హుస్నాబాద్, న్యూస్‌లైన్ : కాంగ్రెస్ నాయకులకు దమ్ము, సత్తా లేదని, వారు తెలంగాణను పాలించలేరని సినీనటుడు, జనసేన పార్టీ వ్యవస్థాపకుడు పవన్‌కల్యాణ్ అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ చేతిలో పెడితే దారుణమేనని అన్నారు. కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి సీహెచ్.విద్యాసాగర్‌రావుకు మద్దతుగా హుస్నాబాద్‌లో శనివారం నిర్వహించిన ఎన్నికల ప్రచారసభలో పవన్‌కల్యాణ్ పాల్గొన్నారు.
ఆయన ప్రసంగిస్తూ టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. రెండు ఎంపీ సీట్లున్న టీఆర్‌ఎస్‌తో తెలంగాణ రాలేదని, బీజేపీ మద్దతుతోనే చిరకాల స్వప్నం సాకారమైందని అన్నారు. కేసీఆర్ ఎంపీ సీట్లను రూ. 30 కోట్ల చెప్పున అమ్ముకున్నారని ఆరోపించా రు. సీమాంధ్రులను తిడుతూనే వారి సంబంధీకులకు టిక్కెట్లు ఇచ్చాడని ఆరోపించారు. కేసీఆర్‌కు అధికారంపై ఉన్న ఆరాటం అభివృద్ధిపై లేదన్నారు. కాంగ్రెస్‌ను దేశం నుంచి సాగనంపాలని, కేంద్రంలో ఎన్డీఏకు అధికారం అప్పగించాలని పిలుపునిచ్చారు.
నరేంద్రమోడీ బలమైన నాయకుడని, బీజేపీపై తనకు నమ్మకం ఉందని చెప్పారు. ఎంపీ అనుకుంటే నిలబడి పనులు చేయాలని, ఆ సత్తా ఉన్న విద్యాసాగర్‌రావును కరీంనగర్ ఎంపీగా గెలిపించాలని కోరారు. కేవలం ఎన్నికలప్పుడే రావడం కాదని, ఓట్లు అడిగి ముఖం చాటేయడం చేతకాదని, మళ్లీ హుస్నాబాద్ వచ్చి ప్రజల సమస్యలపై పోరాటం చేస్తానని అన్నారు. పెద్దపల్లి టీడీపీ, రామగుండం బీజేపీ అభ్యర్థులైన గుజ్జుల రామకృష్ణారెడ్డి, సీహెచ్.విజయరమణారావులకు మద్దతుగా ప్రచారం నిర్వహించాల్సి ఉందని, హెలిక్యాప్టర్‌లో సాంకేతిక కారణాల వల్ల అక్కడకు వెళ్లలేకపోయానని, దానికి చింతిస్తున్నానని తెలిపారు.
వారిద్దరిని సైతం గెలిపించాలని కోరారు. ఎన్నికల్లో ఓటు వేయడం బాధ్యతగా తీసుకోవాలని, మన భవిష్యత్తును ఆ ఒక్క రోజే నిర్ణయిస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. సభలో మాట్లాడే ముందు పవన్‌కల్యాణ్ తెలంగాణ అమరుల ఆత్మశాంతి కోసం మౌనం పాటించి నివాళులు అర్పించారు. సభలో కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి సిహెచ్.విద్యాసాగర్‌రావు, బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి పి.సుగుణాకర్‌రావు, అప్కాబ్ మాజీ చైర్మన్ దేవిశెట్టి శ్రీనివాసరావు, బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కొత్త శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ సాయుధ పోరాటమే స్ఫూర్తి..
తెలంగాణ సాయుధ పోరాటమే తనకు స్పూర్తి అని, సమాజంలో అన్యాయం జరిగితే ఎదుర్కొనే ధైర్యాన్ని ఇచ్చిందని పవన్‌కల్యాణ్ తెలిపారు. టీఆర్‌ఎస్ పుట్టకముందు నుంచే తనకు తెలంగాణపై ప్రేమ ఉందన్నారు. సాయుధ పోరాట చరిత్రను చదవి తాను స్ఫూర్తి పొందానని చెప్పారు.
పొన్నం.. కేసీఆర్‌ను ఏంజేత్తండ్రు..
‘ఈ జిల్లాకు చెందిన పొన్నం ప్రభాకర్ నన్ను తిడుతున్నాడు.. పొన్నం.. సరే అబ్బ.. నన్నుతిడితే నేను పడతా.. కానీ కేసీఆర్ మిమ్మల్ని సవటలు.. సన్నాసులు అని తిడుతుంటే ఏమీ మాట్లాడరు.. మీ నాయకురాలిని.. మిమ్మల్ని బూతులు తిట్టినా స్పందించరు. నాపై మాత్రం విమర్శలు చేస్తారా..’ అని పవన్‌కల్యాణ్ ప్రశ్నించారు.
కాంగ్రెస్‌కు పాలించే సత్తా లేదు
Published Sun, Apr 27 2014 3:19 AM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM
Advertisement
Advertisement