
రాకెట్‌లా పాకెట్ మనీ
రెండేళ్ల క్రితం అసోచామ్నిర్వహించిన సర్వేలో.. యూత్ పాకెట్ మనీ నెలకు రూ.3,600 నుంచి రూ.12,000 వరకు ఉంది.
20 ఏళ్ల క్రితం..
‘అమ్మా ఇరవై రూపాయలుంటే ఇస్తావా... ఫ్రెండ్స్ సినిమాకెళ్దామంటున్నారు’
పదేళ్ల క్రితం..‘మమ్మీ.. నాకో హండ్రెడ్ రూపీస్ కావాలి. ఫ్రెండ్స్‌తో కలిసి పిక్‌నిక్‌కు వెళ్లాలి’
ఇప్పుడు.. ‘మామ్.. నెలకో ఫైవ్ థౌజెండ్
కావాల్సిందే. లేదంటే కుదరదు’..
రెండేళ్ల క్రితం అసోచామ్నిర్వహించిన సర్వేలో.. యూత్ పాకెట్ మనీ నెలకు రూ.3,600 నుంచి రూ.12,000 వరకు ఉంది.ప్రస్తుతం అది రూ.5 వేల నుంచి రూ.15 వేల వరకు పెరిగినట్లు అంచనా.
నేటి యువతరం పాకెట్‌మనీ డిమాండ్లు.. రాకెట్‌లా దూసుకెళ్తున్నాయి. పాకెట్‌మనీ రూ.10, రూ.100 నుంచి ఇప్పుడు వేల రూపాయలకు చేరుకుంది. కొంతమందిపేరెంట్స్ తమ బిడ్డలు బాగా చదవాలని అడిగినంత ఇస్తున్నారు.. మరికొందరుపిల్లల పాకెట్ మనీ డిమాండ్స్‌తో బేజారవుతున్నారు. ఇష్టంగా ఇచ్చినా, కష్టంగా ఇచ్చినా.. పాకెట్ మనీ తప్పనిసరిగా ఇవ్వాల్సిందే.. మరి ఈ డబ్బుతో నేటి యువత ఏం చేస్తోంది? పర్యవసానాలు ఏంటి? అసలు ఈ పాకెట్ మనీ సంస్కృతి పెరగడానికి కారణాలేంటి? తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు? తదితర అంశాలపై విశ్లేషణ..
లేనిపోని గొప్పల కోసం..
పాకెట్ మనీ కోసం యువత వేల రూపాయలు డిమాండ్ చేసే పరిస్థితులకు ఒక కారణం లేనిపోని గొప్పలకు పోవడం. ముఖ్యంగా అర్బన్, సిటీ ప్రాంతాల్లో భిన్న సంస్కృతులు, నేపథ్యాలు ఉన్న పిల్లలతో కలిసి చదువుతున్న యువత.. సహచరుల ముందు గొప్పల కోసం పర్సు ఎల్లప్పుడూ ఫుల్‌గా ఉండాలని ఆతృత పడుతోంది. నలుగురు స్నేహితులు కలిసి కాఫీ తాగినప్పుడో, క్యాంటీన్‌లో తిన్నప్పుడో ‘బిల్’ చెల్లించే విషయంలో తాము ముందుంటే నలుగురిలో తమకు ప్రత్యేక గుర్తింపు ఉంటుందనే భానవతో వ్యవహరిస్తోంది. ఆచితూచి ఖర్చుచేసే వారి గురించి హేళనగా మాట్లాడే పరిస్థితులు సైతం యువతపై ప్రభావం చూపుతున్నాయి. కొన్ని సందర్భాల్లో తమ వ్యక్తిగత నేపథ్యాన్ని కూడా మరచి యువత ఖర్చు పెడుతోంది. ఇందుకోసం తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తోంది. రెండేళ్ల క్రితం అసోచామ్ నిర్వహించిన సర్వేలో.. యూత్ పాకెట్ మనీ నెలకు రూ.3,600 నుంచి రూ.12,000 వరకు ఉంది. ప్రస్తుతం అది రూ.5 వేల నుంచి రూ.15 వేల వరకు పెరిగినట్లు అంచనా.
ఈట్ అవుట్స్.. గ్యాడ్జెట్స్
పేరెంట్స్ నుంచి పిండి తీసుకుంటున్న పాకెట్ మనీలో ఈట్-ఔట్స్, కొత్త కొత్త గ్యాడ్జెట్స్‌కు యువత ఎక్కువగా ఖర్చు చేస్తోంది. పేరెంట్స్ ఇచ్చే పాకెట్ మనీలో 50 శాతానికి పైగా గాడ్జెట్స్ కోసం వెచ్చిస్తున్నారు. మరో 25 శాతం సినిమాలు, షికార్లకు; 20 శాతం రెస్టారెంట్స్, న్యూ ఫ్యాషన్ అపరెల్స్ కొనడానికి వినియోగిస్తున్నారు. యువతలో సగటున 40 శాతం మంది ఏడు నుంచి ఎనిమిది నెలల వ్యవధిలో కొత్త ఫోన్ కొనుగోలుపై ఆసక్తి చూపుతున్నారు. అంతేకాకుండా కొందరు విద్యార్థులు క్లాస్‌లకు బంక్ కొట్టి కాఫీ క్లబ్స్‌లో చాటింగ్స్‌కు, మల్టీప్లెక్స్‌లలో సినిమాలు చూసేందుకు ప్రాధాన్యమిస్తున్నారు. తమ ఉజ్వల భవిష్యత్తుకు మార్గం వేసే తరగతులకు గైర్హాజరవుతున్నారు.
