ఎవుసం.. ఏడుపే
కాంగ్రెస్ మేనిఫెస్టో(ఓపెన్ డయాస్): పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యం ద్వారా వ్యవసాయరంగంలో పెట్టుబడులు పెంచడం, తద్వారా శీతల గిడ్డంగులు, వేర్‌హౌజ్‌ల ఏర్పాటు, నాణ్యతాప్రమాణా పెంపు తదితర అంశాలపై దృష్టిపెడ్తామని పేర్కొంది. ఇందులో కూడా వ్యవసాయరంగాన్ని కార్పొరేటీకరణ చేసే ఉద్దేశమే కనిపిస్తోంది. దీనివల్ల భూ కమతాల విస్తీర్ణం పెరిగి చిన్న, మధ్యతరహా రైతులు వ్యవసాయానికి దూరం అయ్యే ప్రమాదముంది.
మీ వాణి.. మా ప్రతిన(యువర్ వాయిస్.. అవర్ ప్లెడ్జ్)’ పేరుతో బుధవారం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. సమ్మిళిత అభివృద్ధే లక్ష్యమంటూ, ఈ మేనిఫెస్టో ఆ దిశగానే రూపొందించామంటూ కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. ఇది యువత, పేదల మేనిఫెస్టో అంటోంది. అయితే, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా, వారి సమస్యలను పరిష్కరించేలా ఆ మేనిఫెస్టో లేకపోవడం చాలామందిని నిరాశకు గురిచేసింది. మేనిఫెస్టోలో సగానికి పైగా గత పథకాల ఏకరువు, వాటిని కొనసాగిస్తామన్న హామీలే ఉన్నాయి. యూపీఏ1, యూపీఏ2 లకు భిన్నంగా 2014లో ఎలాంటి హామీలు లేకపోవడం గమనార్హం.
* వ్యవసాయానికి సంబంధించిన అనేక క్షేత్రస్థాయి సమస్యల పరిష్కారాలను అందులో ప్రస్తావించలేదు. దేశవ్యాప్తంగా అనేక సంప్రదింపులు జరిపి మేనిఫెస్టోను రూపొందించామన్న రాహుల్‌గాంధీ మాటలు నీటి మూటలేనని తేలింది. వ్యవసాయరంగ ప్రతినిధులు చేసిన సూచనలేవీ మేనిఫెస్టోలో లేవు.
* వివిధ రంగాలకు సంబంధించి ప్రజలు, ప్రతినిధుల నుంచి చాలా మంచి సూచనలు వచ్చాయి. అయితే, వాటిని పట్టించుకున్న నాధుడు లేడు. అన్ని సూచనలను రికార్డు చేశామని, వాటిని మేనిఫెస్టో రూపకల్పనలో పరిగణనలోకి తీసుకుంటామని నిర్వాహకులు చెప్పారు. కానీ వాస్తవానికి అలా జరగలేదు. అలాంటి ఒక సంప్రదింపుల కార్యక్రమంలో.. ప్రజల నుంచి వచ్చిన సూచనలు, సలహాలతో నిండిన పెట్టెను అలా వదిలేసి.. రాహుల్‌గాంధీ వెనక ఆ కార్యక్రమ నిర్వాహకులు వెళ్లిపోవడం కనిపించింది.
* కీలకమైన వ్యవసాయ శాఖను తామే అట్టిపెట్టుకోకుండా.. సంకీర్ణ పక్షం ఎన్‌సీపీ నేత శరద్‌పవార్‌కు కట్టబెట్టడం కాంగ్రెస్ చేసిన పెద్ద తప్పు. సాధారణంగా అధికార పార్టీ సభ్యుడే వ్యవసాయ శాఖ మంత్రిగా ఉంటారు.
