సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తాము సమర్పించే అఫిడవిట్లను ఇక నుంచి కేంద్ర ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్‌లో ఈ ఫైలింగ్ ద్వారా సమర్పించడానికి కూడా తొలిసారిగా అవకాశం కల్పించారు. అభ్యర్థులు తాము నామినేషన్ దాఖలు చేసేప్పుడు నేర చరిత్ర, కేసులు, ఆస్తులు, అప్పులు, విద్యార్హతల వంటి అంశాలపై ప్రత్యేకంగా అఫిడవిట్లు సమర్పిస్తారు. అరుుతే వీరు ఇప్పటివరకు నోటరీ చేయించిన అఫిడవిట్లు సమర్పిస్తున్నారు.
తాజాగా ఈ ఫైలింగ్ ద్వారా ఆన్‌లైన్‌లో సమర్పించే వీలు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం ఆ మేరకు అన్ని రాష్ట్రాల ఎన్నికల ప్రధానాధికారులకు, గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర పార్టీలకు సమాచారమిచ్చింది. ఈ అఫిడవిట్లను ఇంగ్లీషులో లేదా హిందీలో మాత్రమే సమర్పించడానికి వీలుంది. అఫిడవిట్లలోని ఏ కాలమ్‌నూ ఖాళీగా వదిలివే సేందుకు వీల్లేదు. తప్పనిసరిగా పూరించాలి.
ఎందుకంటే ఈసీ ఇందుకోసం ప్రత్యేకంగా వినియోగిస్తున్న సాఫ్ట్‌వేర్ అసంపూర్తి అఫిడవిట్లను ఆమోదించదు. అప్పుడు సదరు అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది. అభ్యర్థి ఏదైనా సమాచారం దాచిపెడితే ఆ అభ్యర్థి నామినేషన్‌ను తిరస్కరించవచ్చన్న సుప్రీంకోర్టు ఇటీవలి ఉత్తర్వుల నేపథ్యంలో ఈసీ ఈ మేరకు చర్యలు చేపట్టింది.