అన్నీ మాయమాటలే!
కేసీఆర్ వైఖరిపై పొన్నాల ధ్వజం
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) ఎన్నికల ప్రణాళికను చూస్తుంటే ప్రజల మోచేతికి బెల్లం పెట్టకుండానే నాకమంటున్నట్లుగా ఉందని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉద్యమం పేరుతో ఇన్నాళ్లు మోసం చేసిన కేసీఆర్ ఆచరణ సాధ్యంకాని హామీలు, మాయమాటలతో మేనిఫెస్టోను రూపొందించి మరోసారి మోసం చేసేందుకు సిద్ధమయ్యారని విమర్శించారు. టీఆర్‌ఎస్ ప్రకటించిన 69 మంది అభ్యర్థుల్లో 80 శాతం మంది బయట నుంచి అరువు తెచ్చుకున్న వాళ్లేనని పేర్కొన్నారు. ఇప్పటి వరకు రాజకీయ పార్టీగా ఎదగని టీఆర్‌ఎస్‌కు అధికారమెలా వస్తుందని ప్రశ్నించారు.
ఉప ఎన్నికల్లో వచ్చిన ఫలితాల వాపును బలుపుగా కేసీఆర్ భావిస్తున్నారని విమర్శించారు. గాంధీభవన్‌లో శుక్రవారం పీసీసీ అధికార ప్రతినిధులు బి.కమలాకరరావు, వకుళాభరణం కృష్ణమోహన్‌లతో కలిసి పొన్నాల మీడియాతో మాట్లాడుతూ టీఆర్‌ఎస్ మేనిఫెస్టో, అభ్యర్థుల జాబితాతోపాటు కేసీఆర్ తనపై చేసిన ఆరోపణలమీద స్పందించారు.
వృద్ధులకు రూ. వెయ్యి, వికలాంగులకు రూ. 1,500 పెన్షన్ ఇస్తాడట. కేసీఆర్ టీడీపీలో ఉన్నప్పుడు పెన్షన్ గురించి ఎందుకు మాట్లాడలేదు? రైతులు పరిహారం కోసమే ఆత్మహత్య చేసుకుంటున్నారని ఎద్దేవా చేసిన చంద్రబాబు శిష్యరికంలో పెరిగిన మీరు పెన్షన్ గురించి మాట్లాడటమా..?
యూపీఏ రూపొందించిన ఐటీఐఆర్ అంటే కేసీఆర్‌కు ఏం తెలుసా? నియోజకవర్గానికో లక్ష ఎకరాలకు కొత్త ఆయకట్టును అందిస్తానన్న కేసీఆర్ మాటలు ఏమయ్యాయి? ఆకాశానికి నిచ్చెన వేసి అధికారం అందుకోవాలనుకుంటున్నాడు. కాంగ్రెస్ మేనిఫెస్టో వాస్తవాలకు దగ్గరగా ఉంటుంది. అధికారంలోకి వస్తే ప్రభుత్వ ప్రైవేటు రంగాలతో కలిపి జిల్లాకో లక్ష ఉద్యోగాలిస్తాం. టీఆర్‌ఎస్ మాదిరిగా మాట ఇస్తే తప్పే పార్టీ కాంగ్రెస్ కాదు. అధికారంలోకొస్తే ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తానని చెప్పిన కేసీఆర్ 69 మంది అభ్యర్థులతో ప్రకటించిన తొలి జాబితాలో ఆ మేరకు చోటెందుకు ఇవ్వలేదు?