ముఖ్య పక్షాలనుంచి రెబెల్స్‌గా మారిన అభ్యర్థులు ఏమాత్రం వెనక్కు తగ్గకుండా ప్రచారంలో దూకుడు చూపుతుండడంతో కాంగ్రెస్, తెలుగుదేశం, బీజేపీ, టీఆర్‌ఎస్ పార్టీలకు ఇబ్బందికరంగా మారింది. వారి పట్ల బుజ్జగింపులు, సస్పెన్షన్లు కూడా పనిచేయకపోవడంతో వారిని ఎలా నిరోధించాలో అర్థం కాక పోటీలో ఉన్న అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. ఈ తలనొప్పులను ఎలా తగ్గించుకోవాలా అని కలవరపడుతున్నారు.
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్:ఎన్నికల ప్రచారం వేడెక్కుతున్న వేళ తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలో ఉన్న స్వతంత్రులు కొందరు. ప్రధాన పార్టీల అభ్యర్థులకు చుక్కలు చూపుతున్నారు. టికెట్ ఆశించి భంగపడిన నేతలు అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సొంతంగా బరిలోకి దిగడంతో రాజకీయం రంజుగా సాగుతోంది. ప్రలోభాలకు, బుజ్జగింపులకు లొంగకుండా తిరుగుబాటు అభ్యర్థులు ప్రచార పర్వంలోనూ వెనక్కి తగ్గడం లేదు. దీంతో తిరుగుబాటు అభ్యర్థుల ప్రభావం తమ విజయావకాశాలను దెబ్బతీయకుండా ఉండేందుకు అభ్యర్థులు కసరత్తు చేస్తున్నారు. పార్టీ అధిష్టానాన్ని ధిక్కరించిన ఒకరిద్దరు నేతలపై సస్పెన్షన్ వేటు పడినా రాజీకి ససేమిరా అంటున్నారు.
జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాలకు గాను 149 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 76 మంది వివిధ పార్టీల తరపున పోటీ చేస్తుండగా, 73 మంది స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. వీరిలో చాలా మంది పార్టీ టికెట్ ఆశించినా దక్కక పోవడంతో సొంతంగా బరిలోకి దిగారు.
కనీసం ఐదు అసెంబ్లీ స్థానాల్లో తిరుగుబాటు అభ్యర్థులు ప్రధాన పార్టీల అభ్యర్థుల విజయావకాశాలను ప్రభావితం చేసే స్థాయిలో ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఒకటి రెండు మినహా అన్ని నియోజకవర్గాల్లోనూ టికెట్లు ఆశించిన నేతలు నామినేషన్లు దాఖలు చేశారు. అయితే పార్టీలు, అధికారిక అభ్యర్థుల బుజ్జగింపులు, ప్రలోభాలు, ఒత్తిళ్లకు తలొగ్గి చాలా చోట్ల బరి నుంచి తప్పుకున్నారు. కొందరు పోటీ నుంచి తప్పుకుని ఇతర పార్టీలోకి వలస వెళ్లారు. బలమైన తిరుగుబాటు అభ్యర్థులు బరిలో వున్న చోట కొందరికి సొంత పార్టీ నేతలు లోపాయికారీ మద్దతు ప్రకటిస్తున్నారు. రెబెల్స్ బరిలో ఉంటే తమ విజయావకాశాలు మెరుగవుతాయని ఎదుటి పార్టీల అభ్యర్థులు లెక్కలు వేసుకుంటున్నారు. తిరుగుబాటు అభ్యర్థులు ప్రభావం తమపై లేకుండా చూసుకునేందుకు టికెట్ దక్కించుకున్న నేతలు వ్యూహాలు సిద్దం చేసుకుంటున్నారు.
మహబూబ్‌నగర్ అసెంబ్లీ స్థానం నుంచి టికెట్ ఆశించినా దక్కక పోవడంతో టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యత్వానికి, పార్టీకి సయ్యద్ ఇబ్రహీం రాజీనామా చేశారు. కాంగ్రెస్ గూటికి చేరుకుని టికెట్ కోసం ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో అటు లోక్‌సభ, ఇటు అసెంబ్లీ స్థానం నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నారు. ప్రస్తుత ఎన్నిక రాజకీయ భవిష్యత్తుకు కీలకం కావడంతో చావో రేవో అనే రీతిలో సర్వ శక్తులు ఒడ్డుతున్నారు.
మహబూబ్‌నగర్ నుంచే టీఆర్‌ఎస్ టికెట్ ఆశించి భంగపడిన మరో నేత డాక్టర్ చెరుకుల అమరేందర్ పార్టీపై తిరుగుబాటు జెండా ఎగురవేశారు. తెలంగాణ ఉద్యమంలో తన కృషి, స్థానిక పరియచయాలు తనకు కలిసి వస్తాయని అంచనా వేసుకుంటున్నారు.
నారాయణపేట నుంచి టీడీపీతో పొత్తు మూలంగా టికెట్ దక్కని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రతంగ్ పాండు రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులకు ధీటుగా ప్రచార పర్వంలో మునిగి తేలుతున్నారు. ఎంపీ అభ్యర్థిగా బీజేపీ అభ్యర్థి నాగం జనార్దన్‌రెడ్డిని ఎన్నుకోవాలంటూ ప్రచారం చేయడం కొసమెరుపు.
2009లో నారాయణపేట నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన సూగూరప్ప ఈసారి మక్తల్ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అవకాశం దక్కక పోవడంతో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించారంటూ పీసీసీ సస్పెన్షన్ వేటు వేసింది.
దేవరకద్రలో టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి ఎగ్గని నర్సింహులు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. మండలాల వారీగా ప్రచార రథాలు సమకూర్చుకుని పార్టీ అధికారిక అభ్యర్థి సీతా దయాకర్‌రెడ్డికి దడ పుట్టిస్తున్నారు.
కల్వకుర్తి నుంచి టికెట్ ఆశించిన ప్రైవేటు విద్యా సంస్థల అధినేత కసిరెడ్డి నారాయణరెడ్డి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలోని ఓ వర్గం నారాయణరెడ్డికి మద్దతు పలుకుతుండటంతో అధికారిక అభ్యర్థి వంశీచంద్‌రెడ్డికి తలనొప్పిగా మారింది. నారాయణరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు పీసీసీ ప్రకటించినా ఆయన మాత్రం తనదైన శైలిలో ప్రచారం చేసుకుంటున్నారు.
కల్వకుర్తి నియోజకవర్గ ఇంచార్జిగా కొనసాగిన బాలాజీ సింగ్ ఆశలకు చివరి నిముషంలో టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన జైపాల్ యాదవ్ గండికొట్టారు. జైపాల్ యాదవ్ టికెట్ ఎగరేసుకు పోవడంతో సొంతంగా బరిలోకి దిగి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
వెనక్కు తగ్గరట..!
Published Sun, Apr 20 2014 3:24 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement
Advertisement