మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని జిల్లా ఎస్పీ రాజకుమారి పరిశీలించారు.
తాండూరు రూరల్, న్యూస్‌లైన్: మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా పోలింగ్ రోజున తాండూరులో 300మంది పోలీసు సిబ్బంది అందుబాటులో ఉంటారని జిల్లా ఎస్పీ రాజకుమారి తెలిపారు. శనివారం తాండూరు మండలం అంతారం గ్రామ శివారులోని టీఆర్‌సీ (తాండూరు రిక్రియేషన్ క్లబ్)లో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని ఆమె పరిశీలించారు.
అనంతరం ఎస్పీ విలేకరులతో మట్లాడుతూ తాండూరు డీఎస్పీ షేక్ ఇస్మాయిల్‌తో పాటు ఒక సీఐ, 8మంది ఎస్‌ఐల ఆధ్వర్యంలో 300మంది సిబ్బంది మున్సిపల్ ఎన్నికల్లో బందోబస్తు నిర్వహిస్తారని ఆమె చెప్పారు. మున్సిపల్ ఎన్నిక ల ఓట్ల కౌంటింగ్‌ను మొదట తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేయాలనుకున్నామని, అయితే శాంతి భద్రతల దృష్ట్యా టీఆర్‌సీకి మార్చామని ఎస్పీ చెప్పారు.
ఎన్నికల కమిషన్ అనుమతితో తాండూరు పట్టణ సీఐని నియమిస్తామని పేర్కొన్నారు. ఎన్నికల సందర్భంగా గొడవలకు పాల్పడే వారిపై కఠినచర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. మద్యం, సారా, డబ్బు పంపిణీలను నిరోధించేందుకు నిఘా తీవ్రం చేస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా రూ.50వేలకు మంచి నగదు, ఆభరణాల వంటివి తీసుకెళ్ల రాదని అన్నారు.
ఒకవేళ అలా తీసుకెళ్లాల్సి వస్తే వాటికి సంబంధించిన ధ్రువపత్రాలను పోలీసులకు చూపించాలని, లేదంటే వాటిని స్వాధీనం చేసుకుంటారని చెప్పారు. ఆమె వెంట డీఎస్పీ షేక్ ఇస్మాయిల్, రూరల్ సీఐ రవి, పట్టణ ఎస్‌ఐలు ప్రణయ్,నాగార్జునరెడ్డి, కరన్‌కోట్ ఎస్‌ఐలు పవన్, ప్రకాష్‌గౌడ్ ఉన్నారు.