వైఎస్‌ఆర్‌సీపీలో మైనారిటీలకు పెద్దపీట
- జెడ్పీకి నీలూఫర్
- మదనపల్లెకు షమీమ్ అస్లాం, పుంగనూరు మునిసిపాలిటీకి షమీం
- చైర్‌పర్సన్ అభ్యర్థులను ప్రకటించిన మిథున్‌రెడ్డి
మదనపల్లె, న్యూస్‌లైన్: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లీం మైనారిటీలకు పెద్దపీట వేసిందని రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి స్పష్టంచేశారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక కార్యాలయంలో శనివారం జరిగిన సమావేశంలో మిథున్‌రెడ్డి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్, మదనపల్లె, పుంగనూరు మునిసిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థులను ప్రకటించారు. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ అభ్యర్థిగా రొంపిచెర్లకు చెందిన నీలూఫర్, మదనపల్లె మునిసిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థిగా గుండ్లూరి షమీం అస్లాం, పుంగనూరు మునిసిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థిగా షమీంను ప్రకటించారు.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ముస్లీం మైనారిటీలకు రాజకీయ ప్రాధాన్యాన్ని కల్పిస్తూ అభ్యర్థులను ప్రకటించారని, ఇందులో భాగంగా మన జిల్లాలో కూడా ప్రకటించినట్లు మిథున్‌రెడ్డి తెలిపారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఇక్కడ కూడా ఆభ్యర్థులను ఖరారుచేసి ప్రకటించామని చెప్పారు.
మునిసిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థి గుండ్లూరి షమీమ్ అస్లామ్ మాట్లాడుతూపమాణ స్వీకారంచేసిన వెంటనే నీరుగట్టువారిపల్లెలో మరమగ్గాలు ఉన్న భవనాలను కమర్షియల్ నుంచి నాన్ కమర్షియల్‌కు మారుస్తామని చెప్పారు. పట్టణానికి శాశ్వత తాగునీటి పరిష్కారం కోసం ప్రతిపాదించిన సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు నిర్మాణానికి యుద్ధప్రాతిపదికన పనులు చేపడతామన్నారు. మైనారిటీల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హాజీ అక్తర్ అహ్మద్ మాట్లాడుతూ మైనారిటీలంతా పార్టీకి పట్టుకొమ్మల్లా ఉంటూ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల గెలుపుకోసం సైనికుల్లా పనిచేస్తారని తెలిపారు.
ఈ సమావేశంలో ఎమ్మెల్సీ దేశాయ్ తిప్పారెడ్డి, రాష్ట్ర బీసీ నాయకులు పాల్ బాలాజీ, జిల్లా యువజన విభాగం కార్యదర్శి ఎస్‌ఏ కరీముల్లా, సింగిల్ విండో చైర్మన్ ఆనంద్, సర్పంచ్ శరత్‌రెడ్డి, మైనారిటీల నాయకులు బాబ్‌జాన్, జింకా వెంకటా చలపతి, సురేంద్ర, లక్ష్మీనారాయణ, దండాల రవిచంద్రారెడ్డి, మహిళా నాయకులు కొంగా పద్మావతి, శ్రీదేవి,మల్లిక, వైజయంతి, గిరిజ, కార్యకర్తలు పాల్గొన్నారు.