ఓర్వలేకే ఆరోపణలు: వి.దినేశ్‌రెడ్డి | Dinesh reddy slams yellow medias | Sakshi
Sakshi News home page

ఓర్వలేకే ఆరోపణలు: వి.దినేశ్‌రెడ్డి

Published Thu, Apr 10 2014 2:27 AM | Last Updated on Wed, Sep 5 2018 3:24 PM

ఓర్వలేకే ఆరోపణలు: వి.దినేశ్‌రెడ్డి - Sakshi

ఓర్వలేకే ఆరోపణలు: వి.దినేశ్‌రెడ్డి

ఇంటర్వ్యూ: దినేశ్‌రెడ్డి
* వీస్తోంది జగన్ ప్రభంజనమే
* రాజన్న ఆశయాలే జగన్ శ్వాస
* అందుకే వైఎస్సార్‌సీపీలో చేరా
* తెలంగాణతో విడదీయలేని బంధం
* అధికారిగానూ సహకరించా
* టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు చేస్తా

 
వనం దుర్గాప్రసాద్: హోరెత్తుతున్న జగన్నినాదం కొన్ని రాజకీయ పార్టీలకు గుండెదడ పుట్టిస్తోందని, దీన్ని అడ్డుకోవడానికి 420 ఆలోచనలు చేస్తున్నారని మాజీ డీజీపీ వి.దినేశ్‌రెడ్డి మండిపడ్డారు. ఈ తప్పుడు ప్రచారానికి ఎల్లో మీడియా బ్యానర్లు కడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దశాబ్దాల రాష్ట్ర గతినే మార్చిన దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆలోచనల వారసుడిగా ఎదిగిన జగన్‌కే జనం పట్టం కడతారని దినేశ్ స్పష్టం చేశారు. రాజకీయ పబ్బం కోసం అవినీతి మచ్చ వేస్తున్న పార్టీలు, నేతలు... జనమంతా జగన్ వైపే ఎందుకున్నారో ఒక్కసారి ఆలోచించాలని కోరారు. తెలంగాణతో విడదీయలేని బంధమే ఈ ప్రాంతంలో తనను ప్రజాసేవకు పురిగొల్పిందంటున్న దినేశ్‌రెడ్డి ‘జనాయుధం’తో ప్రత్యేకంగా మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే..
 
 పోలీసు విభాగంలో 36 ఏళ్లు నిస్వార్థ సేవ చేసిన నేను అనేక ఉన్నత పదవులు నిర్వహించా. ప్రజలకు మేలు చేసే సంస్కరణలు తీసుకొచ్చా. పదవీ విరమణ తర్వాత కూడా సమాజానికి సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి వచ్చాను. అయితే ఎంతోమంది ముఖ్యమంత్రులతో కలిసి పనిచేసిన నాకు వైఎస్ రాజశేఖరరెడ్డితో పనిచేసే అవకాశం రావడం ఒక కొత్త అనుభవాన్ని ఇచ్చింది. ఉన్నతాధికారిగా ఆయన వద్దకు వెళ్లిన ప్రతిసారీ ఆయన ప్రజల గురించే మాట్లాడేవారు. ఆయన తనయుడు జగన్‌మోహన్‌రెడ్డి కూడా అంతే. నిత్యం ప్రజల గురించే ఆలోచిస్తారు. వారికే అంకితమవ్వాలనే ఆకాంక్ష  ఆయనది. ఇవే నన్ను ఆకర్షించాయి. ఆయన నేతృత్వంలోనే ముందుకెళ్లాలని నా అంతరాత్మ చెప్పింది. దాంతో వైఎస్సార్‌సీపీలో చేరా.
 
 టీడీపీవి 420 ఆలోచనలు
 జగన్‌మోహన్‌రెడ్డిపై టీడీపీ చేస్తున్న ఆలోచనల్లో అర్థం లేదు. అందంతా నాన్‌సెన్స్. ఏ ఆధారంతో ఆయనపై నిందలు వేస్తున్నారో అర్థం కావడం లేదు. ఇదంతా వైఎస్ వ్యతిరేక శక్తుల కుట్రగా భావించాలి. అవన్నీ 420 ఆలోచనలు. ఈ ఆరోపణలు చూస్తుంటే నాక్కూడా బాధేస్తోంది. మాజీ పోలీసు అధికారిగా నాకున్న సమాచారంతో చెబుతున్నా. జగన్‌పై ఓ వర్గం కుట్ర చేస్తోంది. దీని వెనుక ప్రజా విశ్వాసం కోల్పోయిన పార్టీలున్నాయి. నాయకులున్నారు. ఈ శక్తులకు వత్తాసు పలుకుతూ ఎల్లో పత్రికలు జగన్‌పై ముప్పేట దాడికి దిగాయి. వీటన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారు. ఎల్లో మీడియా వాస్తవ రూపాన్ని వారు అర్థం చేసుకుంటున్నారు. ఎవరెన్ని అనుకున్నా ఒక్కటి మాత్రం నిజం. ప్రజలందరూ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారు.
 
