
కట్టుదప్పిన కమలనాథులు
* పొత్తులో సీటు దక్కని బీజేపీ నేతల ఆగ్రహం
* పార్టీ ప్రధాన కార్యాలయంలో విధ్వంసం
* కార్యాలయానికి రాని కిషన్‌రెడ్డి
* యెండల లక్ష్మీనారాయణ ఘెరావ్
* ‘దేశం’ స్థానాల్లో బీజేపీ నేతల నామినేషన్లు
* రంగారెడ్డి జిల్లా నేతల రాజీనామాలు
సాక్షి, హైదరాబాద్: కమలనాథులు కట్టుదప్పారు. తాము కోరుకున్న స్థానాలు టీడీపీ ఎగరేసుకుపోయిందన్న ఆగ్రహంతో సోమవారం తమ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విధ్వంసం సృష్టించారు. నేతలు వారిస్తున్నా వినిపించుకోలేదు. ఓ దశలో కార్యాలయ అద్దాలను ధ్వంసం చేసేందుకూ ప్రయత్నించారు. తుదకు పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దాల్సి వచ్చింది. పొత్తులో భాగంగా బీజేపీకి అవకాశం దక్కని నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన నేతలు, కార్యకర్తలు పార్టీ కార్యాలయంలో తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డితో భేటీ కావాలని భావించారు.
తెలంగాణలో బీజేపీకి దక్కిన సీట్లలో కొన్నింటిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న కిషన్‌రెడ్డి.. కార్యాలయానికి రాలేదు. దీంతో తమ ఆవేదనను ఎవరికి చెప్పుకోవాలో అర్థంకాక ఎక్కడికక్కడ నిరసనలకు దిగారు. కార్యాలయం ప్రధాన ద్వారం, వెయిటింగ్ హాల్, కిషన్‌రెడ్డి చాంబర్ తదితర ప్రాంతాల్లో బైఠాయించారు. ఇంతలో అక్కడికి చేరుకున్న రంగారెడ్డి జిల్లా అర్బన్, రూరల్ కార్యకర్తలు సమావేశ మందిరం లో భేటీ అయి భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. నేతలు మాట్లాడుతుండగానే కొందరు కార్యకర్తలు ఆవేశానికి లోనై కుర్చీలను ధ్వంసం చేయడం ప్రారంభించారు. జహీరాబాద్ స్థానాన్ని గట్టిగా కోరుతున్న ఓ యువనాయకుడి వెంట వచ్చిన కార్యకర్తలు కూడా వీరికి జత కలవడంతో చూస్తుండగానే హాలంతా చిందరవందరగా మారిపోయింది.
భవనంపెకైక్కి యువకుడి హల్‌చల్
పార్టీ కార్యాలయంలో ఉద్రిక్త పరిస్థితుల మధ్యే.. సూర్యాపేట నియోజకవర్గానికి చెందిన కిరణ్ అనే యువకుడు కార్యాలయ భవనంపైకి ఎక్కి ఆత్మహత్యకు సిద్ధమవడంతో పరిస్థితి మరింత తీవ్రమైంది. నిజానికి సూర్యాపేట సీటును బీజేపీ గట్టిగా కోరుకుంది. సోమవారం టీడీపీ అభ్యర్థిని ప్రకటించడంతో బీజేపీ నేతలు అగ్గిమీదగుగ్గిలమయ్యారు. కార్యకర్తల ధర్నా.. యువకుని ఆత్మహత్యాయత్నంతో అక్కడి వాతావరణం వేడెక్కింది. పోలీసులు రంగప్రవేశం చేసి అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
మూకుమ్మడి రాజీనామాలు
రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల, మల్కాజిగిరి స్థానాల్లో ఏదైనా ఒక ఎంపీ సీటు, కనీసం ఏడు అసెంబ్లీ స్థానాలు బీజేపీకి దక్కాలనే డిమాండ్‌తో ఆ జిల్లా నేతలు తీర్మానించారు. ప్రస్తుతం కేటాయించిన మల్కాజిగిరి, ఉప్పల్ అసెంబ్లీ స్థానాల్లో ఒకటి టీడీపీకి ఇచ్చి బదులుగా కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లిలో ఏదైనా ఒకటి తీసుకోవాలని, వికారాబాద్‌కు బదులు చేవెళ్లను అడగాలని, ముందునుంచి పార్టీ కోసం పనిచేసిన వారికే టికెట్లు ఇవ్వాలంటూ రంగారెడ్డి జిల్లా నేతలు డిమాండ్లు చేశారు.
ఆ తర్వాత ఆవేశానికి లోనై అంతా మూకుమ్మడి రాజీనామాలకు దిగారు. అలాగే చేవెళ్ల, కూకట్‌పల్లి స్థానాలకు బీజేపీ నేతలు ప్రకాశ్, కాంతారావులు నామినేషన్ దాఖలు చేశారు. ఇక కంటోన్మెంట్ నుంచి జగదీశ్, కుత్బుల్లాపూర్, మేడ్చల్‌ల నుంచి మల్లారెడ్డి, మహేశ్వరం నుంచి శంకరరెడ్డి కూడా మంగళవారం నామినేషన్ దాఖలు చేయనున్నట్టు ప్రకటించారు. ఇతర నియోజకవర్గాల్లో కూడా సోమవారం పలువురు బీజేపీ నేతలు నామినేషన్లు దాఖలు చేశారు.