పోరుకు సిద్ధం | candidates finalized to zptc,mptc at district wide | Sakshi
Sakshi News home page

పోరుకు సిద్ధం

Published Tue, Mar 25 2014 3:56 AM | Last Updated on Tue, May 29 2018 4:06 PM

candidates finalized to zptc,mptc at district wide

ఒంగోలు, న్యూస్‌లైన్: జిల్లాలోని ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి అభ్యర్థులు ఖరారయ్యారు. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియడంతో ఇక ప్రచారంపైనే దృష్టి సారించారు. అయితే ఈ పోరులో కాంగ్రెస్‌పార్టీ పూర్తిస్థాయిలో కుదేలైంది. కనీసం అభ్యర్థులను కూడా బరిలోకి దింపలేక చేతులెత్తేసింది. డీసీసీ అధ్యక్షుడు సైతం తన నియోజకవర్గంలోనే పూర్తిస్థాయిలో అభ్యర్థులను నిలబెట్టలేకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరో వైపు లోక్‌సత్తాతోపాటు కమ్యూనిస్టులు, బీజేపీ, బీఎస్పీల పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఆదివారం సాయంత్రానికి 539 మంది  జెడ్పీటీసీ అభ్యర్థులుగా బరిలో ఉన్నారు.

వారిలో 212 మంది సోమవారం నామినేషన్లు  ఉపసంహరించుకున్నారు. దీంతో బరిలో ఉన్న జెడ్పీటీసీ అభ్యర్థుల సంఖ్య 327 మంది. మొత్తం 790 ఎంపీటీసీ అభ్యర్థులకు సంబంధించి 17 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. వీటిలో వైఎస్సార్‌సీపీకి 9 స్థానాలు లభించగా టీడీపీకి 4, కాంగ్రెస్ పార్టీకి 4 స్థానాలు లభించాయి. మిగిలిన 773 స్థానాలకు ఎన్నికలు ఏప్రిల్ 6వ తేదీ జరగనున్నాయి. ఇక జెడ్పీ చైర్మన్ అభ్యర్థి పోరుకు సిద్ధం
 
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నూకసాని బాలాజీ గుడ్లూరు, పుల్లలచెరువు నుంచి నామినేషన్లు దాఖలు చేశారు. వాటిలో గుడ్లూరు నుంచి ఆయన ఉపసంహరించుకొని పుల్లలచెరువు నుంచి బరిలో ఉన్నారు. ఇక టీడీపీ నుంచి అభ్యర్థులుగా భావిస్తున్న మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ మన్నె రవీంద్ర దొనకొండ నుంచి పోటీ చేస్తున్నారు. టీడీపీ నుంచి జెడ్పీ చైర్మన్ పదవి ఆశిస్తున్న మరో అభ్యర్థి, ఒంగోలు మాజీ ఎమ్మెల్యే ఈదర హరిబాబు పొన్నలూరు మండలం జెడ్పీటీసీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు.
 
జనన మరణాల నివేదికలు సకాలంలో పంపాలి
ఒంగోలు సెంట్రల్, న్యూస్‌లైన్ : జనన మరణాల నివేదికలు సకాలంలో పంపాలని డెరైక్టరేట్ ఆఫ్ సెన్సస్ అదనపు డైరక్టర్ వై సుబ్రహ్మణ్యం ఆదేశించారు. పంచాయతీ కార్యదర్శుల నుంచి వచ్చే జనన మరణ నెలసరి నివేదికలు కౌంటర్ ఫైళ్లతో పాటూ సకాలంలో జనన మరణ రిజిస్ట్రార్ కార్యాలయానికి పంపడంలో జరుగుతున్న  జాప్యాలను పరిశీలించడానికి సోమవారం హైదరాబాద్ నుంచి జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా  కందుకూరు, పొన్నలూరు, సింగరాయకొండ, మర్రిపూడి, పొదిలి మండలాలను సందర్శించారు. వివిధ పంచాయతీలకు సంబంధించిన పంచాయతీ కార్యదర్శులతో క్షేత్ర స్థాయిలో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. పరిశీలనలో కుటుంబ నియంత్రణ గణాంక అధికారి పీ శ్రీధర్‌రావు, అబ్దుల్ కలాం, ఎల్‌డీ కంప్యూటర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement