చైర్మన్ కుర్చీ
ఓ భూ కబ్జాదారుడికి టీడీపీ అమ్మేసిందని ఆరోపణలు
తన భార్యను ఆ స్థానంలో కూర్చోబెట్టేందుకే బేరసారాలు
కదిరి, న్యూస్‌లైన్ : ఎన్నికలంటేనే.. అనేక జిమ్మిక్కులుంటాయి. అందులో ‘కుర్చీలు’ కొనడం కూడా పరిపాటి. కదిరి మునిసిపాలిటీలో ఇదే జరిగిందని విశ్వసనీయ వర్గాల భోగట్టా. మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని పట్టణంలో అక్రమార్జన పరుడైన ఓ రిటైర్డ్ ఉపాధ్యాయుడికి రూ.50 లక్షలకు అమ్మేశారని తెలుస్తోంది. టీడీపీ నాయకులు ఈ అమ్మకానికి సూత్రధారులన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఇప్పటికే మున్సిపాలిటీలో అక్రమ లే అవుట్‌లు వేసి పట్టణ ప్రజలను నిలువునా ముంచుతున్న సదరు వ్యక్తి.. తాను కౌన్సిల్‌లో అడుగు పెడితే.. తన ప్లాట్ల వ్యాపారానికి అడ్డూ అదుపూ ఉండదని, మూడు పువ్వులు, ఆరు కాయలుగా విస్తరింపజేసుకోవచ్చన్న ఆలోచనతోనే ‘చైర్మన్ కుర్చీ’ తమకే దక్కేలా టీడీపీ నేతలతో ఒప్పందం కుదుర్చుకుని కొనుక్కున్నట్లు తెలుస్తోంది. ఈయన తన భార్యను 8వ వార్డులో టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థిగా బరిలోకి దింపారని, ఆమెను చైర్మన్ స్థానంలో కూర్చోబెట్టేందుకే బేరసారాలు ఆడినట్లు ఆ పార్టీకి చెందిన కొందరు నాయకులు బాహాటంగానే చెబుతున్నారు.
సీపీఐ కదిరి డివిజన్ కార్యదర్శి వేమయ్య యాదవ్ సైతం ఇదే విషయాన్ని విలేకరుల సమావేశంలో ఆరోపించడం బలం చేకూరుస్తోంది. ‘ఆమె గెలిస్తే..ఈయన మున్సిపాలిటీని అమ్మేస్తాడు’ అందుకే ‘ఫ్యాను’కు ఓటేసి మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రుణం తీర్చుకుందామంటున్నారని విన్నవారు చెబుతున్నారు. 33వ వార్డులో సైతం టీడీపీ అభ్యర్థి శ్రీనివాసులు ప్రచారంలో ఓటర్ల నుంచి చేదు అనుభవం ఎదురవుతోంది. పూర్వాశ్రమంలో ఆయన లాటరీ టికెట్లు అమ్ముతుండేవాడు. అప్పట్లో పోలీసులకు పట్టుబడి కోర్టుకు హాజరైన సంఘటనలెన్నో ఉన్నాయి. క్రికెట్ బెట్టింగ్‌లో కేసు నమోైదె తే కోర్టులో జరిమానా చెల్లించి వచ్చాడు. దీంతో ప్రచారంలో అవస్థలు పడుతున్నానని తన మిత్రులతో వాపోయినట్లు సమాచారం.
కుటాగుళ్లలో 1 వార్డు టికెట్ ఆఖరు దాకా తనకే వస్తుందని ఆశపడిన నాగరాజుకు కాదని, డబ్బున్న మరో వ్యక్తికి ఇచ్చారని ప్రజలు చెబుతున్నారు. వేమయ్య యాదవ్ సైతం ఆరోపించాడు. రాష్ట్ర విభజన పాపం కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ అభ్యర్థులను వెంటాడుతోంది. ప్రచారంలో ఓటర్ల నుంచి చేదు అనుభవాన్ని వారు చవి చూస్తున్నారు.