
బీసీ రామబాణానికి హనుమన్న అడ్డు!
రామయణ కాలంలో రామభక్త హనుమాన్ తన ఆరాధ్య దైవం ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాడు. సమకాలిన రాజకీయాల్లో అభినవ హనుమంతు చంద్రన్న రామబాణాన్ని గేలి చేశాడు. చంద్రన్న సంధించిన రామబాణం నకిలీదని ఎద్దేవా చేశాడు. చిత్రవిచిత్రాలకు నిలయమైన వర్తమాన రాజకీయాల్లో ఎన్నికల వేళ నాయకుల మధ్య మాటలు తూటాల్లా పేలుతున్నాయి.
తెలంగాణలో తమ పార్టీ అధికారంలోకి వస్తే బీసీని సీఎం పీఠం ఎక్కిస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు ఘనమై హామీయిచ్చారు. తన సంధించిన బీసీ రామబాణానికి ఎదురే లేదని ఆయన చెప్పుకొచ్చారు. దీనికి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి. హనుమంతరావు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు సంధించిన బీసీ రామబాణం డూప్లికేట్దని కొట్టిపారేశారు. చంద్రన్న బీసీ బాణానికి ఓట్లు రాలవని అన్నారు.
మరోవైపు చంద్రన్న సంధించిన బీసీ బాణం ఆయనకే ఎదురు తిరిగే పరిస్థితులు తలెత్తాయి. బీసీ ఉద్యమ నేత ఆర్. కృష్ణయ్యను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని బాబుపై బీసీ సంఘాలు ఒత్తిడి తెస్తున్నాయి. ఆర్. కృష్ణయ్యకు సీఎం పదవి ప్రచారంపై టీడీపీ సీనియర్ నేతలు గుర్రుగా ఉన్నారు. మేం పనికిరామా అంటూ నిష్టూరమాడుతున్నారు.