పొత్తుల కల్లోలం | declare a stalemate seats. | Sakshi
Sakshi News home page

పొత్తుల కల్లోలం

Published Sun, Apr 13 2014 4:07 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

పొత్తుల కల్లోలం - Sakshi

పొత్తుల కల్లోలం

టీడీపీలో ఆరని జ్వాల


 సీట్లు కోల్పోనున్నామని తెలుగుతమ్ముళ్ల  బెంగ
 ముస్లిం, క్రిష్టియన్ ఓటర్ల ప్రభావం పడుతుందని ఆవేదన

 
 సాక్షి ప్రతినిధి, కడప: ‘కొండనాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడినట్లు’గా తెలుగుదేశం, బీజేపీ పొత్తు నిలుస్తోంది. భారతీయ జనతా పార్టీతో పొత్తు కారణంగా తెలుగుతమ్ముళ్లు చిర్రెత్తుతున్నారు. అధికారంలోకి వస్తామనే ఊహాల్లో చంద్రబాబు విహరిస్తుంటే, సీట్లు కోల్పోతున్నామనే బెంగతో కొందరు, ఏకంగా రాజకీయ భవిష్యత్తే తెరమరుగవుతున్నదని మరికొందరు మదనపడుతున్నారు. మొత్తంమీద జిల్లా టీడీపీలో అంతర్మధనం తీవ్రతరమైంది.


 రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను అడుగడుగునా తీసుకుంది. వాటిని ఎండగడుతూ ప్రజావిశ్వాసాన్ని చూరగొనాల్సిన ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ అధికార పక్షానికి అండగా నిలిచింది. అధికార పార్టీపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెడితే విప్ జారీ చేసి ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేసి అధికారంలో నిలిపిన ఏకైక ప్రతిపక్ష చరిత్రను తెలుగుదేశం పార్టీ దక్కించుకుంది. నిస్సిగ్గుగా అధికార పార్టీకి అండగా నిలిచిన ప్రతిపక్ష నేతగా చంద్రబాబు కీర్తి గడించారు. ఇది చాలదన్నట్లు రాష్ట్ర విభజన అంశంలో సైతం తెలుగుదేశం పార్టీ నేల విడిచి సాము చేసింది.

 

ప్రజలకు అండగా ఉండాల్సిన ప్రధాన ప్రతిపక్షం రెండు కళ్ల సిద్ధాంతంతో వ్యవ హరించి, తెలంగాణకు అనుకూలంగా నిలిచింది. దీంతో ఆపార్టీ పూర్తి స్థాయిలో ప్రజా విశ్వాసం కోల్పోయింది. ఎన్నికలు సమీపించే కొద్దీ రకరకాల జిమ్మిక్కులు ప్రదర్శిస్తూ తనకు తానుగా బలపడ్డాననే భావనను వ్యక్తం చేస్తూ లేని ఊపును తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నట్లు పరిశీలకులు పేర్కొంటున్నారు. రాజకీయంగా కాలం చెల్లిన నేతలను అక్కున చేర్చుకుంటూ బలం పెరిగిందని తనకు తాను సర్టిఫికేట్  ఇచ్చుకున్నట్లు భావిస్తున్నారు. ఈనేపధ్యంలో తాజాగా బీజేపీ పొత్తుతో తెలుగుతమ్ముళ్లు కుదేలవుతున్నారు.


 శాపంగా మారిన పొత్తు వ్యవహారం....
 రాజకీయంగా ఈమారు అదృష్టాన్ని పరీక్షించుకోవాలనే భావిస్తున్న తెలుగు తమ్ముళ్లకు బీజేపీ పొత్తు శాపంగా పరిగణించిందని పరిశీలకులు పేర్కొంటున్నారు. ఇరువురి మైత్రిలో భాగంగా కడప, రాజంపేట అసెంబ్లీ, రాజంపేట పార్లమెంటు స్థానాలను బీజేపీ కోరుతోంది. అయితే కడప అసెంబ్లీ, రాజంపేట పార్లమెంటు సీట్లు బీజేపీకి  ఖరారైనట్లు తెలుస్తోంది. రాజంపేట అసెంబ్లీ వ్యవహారంలో కొంత ప్రతిష్టంభన నెలకొన్నట్లు సమాచారం.

 

ఆసీటు కూడా తమకే దక్కనుందనే విశ్వాసాన్ని భాజపా శ్రేణులు పేర్కొంటున్నాయి. దీంతో తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్రంగా మదనపడుతున్నారు. కడపలో టీడీపీ టికెట్ కోసం ఇంతకాలం మూడు గ్రూపులు, ఆరు వర్గాలుగా పార్టీ నేతలు వ్యవహరించారు. ప్రస్తుతం బీజేపీకి కేటాయించడంపై టీడీపీ శ్రేణులు జీర్ణించుకోలేని పరిస్థితి నెలకొంది. అలాగే టీడీపీ టికెట్ ఆశించి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్న మాజీ కాంగ్రెస్ నేత మేడా మల్లికార్జునరెడ్డి పరిస్థితి ‘కుడితిలో పడ్డ ఎలుక’అన్న చందంగా తయారైందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

 

వీరి పరిస్థితి ఇలా ఉంటే ప్రధానంగా జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు, కమలాపురం నియోజకవర్గాలకు చెందిన నాయకులకు బీజేపీతో పొత్తు మింగుడు పడని వ్యవహారంగా కన్పిస్తోందని పరిశీలకులు పేర్కొంటున్నారు. ఎంతో కొంత పోటీ ఇవ్వగలమనే భావనలో ఉన్న ఆయా ప్రాంతాల నేతలకు ముస్లీం, క్రిష్టియన్ మైనార్టీ ఓట్లను కోల్పోవాల్సి వస్తుందనే అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో గెలుపును ప్రభావితం చేసే స్థితిలో ఆయా వర్గాలు ఉండడమే అందుకు కారణంగా పలువురు చెప్పుకొస్తున్నారు.
 
 సీట్లు ప్రకటించడంలో ప్రతిష్టంభన...
  బీజేపీ పొత్తు కారణంగా ఒక విధమైన బెంగతో వ్యవ హరిస్తున్న తెలుగుదేశం పార్టీ నేతల్లో కొందరికి సీట్ల కేటాయింపులో సైతం మరో రకమైన బెంగ తప్పలేదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. టీడీపీ రెండు విడతలుగా జాబితాను ప్రకటిస్తే జిల్లాలో ఐదుగురి పేర్లు మాత్రమే ప్రకటించారు. జిల్లా అధ్యక్షుడు, ఏకైక ఎమ్మెల్యేగా ఉన్న మల్లేల లింగారెడ్డి పేరు రెండు జాబితాల్లో లేకపోవడాన్ని ఆయన అనుచరులు జీర్ణించుకోలేకున్నారు.

 

‘ముందుచొచ్చిన చెవులు కంటే వెనుక వచ్చిన కొమ్ములు వాడి’ అన్నట్లుగా తెలుగుదేశాధీశుని వైఖరి కన్పిస్తున్నదని వారు బహిరంగంగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు. అదే పరిస్థితి రాయచోటిలో సైతం ఉత్పన్నమైంది. పార్టీకి అండగా నిల్చిన మాజీ ఎమ్మెల్యే పాలకొండ్రాయుడు కుటుంబాన్ని కాదని మాజీ ఎమ్మెల్యే రమేష్‌రెడ్డిని ప్రోత్సహిస్తుండటంతో రగిలిపోతున్నట్లు సమాచారం. అటు పొత్తు ఇటు అధినేత వైఖరితో జిల్లాలోని తెలుగుతమ్ముళ్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement