమ స్థాపన నారాయణ్ మలహర్ జోషి, లాలా లజపతిరాయ్, జోసఫ్ బాప్టిస్టా ప్రయత్న ఫలితమే. అఖిల భారత కార్మిక సంఘం (ఏఐటీయూసీ) భారత కార్మికుల ఆర్థిక, సాంఘిక, రాజకీయ ప్రయోజనాలు స్థాపించడమే ఆశయంగా పెట్టుకుంది. ఇది అన్ని ఇతర కార్మిక సంఘాల కార్యకలాపాలను సమన్వయపర్చింది. ఉదారవాద నాయకులైన ఎన్.ఎం.జోషి ఆధ్వర్యంలో ఏఐటీయూసీ ఒక దశాబ్దంపాటు నడిచింది. కాలక్రమంలో నేషనలిస్టు నాయకులైన వి.వి.గిరి, సి.ఆర్. దాస్ దీని కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
1922 తర్వాత సామ్యవాద, కమ్యూనిస్టు భావాలు మనదేశంలో ప్రచారంలోకి వచ్చాయి. అఖిల భారత జాతీయ కాంగ్రెస్‌లోనే వామపక్ష అభిప్రాయాలున్న వ్యక్తులు ఉండేవారు. వామ పక్షానికి జవహర్‌లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ నాయకత్వం వహించారు. 1927 తర్వాత కార్మిక ఉద్యమంలోనూ వామపక్ష నాయకత్వం అభివృద్ధి చెందింది. కమ్యూనిస్టులకు వర్గ పోరాటంలో నమ్మకం ఉండగా, సామ్యవాదులు దాన్ని విశ్వసించేవారు కాదు. కానీ, కార్మిక సంఘాలను నిర్వహిస్తూ, రైతుల ప్రయోజనాలను కాపాడటానికి ప్రయత్నించారు. ఉదారభావాలు ఉన్న జాతీయ నాయకుల కంటే సోషలిస్టు నాయకులే కార్మికులను, రైతులను ఆర్థిక దోపిడీ నుంచి రక్షించడానికి ఎక్కువ శ్రద్ధ చూపారు.
సామ్యవాదులు, కమ్యూనిస్టులు కార్మిక, రైతు సంఘాలను నిర్వహించారు. వీటిలో కొన్ని పక్షాలు వర్గ పోరాటం ప్రాతిపదికగా కార్మిక సంఘాలను నిర్వహించటం వల్ల కార్మిక ఉద్యమం బలపడింది. వీరే క్రమంగా అఖిల భారత కార్మిక సంఘ సంస్థలో పట్టు సంపాదించి చివరకు దాన్ని తమ ఆధిపత్యంలోకి తెచ్చుకున్నారు. ఏఐటీయూసీలో వామపక్ష భావాలున్నవారు ఇమడలేక 1929లో చీలిపోయారు. ఎన్.ఎం.జోషీ ఏఐటీయూసీని వీడి, భారతీయ ట్రేడ్ యూనియన్ ఫెడరేషన్‌ను స్థాపించాడు. ఇది 1931లో మరోసారి చీలింది. ఈ రెండు భాగాలు 1935లో మళ్లీ కలిశాయి. 1938లో భారతీయ ట్రేడ్ యూనియన్ ఫెడరేషన్ (బీటీయూఎఫ్) కూడా ఏఐటీయూసీలో చేరాలని నిర్ణయించుకుంది.
ఏఐటీయూసీ ఒక విస్తృత, బృహత్తరమైన పథకంతో ముందుకు వచ్చింది. దీని ప్రధాన ఉద్దేశాలు కిందివిధంగా ఉన్నాయి.
భారతదేశంలో సామ్యవాద రాజ్యాన్ని ఏర్పాటు చేయడం.
వస్తూత్పత్తిని జాతీయం చేయడం.
మెరుగైన ఆర్థిక, సామాజిక పరిస్థితులను కల్పించడం.
వాక్ స్వాతంత్య్రం, సంఘాలను ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ సాధించడం.
జాతీయ పోరాటంలో కార్మికులు పాల్గొనేటట్లు చేయడం.
కుల, వృత్తి, జాతి, మత వివక్షను రద్దు చేయడం.
ఏఐటీయూసీ కీలకమైన పాత్రను నిర్వహించినప్పటికీ సభ్యత్వం మాత్రం చెప్పుకోదగినంతగా పెరగలేదు.
క్రీ.శ. 1927 తర్వాత భారతదేశంలో కార్మిక వర్గం ఒక స్వతంత్ర ఆర్థిక, రాజకీయ శక్తిగా మారింది. 1928-30 కాలంలో బొంబాయి మిల్లు కార్మికుల సమ్మె లాంటి వాటిని అనేకం నిర్వహించింది. సైమన్ కమిషన్ బహిష్కరణ, శాసనోల్లంఘనోద్యమం, కాంగ్రెస్ నిర్వహించిన ఇతర ఉద్యమాల్లో కార్మికులు పాల్గొన్నారు. జాతీయోద్యమంలోనూ వీరి పాత్ర గణనీయమైంది. కమ్యూనిస్టు పార్టీ మాత్రం ఒక ప్రత్యేక కార్మిక వర్గాన్ని ఏర్పాటు చేసుకుంది.
కార్మిక ఉద్యమ చర్యలు ముఖ్యంగా కమ్యూనిస్టు పార్టీకి అనుకూలంగా ఉన్న సంఘాలు ప్రభుత్వాన్ని బాగా ఇబ్బంది పెట్టాయి. ప్రభుత్వం వారిని అణచి వేయడానికి అనేక చర్యలు తీసుకుంది. కార్మిక వివాద చట్టం కార్మికుల హక్కులను పరిమితం చేసింది.1929లో రూపొందించిన పబ్లిక్ సేఫ్టీ బిల్లు ద్వారా సంఘ విరోధులైన వ్యక్తులను దేశ బహిష్కరణ చేసే అధికారం కూడా ప్రభుత్వానికి లభించింది. ప్రభుత్వం అనేకమంది వామపక్ష కార్మిక నాయకులను నిర్బంధంలోకి తీసుకుని , వారిపై ‘మీరట్ కుట్ర’ కేసును నమోదు చేసింది.
1937 ఎన్నికల్లో జాతీయ కాంగ్రెస్ విజ యం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కార్మికులు ఈ ప్రభుత్వాలపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వారికి లబ్ధి చేకూరుతుందనే ఆశయంతో జాతీయ ఉద్యమానికి సహకరించారు. కానీ, కాంగ్రెస్ మంత్రివర్గాలు వారి ఆశలను వమ్ము చేశాయి. పెట్టుబడిదారుల ప్రభావానికి గురైన కాంగ్రెస్... బాంబే కార్మిక వివాదచట్టాన్ని అమలు చేయడం, కార్మికులపై కాల్పులు జరపడం, సమావేశాలను నిషేధించడం, నాయకులను అరెస్టు చేయడం లాంటి చర్యలను చేపట్టింది. ఇవన్నీ కార్మిక వర్గాల ప్రయోజనానికి వ్యతిరేకమైనవే. అయినప్పటికీ ఉద్యమం చల్లారలేదు. 1938 తర్వాత భారతదేశంలో అనేక కార్మిక సంఘాలు ఏర్పడ్డాయి. ఏఐటీయూసీ కూడా తన సభ్యత్వాన్ని పెంచుకుంది. మొత్తం మీద భారత స్వాతంత్య్రానికి పూర్వం కార్మిక ఉద్యమం దాని ఆశయాన్ని చాలా వరకు నెరవేర్చుకోలేదనే చెప్పవచ్చు.