
నమ్మించి గొంతు కోసేలా ఉంది
టీడీపీ మేనిఫెస్టో తెలంగాణ ప్రజలను నమ్మించి గొంతుకోసేలా ఉందని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు విమర్శించారు. పోలవరం డిజైన్ మార్పు, ఉద్యోగుల స్థానికతపై ఈ మేనిఫెస్టోలో ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు.
టీడీపీ మేనిఫెస్టోపై హరీష్‌రావు ధ్వజం
సంగారెడ్డి: టీడీపీ మేనిఫెస్టో తెలంగాణ ప్రజలను నమ్మించి గొంతుకోసేలా ఉందని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు విమర్శించారు. పోలవరం డిజైన్ మార్పు, ఉద్యోగుల స్థానికతపై ఈ మేనిఫెస్టోలో ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు. మంగళవారం సంగారెడ్డిలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా విద్యాసంస్థల్లో ఉమ్మడి ప్రవేశాలు ఎందుకని, దీనిపై టీడీపీ ఎందుకు ప్రస్తావించలేదన్నారు.
ఎర్రబెల్లి, మోత్కుపల్లిల ఫొటో లు కనీసం మేనిఫెస్టోలో పెట్టుకోవడానికి కూడా పనికి రావా? అని నిలదీశారు. ఎన్టీఆర్ అమలుచేసిన సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని ఎత్తివేసి, వీధికో బెల్టుషాపు పెట్టించిన చంద్రబాబు.. ఇప్పుడు బెల్టు దుకాణాలు రద్దు చేస్తానని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. పొత్తుల కోసం బాబు బీజేపీ కాళ్ల మీద పడుతున్నారన్నారు.