ముద్దుగుమ్మలకు ఎన్నికల తిప్పలు
గ్లామర్ ప్రపంచంలో వారికి చుట్టూ బౌన్సర్లు ఉంటారు, దర్శకుల దగ్గర్నుంచి లైట్ బోయ్ వరకు ప్రతి ఒక్కరూ మేడమ్, మేడమ్ అంటూ అడుగులకు మడుగులొత్తుతారు. ఆ గ్లామర్ను ఉపయోగించుకుని రాజకీయాల్లోకి వద్దామనుకునేసరికల్లా వాళ్లకు ఎక్కడలేని తిప్పలు వచ్చిపడుతున్నాయి. ఒకప్పుడు హీరోయిన్ పాత్రలు, నిన్న మొన్నటివరకు అత్త పాత్రలలో నటించి.. ఈమధ్యకాలంలో భోజ్పురి సినిమాల్లో పాత్రలు వెతుక్కుంటున్న నటి నగ్మా. ఆమె ఇప్పుడు మీరట్ స్థానం నుంచి లోక్సభకు పోటీ చేస్తున్నారు. ఇప్పటికే మూడు నాలుగు సార్లు ఆమె మీద కొంతమంది తమ 'వీరాభిమానం' ప్రదర్శించారు.
గజరాజ్ సింగ్ అనే ఎమ్మెల్యే అయితే ఏకంగా ఆమెను ముద్దుపెట్టుకున్నారు కూడా. నగ్మాను బహిరంగంగా పొదివి పట్టుకుని మరీ బుగ్గమీద ముద్దుపెట్టుకున్నా కూడా సదరు గజరాజుపై కాంగ్రెస్ పార్టీ ఎలాంటి చర్యలు తీసుకోడానికి సాహసించలేకపోయింది. ఎందుకంటే, నగ్మాపోటీ చేస్తున్న నియోజకవర్గంలో ఉన్న ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆయనే. అందుకే ఆయన్ని ముట్టుకునే సాహసం పార్టీ చేయడం లేదు. పోనీలే అని నగ్మా కూడా చూసీ చూడనట్లు వదిలేసింది. అంతలోనే రెండు రోజుల్లోపే మరో సంఘటన జరిగింది. ఈసారి ఏకంగా ఓ వ్యక్తి మీరట్ సభలో ఆమె మీద చెయ్యేశాడు. దాంతో పట్టలేని కోపం వచ్చిన నగ్మా.. అతగాడి చెంప చెళ్లుమనిపించింది.
నగ్మా సంగతి ఇలా ఉంటే, అలనాటి కలల సుందరి (డ్రీమ్ గాళ్) హేమమాలిని పరిస్థితి కూడా ఏమంత భిన్నంగా లేదు. ఉత్తరప్రదేశ్లోని మథుర స్థానం నుంచి పోటీచేస్తున్న హేమ కూడా ప్రచారంలో చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. సభలకు వస్తున్న ప్రజలు ఆమెకు వీలైనంత దగ్గరగా వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో వీరిద్దరికీ అదనపు భద్రత కల్పించాలని ఎన్నికల కమిషన్ కూడా యూపీ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. వీళ్లిద్దరితో పాటు మొరాదాబాద్ నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి బేగమ్ నూర్ బానోకు కూడా అదనంగా భద్రత కల్పించాలని ఆదేశించింది.