* మల్టీ బ్రాండ్ రీటైల్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ)కు ఆమోదం తెలపడం రైతుల సమస్యలకన్నింటికీ ఏకైక పరిష్కారమని కాంగ్రెస్ పార్టీ నమ్ముతున్నట్లు కనిపిస్తోంది. అందుకే తన మొట్టమొదటి హామీలోనే ‘రైతులు తమ దిగుబడులకు అత్యధిక విలువ దక్కే విధంగా చూస్తాం’ అని పేర్కొంది. అయితే, అమెరికానే అలా చేయలేకపోయింది. మరి వ్యవసాయ శాఖకు సొంత మంత్రిని కూడా నియమించుకోలేని కాంగ్రెస్ దాన్ని సాధ్యం చేయగలుగుతుందా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
* జన్యు పరివర్తిత పంటల గురించి మేనిఫెస్టోలో ఎలాంటి ప్రస్తావన లేదు. అయితే, వ్యవసాయ పరిశోధనలకు, వ్యాధినిరోధక పంటలు, పశుసంపద అభివృద్ధికి ప్రత్యేక నిధులను కేటాయిస్తామని మాత్రం పేర్కొంది.
* గతంలో మూడు రెట్లు పెంచామన్న చరిత్రను చెప్పడం తప్పితే.. కనీస మద్దతు ధర గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. మరిన్ని పంటలకు కనీస మద్దతు ధరను వర్తింపజేస్తామన్న ప్రస్తావనా లేదు.
* {పైవేటు రంగానికి అవకాశం కల్పించే ఉద్దేశంతో పంటల బీమా విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరైటైజేషన్ చేసే లక్ష్యంలో 2013లోనే పంటల బీమా పథకంలో దీనిని శరద్‌పవార్ చేర్చారు.
* కోళ్ల పెంపకం కేంద్రాల నిర్మాణం, మత్స్యపరిశ్రమ కోసం చెరువుల నిర్మాణాలను ఉపాధి హామీ పథకంలో చేరుస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. అయితే, ప్రభుత్వ నిధులతో పౌల్ట్రీ షెల్టర్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు. అలా చేయమని ఎవరూ అడగనూ లేదు. అలా గే, చెరువుల నిర్మాణం ఇప్పటికే ‘ఉపాధి హామీ’లో ఉంది.
* పశుసంపద అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు. అయితే, వ్యవసాయాధారిత రంగాలు, పాడిరైతులు, గొర్రెలు, మేకల పెంపకందారుల వాస్తవ సమస్యల పరిష్కారం దిశగా ఏ ప్రస్తావనలు లేవు.
* మత్స్యపరిశ్రమకు ప్రత్యేక శాఖను ఏర్పాటుచేయనున్నట్లు తెలిపారు. కానీ ఈ నిర్ణయం వెనుక మేనిఫెస్టో రూపకల్పనలో ప్రధాన పాత్ర పోషించిన ఒక వ్యక్తి ప్రభావం ఉన్నట్లు కనిపిస్తోంది.
* గ్యాస్, బొగ్గు కుంభకోణాలను దృష్టిలో పెట్టుకుని.. సహజవనరుల కేటాయింపులకు సంబంధించి పారదర్శక విధానాన్ని అవలంబిస్తామని, కేటాయింపుల పర్యవేక్షణకు స్వతంత్ర నియంత్రణాధికారిని నియమిస్తామని పేర్కొంది.
* ‘అన్ని పేద కుటుంబాలకు ఇళ్లు’ అనే హక్కును కల్పిస్తామని, రెండు దశాబ్దాలకు పైగా ఉంటున్నవారికి భూములపై హక్కు కల్పిస్తామని హామీ ఇచ్చింది. కానీ దీని ఆచరణసాధ్యత అనుమానమే.
* స్వలింగ సంపర్కం నేరం కాదని, చట్టాన్ని రూపొందిస్తామని పేర్కొంది.
* మొత్తమ్మీద కాంగ్రెస్ మేనిఫెస్టోలో సమగ్రత లోపించింది. వాస్తవ సమస్యలను పట్టించుకోలేదు. చేనేత రంగం ప్రస్తావనే లేదు. మేనిఫెస్టో చూసి చాలామంది కాంగ్రెస్ కార్యకర్తలు నిరాశకు గురయ్యారు. ఒక ‘కుటుంబ స్వచ్ఛంద సంస్థ’కు చెందిన ముఖ్యుడి ప్రభావం మేనిఫెస్టోపై ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది.
- డాక్టర్ డీ నరసింహారెడ్డి
వ్యవసాయ రంగ విశ్లేషకులు