పాంచ్ పటాకా:స్టార్ అభ్యర్థుల ప్రచార పాట్లు
ఎన్టీఆర్, ఎంజీఆర్ ల పుణ్యమా అని రాజకీయాల్లోకి సినీ స్టార్లు రావడం ఇప్పుడు మామూలైపోయింది. హీరోయిన్లు కూడా ఒకరొకరుగా రంగంలోకి దిగుతున్నారు. ఈ సారీ అయిదుగురు ప్రముఖ స్టార్లు రంగంలోకి దిగారు. వీరంతా ఫేడౌట్ అయిన స్టార్లే. కానీ స్టార్ స్టేటస్ కి మాత్రం ఏ మాత్రం కొరత లేదు. అయిదుగురు సినీ స్టార్ల ప్రచారం ఎలా ఉందో ఓ సారి చూద్దాం.
మూన్ మూన్ సేన్ - సిరివెన్నెల హీరోయిన్ మూన్ మూన్ సేన్ తృణమూల్ కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తోంది. తల్లి సుచిత్రా సేన్ పేరును, కూతుళ్లు రీమా, రైమా సేన్ పేర్లను చెప్పుకుని ప్రచారం చేసుకుంటోంది ఈ తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి. అంత వరకూ బాగానే ఉంది. కానీ ఈమె రోడ్ షో చేయాలంటే ముందు మొత్తం రోడ్డు రోడ్డంతా నీళ్లతో కళ్లాపి చల్లాలట. లేకపోతే ఆమె బండి కదలదు. చేయి ఊపదు. ఎందుకంటే దుమ్ము ధూళి నుంచి గ్లామర్ ను కాపాడుకోవడమే ఈ నడివయస్సు నటికి చాలా ముఖ్యం.
హేమా మాలిని - ఈ షోలే బసంతి గొడుగు లేకపోతే ప్రచారమే చేయదు. ఎండ, ఉక్కపోత అంటే ఈమెకు మహా ఎలర్జీ. అందుకే ఎయిర్ కండీషన్ కార్ నుంచి బయటకు రాను అంటూ మంకుపట్టు పడుతోందట. పాపం బిజెపి కార్యకర్తలు ఆమెను బ్రతిమలాడి, బామాలి కారు నుంచి బయటకు తెప్పించారు కానీ గొడుగు వదిలేలా చేయలేకపోతున్నారు. 'మన గుర్తు కమలం కాదు. గొడుగు అని ప్రజలు పొరబడతారేమో' అని బిజెపి కార్యకర్తలు భయపడుతున్నారట.
జయప్రద - రాజమండ్రి నుంచి బిజ్నోర్ కి చాలా దూరం. కానీ జయప్రదకు యూపీ రాజకీయాలు, యూపీ భాష బాగానే పట్టుబడ్డాయి. రెండు సార్లు ఎంపీ అయిన ఆమెకు అనుభవంలో కొరతేమీ లేదు. లేనిదన్నా ఒక్క సమయపాలనే. రాష్ట్రీయ లోకదళ్ తరఫున స్టార్ కాంపెయినర్ అయిన జయప్రద ఏడు గంటలకు ఒక సభకు రావాలంటే, ఆమె వచ్చే సరికి పది దాటిపోతుంది. ప్రచార సమయం అయిపోయింది కాబట్టి నమస్కారాలతో సరిపెట్టేస్తున్నారు.
నగ్మా - కాంగ్రెస్ తరఫున యూపీ నుంచే బరిలో ఉన్నారు. ఈమె రూటే వేరు. కార్యకర్తలు ఈమెను ముద్దు పెట్టుకుంటున్నారు. ఈమె వారిని లాగి లెంపకాయ కొడుతున్నారు. గురువారం ఈమె రోడ్ షో చేయాల్సి ఉంటే ఆమె వచ్చారు. కానీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆబ్సెంట్ అయిపోయారు. దాంతో ఆమెకు సినిమాల్లో వచ్చినట్టే కోపం వచ్చింది. రుసరుసలాడుతూ విసవిసా వెళ్లిపోయింది.
స్మృతి ఇరానీ - నటి నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వారిలో చాలా తక్కువ మంది స్మృతి ఇరానీలాగా తమను తాము మార్చుకోగలరు. ఆమె నిత్యం అధ్యయనం చేస్తారు. ఆమె బ్రహ్మాండమైన డిబేటర్. వాదనలో కానీ, ప్రసంగంలో కానీ ఆమెను తట్టుకోవడం ప్రత్యర్థులకు చాలా కష్టం. స్టార్ నకరాలు కనిపించకుండా జాగ్రత్త పడతారు స్మృతి. అయితే ఆమె పోటీ పడుతున్నది రాహుల్ గాంధీతో. ఆమె అన్నిటికీ సిద్ధమై రంగంలోకి దిగారు మరి.