'అది తప్పో ఒప్పో పవన్ చెప్పాలి'
హైదరాబాద్: ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ వ్యవహారంలో బీజేపీ నేతలు సుష్మా స్వరాజ్, వసుంధర రాజే... ఓటుకు నోటు వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అవినీతిపై ప్రధాని మోదీ స్పందించకపోవడం సరికాదని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వీహెచ్ అన్నారు. కాంగ్రెస్ నేతలు అవినీతికి పాల్పడ్డారంటూ సీబీఐ చేత విచారణ చేయిస్తున్న కేంద్రం... ఎన్డీఏ నేతలను ఎందుకు విచారించడం లేదని వీహెచ్ ప్రశ్నించారు.
అవినీతిని ప్రశ్నిస్తానన్న టాలీవుడ్ హీరో పవన్ కల్యాణ్... ఇప్పుడు ఎందుకు నోరు విప్పడం లేదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం తప్పో, ఒప్పో పవన్ కల్యాణ్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఓటుకు నోటు కేసు నుంచి బయటపడేందుకు చంద్రబాబు కౌంటర్ ఎటాక్ మొదలుపెట్టారని విమర్శించారు. ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి ఇటువంటి చర్యలకు పాల్పడటం సరికాదని వీహెచ్ అన్నారు.