తల్లిదండ్రుల పాత్ర
యువత ఈ స్థాయిలో డబ్బును నీళ్లలా ఖర్చు పెడుతున్న విషయంలో తల్లిదండ్రుల పాత్ర కూడా ఉందని చెప్పొచ్చు. ఈ కోణంలో తల్లిదండ్రులను రెండు వర్గాలుగా విభజించొచ్చు.‘తాము కష్ట పడేది పిల్లల కోసమే కదా.. వారు కోరింది ఇవ్వకపోతే ఎలా?’ అనుకునేది ఒక వర్గం. కాగా ‘పిల్లలు కనీసం ఏం చేస్తున్నారో కూడా తెలుసుకోలేని బిజీ షెడ్యూల్స్’ ఇంకొక వర్గానిది. వీరిలో అధిక శాతం మంది హై ప్రొఫైల్స్ ఉన్నవారు, లేదా ఇద్దరూ ఉద్యోగస్తులు ఉంటున్నారు. తల్లిదండ్రులు ఎంత బిజీ షెడ్యూల్స్‌తో ఉన్నా కొంత సమయాన్ని తమ పిల్లల కెరీర్ దిశగా ఆలోచించేందుకు కేటాయించాలంటున్నారు నిపుణులు.
అలాగే పిల్లలకు ఇస్తున్న పాకెట్ మనీ, కల్పిస్తున్న సదుపాయాలను వారు ఏ విధంగా వినియోగిస్తున్నారో తెలుసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా టీనేజ్ యువత విషయంలో తల్లిదండ్రులు శ్రద్ధ చూపకపోతే.. అది వారి భవిష్యత్తుకు చేటు తెస్తుందని వివిధ సర్వేలు ఘంటాపథంగా చెబుతున్నాయి. ముఖ్యంగా పిల్లలను హాస్టల్‌లో ఉంచి చదివిస్తున్న తల్లిదండ్రులు మరింత శ్రద్ధ వహించాలి. డబ్బులు దేనికోసం అడుగుతున్నారో తెలుసుకోవాలి. నేరుగా పాకెట్ మనీ చేతికి ఇవ్వకుండా.. బ్యాంక్‌లో డిపాజిట్ చేయడం, ట్రాన్షాక్షన్స్ వివరాలు మెసేజ్ రూపంలో తమ ఫోన్‌కు వచ్చే విధంగా చేస్తే పిల్లల్లో జవాబుదారీతనం ఏర్పడుతుందని, క్రమశిక్షణ అలవడుతుందని విశ్లేషకులు అంటున్నారు.
బాధ్యత తెలుసుకొని..
ప్రస్తుతం చదువు విలువపై అందరిలో అవగాహన పెరిగిన నేపథ్యంలో పేద, మధ్యతరగతి తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు మంచి చదువులు చెప్పించడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే కుటుంబ పరిస్థితులను అర్థం చేసుకోకుండా భారీ స్థాయిలో పాకెట్ మనీ డిమాండ్ చేస్తూ యువత తమ తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టకూడదని నిపుణులు అంటున్నారు. అవసరమైతే ఏదైనా పార్ట్ టైం ఉద్యోగం చేస్తూ తమ తల్లిదండ్రులకు ఆసరాగా నిలవాలని, వారి బాధ్యతలను పంచుకోవాలని సూచిస్తున్నారు.
చిన్నప్పటి నుంచే ఆర్థిక క్రమశిక్షణ
తల్లిదండ్రులు చిన్నతనం నుంచే తమ పిల్లలకు ఆర్థిక క్రమ శిక్ష నేర్పించాలి. దేనికి ఎంత అవసరమో? దేనికి ఎంత ప్రాధాన్యమివ్వాలో? తెలియజేయాలి. ముఖ్యంగా టీనేజ్ యువత అంతా తమకు తెలుసు అనే ధోరణిలో ప్రవర్తిస్తుంది. అలాంటప్పుడు.. వారితో పేరెంట్స్ ఫ్రెండ్స్‌లా వ్యవహరించాలి. వాస్తవ పరిస్థితులు అర్థమయ్యేలా వివరించాలి. పొదుపు అవసరాన్ని తెలియజెప్పాలి.
అవసరమైన వాటికే..
పాకెట్ మనీని అవసరమైన వాటికే వెచ్చించేలా యువత వ్యవహరించాలి. డబ్బును అనవసరంగా వృథా చేయకుండా నియంత్రించుకోవాలి. కొంత మొత్తాన్ని చదువుకునేందుకు అవసరమైన పుస్తకాలు లేదా ఇతర స్ఫూర్తిదాయక పుస్తకాలు కొనుగోలు చేయడానికి ఉపయోగించుకోవచ్చు. ఫ్రెండ్స్‌తో పిక్‌నిక్స్, సినిమాలకు వెచ్చించే బదులు స్టడీ టూర్స్‌కు కేటాయిస్తే ఆహ్లాదంతో పాటు కొత్త నైపుణ్యాలు లభిస్తాయి.