ప్రజాగర్జన సభా ప్రాంగణం
శ్రీకాకుళం క్రైం, న్యూస్‌లైన్: ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. జిల్లాలో పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదు. ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వాలంటే అధినేత చంద్రబాబు పాల్గొనే ప్రజాగర్జన సభను ఎలాగైనా విజయవంతం చేయాల్సిందే. దీన్ని గుర్తుంచుకొని అందరూ పని చేయాలని పార్టీ హైకమాండ్ నుంచి ఆదేశాలు. ఇంతవరకు బాగానే ఉంది. ఎన్నికల సమయంలో ఏ పార్టీ అయినా తమ సభలు విజయవంతం కావాలనే కోరుకోవడం సహజం. కానీ దాని కోసం అడ్డగోలు విధానాలు అనుసరించడమే అభ్యంతరకరం. జిల్లా టీడీపీ నేతలు ఇప్పుడు చేస్తున్నదిదే. అధిష్టానం ఆదేశాలతో బుధవారం శ్రీకాకుళంలో జరగనున్న ప్రజాగర్జనను విజయవంతం చేయడానికి అవసరమైతే ఎన్నికల కోడ్ ఉల్లంఘించడానికి.. జిల్లా అధికార యంత్రాంగాన్ని సైతం తమకు అనుకులంగా ఉపయోగించుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ప్రజాగర్జన సభకు అధికార యంత్రాంగం ఇచ్చిన అనుమతులే దీనికి నిదర్శనం.
పరిశీలించకుండానే అనుమతులు ఎన్నికల కోడ్ అమలులో ఉన్న తరుణంలో రాజకీయ పార్టీలు సభల నిర్వహణకు పక్కాగా అన్ని అనుమతులు పొందాల్సి ఉం ది. జిల్లా అధికారులు, పోలీసు అధికారులు కూడా అన్నింటిని పరిశీలించి, నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాతే అనుమతులు మం జూరు చేయాలి. కానీ ఎటువంటి పరిశీలనలు లేకుండానే నిబంధనలకు వ్యతిరేకంగా అధికారులు టీడీపీ ప్రజాగర్జనకు అనుమతిలిచ్చేశారు. సభా ప్రాంగణం తమ పార్టీ నాయకుడు నాగవళి కృష్ణకు చెందినదని అనుమతి దరఖాస్తులో టీడీపీ నాయకులు పేర్కొన్నారు.
కానీ ఆ ప్రాంగణంలో దేవాలయ భూములతో పాటు కొంతమంది ఇతర వ్యక్తుల భూములు కూడా ఉన్నాయి. వాటన్నింటినీ కప్పిపుచ్చి మొత్తం నాగవళి కృష్ణకు చెందిన స్థలమేనని చెప్పి అనుమతులు పొందారు. ఆ స్థలాల యజమానులు ఎందురుంటే.. అంతమంది నుంచా సభా నిర్వహణకు తమకు అభ్యంతరం లేదంటూ అంగీకార పత్రాలు తీసుకొని పోలీసు అధికారులకు సమర్పించాల్సి ఉంది. వాటిని పరిశీలించి.. అన్నీ సవ్యంగా ఉన్నయని నిర్ధారించుకున్న తర్వాతే సభా నిర్వహణకు పోలీసు యంత్రాంగం అనుమతి ఇవ్వాలి. అటువంటివేవీ లేకుండానే టీడీపీ నాయకుల మాటలపై ఆధారపడి అడ్డగోలుగా అనుమతులిచ్చేశారు. దీనిపై అనుమతులిచ్చిన శ్రీకాకుళం డీఎస్పీ పి.శ్రీనివాసరావును వివరణ అడిగితే తమకేమీ సంబంధం లేదని, సభా ప్రాంగణంలో ఇతరుల భూములుంటే అది నిర్వాహకుల బాధ్యతేనని తేల్చేశారు. పరిశీలించకుండా అనుమతి ఇచ్చినా.. తమకు బాధ్యత లేదని పోలీసు అధికారి చెబుతున్నారంటే టీడీపీ నాయకులు ఏ స్థాయిలో వారిని మేనేజ్ చేశారో అర్థం చేసుకోవచ్చు.
మొద్దు నిద్రలో అధికార యంత్రాంగం
మరోవైపు ఈ విషయంలో జిల్లా అధికార యంత్రంగం ఏం చేస్తోందన్న ప్రశ్న తలెత్తకమానదు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో అంత పెద్ద ఎత్తున సభా ప్రాంగణ ఏర్పాట్లు జరుగుతుంటే.. అక్కడ నిబంధనలు పాటిస్తున్నారా లేదా అన్నది పరిశీలించకుండా మొద్దుగా నిద్రపోతున్నారు. నిబంధనలు పాటించాలని మైకులు ప్రచారంతో ఊదరగొట్టేస్తున్న అధికార యంత్రాంగానికి ప్రధాన మార్గంలోనే నిర్మిస్తున్న సభ ప్రాంగణంలో దేవాదాయ భూములు ఉన్న విషయం తెలియదా?.. తెలిసీ మౌనం వహిస్తున్నారా??