సాక్షి, గుంటూరు: 125 ఏళ్ల ఘన చరిత్ర ఉందని చెప్పుకొనే కాంగ్రెస్ పార్టీ జిల్లాలో ముఖ్యంగా నరసరావుపేట పార్లమెంటు పరిధిలో మచ్చుకైనా కనిపించని దుస్థితి నెలకొంది. రాష్ట్ర విభజనకు సహకరించిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ జిల్లాలో ప్రజాగ్రహానికి గురైంది. ఇతర పార్టీలతో పొత్తు కుదుర్చుకున్నా స్థానిక ఎన్నికల్లో నామివేషన్ వేసేందుకు సైతం అభ్యర్థులు లేని దైన్య స్థితిలో కాంగ్రెస్ కొట్టుమిట్టాడుతుంది.
కొన్ని చోట్ల ఒకరిద్దరు నామినేషన్లు వేసినప్పటికీ టీడీపీతో కుమ్మక్కై ప్రచారం సాగిస్తున్నారు. గురువారం ముగిసిన మండల, జెడ్పీ ఎన్నికల నామినేషన్లు పరిశీలిస్తే మాచర్ల నియోజకవర్గంలోని మాచర్ల, వెల్దుర్తి, రెంటచింతల, దుర్గి, కారంపూడి మండ లాల్లో జెడ్పీటీసీ అభ్యర్థిగా ఒక్కరు కూడా కాంగ్రెస్ తరఫున నామినేషన్ దాఖలు చేయలేదు.
ఈ ఐదు మండలాల్లో 70 ఎంపీటీసీ స్థానాలు ఉండగా కాంగ్రెస్ కేవలం నాలుగు చోట్ల మాత్రమే నామినేషన్లు వేయగలిగింది.తాజా మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ సొంత గ్రామమైన గురజాల నియోజకవర్గంలో సైతం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అధ్వానంగా ఉంది. గురజాల, మాచవరం, పిడుగురాళ్ల మండలాలకు జెడ్పీటీసీ అభ్యర్థులుగా కాంగ్రెస్ నుంచి ఒక్క నామినేషన్ కూడా దాఖలు చేయలేదు. ఈ నాలుగు మండలాల పరిధిలో 65 ఎంపీటీసీ స్థానాలు ఉండగా కేవలం 20 స్థానాలకు మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.
మరో తాజా మాజీ మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి సొంత నియోజకవర్గమైన నరసరావుపేట నియోజకవర్గంలో ఆయన ఎంత ప్రయత్నించినప్పటికీ పార్టీ తరఫున నామినేషన్లు దాఖలు చేసేందుకు ఎవరు ముందుకు రాలేదు.నరసరావుపేట మండలం నుంచి జెడ్పీటీసీ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసినప్పటికీ 27 ఎంపీటీసీ స్థానాలకు కేవలం 15 చోట్ల మాత్రమే నామినేషన్లు వేయించగలిగారు.
చెరిగిన ‘హస్త’ రేఖలు
Published Sat, Mar 22 2014 1:07 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement