
'ఎన్నికలొచ్చినప్పుడల్లా ఫొటో బయటకు తీస్తారు'
ఏ నాయకుడైతే ప్రజల గుండెచప్పుడు వింటాడో అలాంటి నాయకుణ్ని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు.
యలమంచిలి: ఏ నాయకుడైతే ప్రజల గుండెచప్పుడు వింటాడో అలాంటి నాయకుణ్ని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. 45 రోజుల్లో మన తలరాతలు మార్చే ఎన్నికలు రాబోతున్నాయని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖపట్టణం జిల్లా యలమంచిలిలో జరిగిన రోడ్ షోలో అశేష జనాన్ని ఉద్దేశించి జగన్ ప్రసంగించారు.
చంద్రబాబు పాలన తలచుకుంటే భయమేస్తుందని అన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు ఏనాడూ ప్రజలను పట్టించుకోలేదని విమర్శించారు. చంద్రబాబుకు విశ్వసనీయత లేదని, ఆయన ఇంతవరకు ఇచ్చిన ఏ హామీనీ అమలు చేయలేదన్నారు. రాష్ట్ర విభజనకు కారకుడైన చంద్రబాబు.. ఇప్పుడు సీమాంధ్రను సింగపూర్ చేస్తానంటూ వస్తున్నారని అన్నారు.
‘‘బాబు తీరు ఎలా ఉందంటే ఒక వ్యక్తిని తానే చంపి తిరిగి చనిపోయిన వ్యక్తికి నేనే దండవేస్తానని పరిగెత్తినట్టుంది. ఒకమనిషిని చంపి దండ వేయడమనేది ఆయనకు కొత్తేం కాదు. సొంత మామ ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి తిరిగి ఎన్నికలొచ్చినప్పుడల్లా ఆయన ఫొటో బయటకు తీసి దానికి దండేస్తుంటారు’’ అని ఘాటుగా విమర్శించారు. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులను గెలిపించాలని జగన్ కోరారు.