
బూత్ మేనేజ్‌మెంటే ప్రధానం
సాక్షి, న్యూఢిల్లీ: నగరంలోని ఏడు లోక్‌సభ స్థానాల నుంచి పోటీచేసే తమ అభ్యర్థుల కోసం బీజేపీ బుధవారం వర్క్‌షాప్ నిర్వహించింది. ఎన్నికల ప్రచారంలో ఏమేం చేయవచ్చు, ఏమేం చేయకూడదనే విషయాలు అభ్యర్థులకు తెలియచెప్పడంతో పాటు నరేంద్ర మోడీ మంత్రాన్ని కూడా అభ్యర్థులకు ఉపదేశించారు. ప్రచారవ్యూహాల నుంచి బూత్‌స్థాయి మేనేజ్‌మెంట్ వ రకు క్షుణ్ణంగా చర్చించిన ఒకరోజు వర్క్‌షాపులో ఏడుగురు అభ్యర్థులతోపాటు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులు, కౌన్సిలర్లు, ఢిల్లీ బీజేపీ కార్యవర్గం, జిల్లాస్థాయి కార్యవర్గం తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీని ప్రధానమంత్రిని చేయాలంటే అత్యధిక లోక్‌సభ సీట్లను గెలవాలని గుర్తించిన బీజేపీ ఏ అవకాశాన్ని వదలకుండా ఎన్నికలకు సమాయత్తమవుతోంది.
ప్రతీ లోక్‌సభ నియోజకవర్గంలో ప్రచార వ్యూహాల రూపకల్పనకు, అమలు చేసేందుకు పార్టీ ఒక ఇన్‌చార్జ్‌ను, కన్వీనర్‌ను నియమించింది. జాతీయ సమస్యలతో పాటు ప్రతి నియోజకవర్గంలో స్థానిక సమస్యల జాబితాను రూపొందించి నట్లు బీజేపీ నేత చెప్పారు.
అభ్యర్థుల జాబితాను ప్రకటించడంలో జాప్యమైనందువల్ల ఆ లోటును పూడ్చుకోవడం కోసం ముమ్మరంగా ప్రచారం చేయాలని పార్టీ నిర్ణయించింది. మార్చ్ 22న నామినేషన్ల గడువు ముగిసిన తరువాత ప్రచారం ఊపందుకుంటుందని పార్టీ నేతలు భావిస్తున్నారు.
సమర్థ నిర్వహణే గెలిపిస్తుంది...
బూత్ మేనేజ్‌మెంటే పార్టీని గెలిపిస్తుందని పార్టీ సీనియర్ నేత హర్షవర్ధన్ పేర్కొన్నారు. ఇందుకోసం పార్టీ కార్యకర్తలు తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుందని, ప్రతి ఓటరును పోలింగ్ బూత్ వద్దకు తీసుకురావాల్సిన బాధ్యత కూడా వారిదేనన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు చరిత్రాత్మకమైనవని, ఇందులో బీజేపీ చరిత్ర సృష్టించడం ఖాయమన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే దేశాన్ని పట్టిపీడిస్తున్న సమస్యలు దూరమవుతాయని, అందులో పార్టీ కాార్యకర్తలందరూ భాగస్వాములు కావాలన్నారు. ఎన్నికల్లో పార్టీని గెలిపించేందుకు తీసుకోవాల్సిన చర్యలను సవివరంగా కార్యకర్తలకు వివరించారు. అవి...
ఓటర్లతో ఎప్పటికప్పుడు మాట్లాడుతుండడం.
ప్రజల సమస్యల గురించి తెలుసుకొని, పరిష్కార మార్గాల కోసం ప్రయత్నించడం.
వివిధ స్థాయిల్లో తరచూ సమావేశాలు నిర్వహించడం. వాటిలో యువకులను, మహిళలను భాగస్వాములు చేయడం.
కొత్త ఓటర్లపై దృష్టి సారించి, వారిని పోలింగ్ బూత్ వరకు వచ్చి ఓటు వేసేలా చేయడం.
కలసికట్టుగా పనిచేయడం. నిజాయతీగా వ్యవహరించడం. ఆత్మవిశ్వాసంతో మాట్లాడడం.
వ్యతిరేక, అనుకూల బూత్‌ల జాబితాలను సిద్ధం చేసుకొని, పరిస్థితుల్లో మార్పు తీసుకొచ్చేందుకు వ్యూహాలు సిద్ధం చేయడం.
స్థానిక నాయకులు సత్ప్రవర్తనతో మెలగడం. ప్రజల అవసరాలేంటో గుర్తించి, ప్రచారాంశాల్లో వాటిని చేర్చడం.