2009లోనూ ఇంతే... | Chandrababu Naidu makes canvassing of win before Votes counting | Sakshi
Sakshi News home page

2009లోనూ ఇంతే...

Published Fri, May 9 2014 2:16 AM | Last Updated on Sat, Sep 2 2017 7:05 AM

Chandrababu Naidu makes canvassing of win before Votes counting

* ప్రజా తీర్పుపై తీరు మారని బాబు
* కౌంటింగ్‌కు ముందే గెలుపుపై ప్రచారం
* 200 సీట్ల వరకూ గెలుచుకుంటామని ధీమా
* ఓట్ల లెక్కింపుకు ముందే స్వీట్ల పంపిణీ
* తీరా కౌంటింగ్‌లో ఓడినట్లు తేలటంతో డీలా
*  2004లోనూ ఇలాగే వ్యవహరించిన తీరు

 
సాక్షి, హైదరాబాద్: నాటికి నేటికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడులో ఎలాంటి మార్పూ రాలేదు. 2009 ఏప్రిల్ 23న సాధారణ ఎన్నికల పోలింగ్ జరగ్గానే ఇప్పుడు చెప్తున్న తరహాలోనే తమ పార్టీ భారీ మెజారిటీతో గెలుస్తున్నట్టు ప్రచారంలో పెట్టారు. ‘మీకోసం’ నుంచి ‘నగదు బదలీ’ వరకు అన్నీ బ్రహ్మాండంగా పనిచేశాయని పోలింగ్ జరిగిన తీరును విశ్లేషించారు. ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డిని ఉద్దేశించి నరకాసుర వధ పూర్తయిందన్నారు.
 
 ఇక మిగిలింది దీపావళి జరుపుకోవడమేనన్నారు. మహాకూటమి బాగా పనిచేసిందని.. రెండొందల సీట్లకు తక్కువ కాకుండా గెలుస్తామని.. ప్రజలు వైఎస్‌ను ఓడించారని చెప్పారు. ఆయన మాటలతో టీడీపీ శ్రేణులు ఎన్‌టీఆర్ భవన్ ముందు పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. నేతలు స్వీట్లు పంచుకున్నారు. ఈ మాటలన్నీ పోలింగ్ పూర్తయి కౌంటింగ్ జరగటానికి ముందు చెప్పినవే. ఆ తర్వాత విశ్రాంతి కోసం చంద్రబాబు విదేశీ పర్యటనకు వెళ్లారు. మళ్లీ వచ్చారు. పార్టీ నేతలతో సమీక్షలు నిర్వహించారు. గెలుపు ఖాయమంటూ చెప్పుకొచ్చారు. పోలింగ్ జరిగిన రోజు నుంచి గెలుస్తామంటూ కౌంటింగ్ వరకు ఒకటే హడావుడి. మే 16న కౌంటింగ్ జరిగి ఫలితాలు వెల్లడయ్యాయి. కౌంటింగ్‌కు ముందు చెప్పిన మాటలు, చేసిన హడావుడి అంతా ఉత్తుత్తిదే అని తేలిపోయింది. అప్పటి వరకు సంతోషాలు, సంబరాల్లో మునిగిపోయిన పార్టీ నేతలు ఒక్కసారిగా డీలా పడ్డారు. చంద్రబాబు మాటలు నమ్మి బెట్టింగ్‌ల్లో పాల్గొన్న నేతలు భారీ మొత్తాల్లో నష్టపోయారు. 2009 లోనే కాదు 2004 ఎన్నికల సందర్భంలోనూ చంద్రబాబు ఇదే విధంగా చెప్పారు.
 
 తీరా ఫలితాలు తారుమారయ్యాయి. 2009లో ఫలితాలు తారుమారు కాగానే పీఆర్పీ దెబ్బకొట్టిందన్నారు. తమ పథకాలు ప్రజలు నమ్మలేదన్నారు. గతంలో జరిగిన సంఘటనలు గుర్తుచేసుకుంటున్న ఆ పార్టీ నేతల  గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయి. సీమాంధ్రలో 120 స్థానాలు గెలుచుకుంటామని చంద్రబాబు చెప్తుండటం ఏమాత్రం నమ్మశక్యంగా లేదని టీడీపీ నేతలే అంటున్నారు. 120 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంటామని గురువారం మీడియా సమావేశంలో చెప్పి ఆ కొద్దిసేపటికే చంద్రబాబు కుటుంబ సమేతంగా విశ్రాంతి కోసం విదేశాలకు బయలుదేరారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement