
హైదరాబాద్ లో బీజేపీ కార్యాలయం వద్ద జవదేకర్ కారును అడ్డుకుంటున్న కార్యకర్తలు
* టీడీపీతో పొత్తుపై ప్రకంపనలు
* పార్టీ కార్యాలయంలో ధర్నాలు
* బలమున్న స్థానాలు దక్కలేదని నిరసనలు
* జవదేకర్‌ను అడ్డుకున్న కార్యకర్తలు
* రాజీనామా బాటలో జిల్లాల అధ్యక్షులు
* తీవ్రంగా కలత చెందిన కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశంతో పొత్తు వ్యవహారం బీజేపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. చంద్రబాబు పార్టీతో పొత్తే వద్దని పార్టీ శ్రేణులన్నీ గట్టిగా డిమాండ్ చేస్తున్నా పరిగణనలోకి తీసుకోకపోవుడం ఆ పార్టీలో అసంతృప్తిని రగుల్చుతోంది. పైగా పొత్తులో భాగంగా పార్టీ బలంగా ఉన్న స్థానాలు పెద్దగా దక్కకపోవడాన్ని కమలనాథులు జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీకి పట్టున్న స్థానాలు దక్కలేదన్న విషయం బయటకు పొక్కడంతో.. ఆయా నియోజకవర్గాల నేతలు పార్టీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకుని ఆదివారం ధర్నాలు, ఆందోళనలతో అట్టుడికించారు. కోరిన స్థానాలు దక్కలేదన్న అసంతృప్తితో పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి కూడా తీవ్రంగా కలతచెందారు.
ఓ దశలో పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని యోచించినా.. హైకమాండ్ ముఖ్యుల సూచనలతో వెనక్కు తగ్గారు. కానీ తన ఆవేదనను మాత్రం బాహాటంగానే వెళ్లగక్కారు. పొత్తు చర్చలు జరిపిన పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జి ప్రకాశ్ జవదేకర్‌తోనూ అంటీముట్టనట్టే వ్యవహరించారు. ఆదివారం ఉదయం ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో ముభావంగా ఉండిపోయారు. పొత్తుకు సంబంధించి చంద్రబాబుతో కలిసి జవదేకర్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశానికీ దూరంగా ఉన్నారు.
సమావేశానికి రావాలని జవదేకర్ ఆహ్వానించినా ‘మీరే ప్రకటించుకోండి.. నేను రాను’ అని కరాకండిగా చెప్పేశారు. దీంతో ఆయన చేసేదేమీ లేక సీనియర్ నేత దత్తాత్రేయను వెంటబెట్టుకుని చంద్రబాబు నివాసానికి వెళ్లాల్సి వచ్చింది. కాగా, కోరిన స్థానాలు దక్కని కారణంతో తీవ్రంగా కలత చెందిన పలువురు నేతలు పార్టీకి రాజీనామా చేసేందుకు ఉపక్రమించారు. వరంగల్ అధ్యక్షుడు అశోక్‌రెడ్డి రాజీనామా చేసినట్టు ప్రకటించారు. మరికొందరు జిల్లా అధ్యక్షులు కూడా అదే బాట పడుతున్నట్టు సమాచారం.
అదుపు తప్పిన నేతలు.. జవదేకర్ ఘెరావ్
సాధారణంగా మిగతా పార్టీలతో పోల్చిస్తే క్రమశిక్షణ విషయంలో ఓ అడుగు ముందుండే కమలనాథులు ఆదివారం అదుపుతప్పారు. పార్టీ జాతీయ నాయకుడైన ప్రకాశ్ జవదేక్ పట్లనే దురుసుగా ప్రవ ర్తించారు. పొత్తు ప్రకటన చేసిన తర్వాత ఆయన ఆదివారం సాయంత్రం పార్టీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకుని పార్టీ ముఖ్యులతో భేటీ అయ్యారు. అనంతరం వెళ్లే క్రమంలో నగర నేతలు ఆయనను అడ్డగించారు. అప్పటికే పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్న నాయకులు, కార్యకర్తలు తొలుత పటాన్‌చెరు నియోజక వర్గాన్ని బీజేపీకి కేటాయించేలా చూడాలని డిమాండ్ చేశారు.
బీజేపీకి అనుకూలంగా, టీడీపీకి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. దీన్ని ఏమాత్రం పట్టించుకోకుండా జవదేకర్ తన కారెక్కి వెళ్లబోతుండగా కార్యకర్తలంతా అడ్డుతగిలి ఘెరావ్ చేశారు. మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా నినాదాలు చేయడంతో ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అన్నీ చక్కబడతాయని, మోడీని ప్రధాని చేయడమే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని జవదేకర్ సూచించారు. అయినా ఎవరూ వెనక్కు తగ్గకుండా కారు అద్దాలను చేతులతో బాదుతూ వాహనాన్ని ముందుకు కదలనివ్వలేదు. అక్కడే ఉన్న సీనియర్ నేత బద్దం బాల్‌రెడ్డి, మరికొందరు జవదేకర్‌కు రక్షణగా వెళ్లారు. దాదాపు అరగంట గడిచాక ఆయన కారు ముందుకు కదిలింది. ఆ తర్వాత కార్యకర్తలంతా కిషన్‌రెడ్డి చాంబర్ ముందు ధర్నా చేశారు.
ఇంతలో అక్కడికి వచ్చిన యెండల లక్ష్మీనారాయణతో వాగ్వాదానికి దిగారు. గోషామహల్, సూర్యాపేట, మేడ్చల్, కుత్బుల్లాపూర్ తదితర నియోజకవర్గాల నుంచి వచ్చిన కార్యకర్తలు కూడా నిరసనకు దిగడంతో పార్టీ కార్యాలయం నినాదాలతో దద్దరిల్లింది. రాత్రి కిషన్‌రెడ్డి వెళ్లిపోయేంతవరకు కార్యకర్తలు ఆందోళన చేస్తూనే ఉన్నారు. తమకు సమాధానం రాని పక్షంలో మూకుమ్మడిగా పార్టీకి రాజీనామా చేసి... రెండు పార్టీల అభ్యర్థులను ఓడిస్తామని ఆయా నియోజకవర్గాల నేతలు హెచ్చరించారు.