 వైఎస్ స్మృతులను చెరిపేసే కుట్ర

 నా సర్వీసులో ఎన్నో కేసులు చూశాను. ఆ అనుభవంతోనే చెబుతున్నా. జగన్‌మోహన్‌రెడ్డిపై చేసిన ప్రతీ ఆరోపణలోనూ రాజకీయ కోణమే కన్పిస్తోంది. మొదట్లో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని కేసును సీబీఐకి అప్పగించారు. ఏం తేలింది? చార్జిషీట్‌లో రూ.300 కోట్లని పేర్కొన్నారు. ఇది కూడా ఆరోపణ మాత్రమే. కోర్టులో నిరూపణ కాని అంశం. ఇతర నేతలపై ఇలాంటి ఆరోపణలు లేవా? కోర్టులు తప్పుబట్టలేదా? వాటిని పత్రికలు ఎందుకు హైలెట్ చేయవు. కారణం.. జనానికి జగన్‌ను దూరం చేయాలి. వైఎస్ స్మృతులను చెరిపేయాలి. కానీ అది సాధ్యం కాదు. దళితులు, మైనార్టీలు, మహిళలు, యువత, ఉద్యోగులు.. ఒకరేంటి? వైఎస్ పాలనను అంతా రామరాజ్యం అన్నారు. మళ్లీ అలాంటి పాలన తేగల సత్తా ఒక్క జగన్‌కే ఉంది. దమ్ముంటే సర్వే చేయించమనండి? ఇదే ఫలితం వస్తుందో? రాదో? చూడండి.
 
 అభివృద్ధి పత్రికల మహిమే
 హైదరాబాద్‌ను చంద్రబాబే అభివృద్ధి చేశారని ఆయనకు వత్తాసు పలికే పత్రికలు పతాక శీర్షికన ప్రకటిస్తున్నాయి. అదే నిజమైతే చంద్రబాబు రెండుసార్లు ఎందుకు ఓడిపోతారు? ఆయనపై మైనారిటీల్లో ఎందుకంత వ్యతిరేకత వస్తుంది?  గోరంతను కొండంతగా చూపే పత్రికల ప్రచారం మినహా, ఇందులో వాస్తవం లేదు. వైఎస్ హయాంలో చాలా అభివృద్ధి జరిగింది. ఉపాధి అవకాశాలు పెరిగాయి. విద్యా ప్రమాణాలు మెరుగయ్యాయి. పారిశ్రామికాభివృద్ధిలో హైదరాబాద్ పరుగులు తీసింది. ఈ వాస్తవాన్ని విస్మరించి చంద్రబాబు ఘనతగా చెప్పుకోవడం సిగ్గుచేటు.  
 
 ఆ ఆరోపణల్లో నిజం లేదు

 నేను తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేశాననే ఆరోపణల్లో వాస్తవం లేదు. నేను తెలంగాణ వ్యతిరేకిని కాదు. ఉద్యమ సమయంలో కాస్త కఠినంగా వ్యవహరించి ఉంటాను. అది ప్రజల కోసమే. శాంతిభద్రతల అదుపుకోసమే అలా ఉండాల్సి వచ్చింది. నేను తెలంగాణ వ్యతిరేకినే అయితే.. ఏ తెలంగాణ సభనైనా అడ్డుకున్నానా చెప్పమనండి? ఏ సభకైనా అనుమతి నిరాకరించానా? లేదే.  
 
 తెలంగాణతో మమేకమయ్యా

 నేను స్థానికేతరుణ్ని కాదు. పుట్టింది ఇక్కడ కాకపోవచ్చు. కానీ పెరిగింది, చదువుకుంది ఇక్కడే. మా అక్కను నల్గొండ ఇచ్చాం. వియ్యం, కయ్యం అంతా తెలంగాణలోనే. బంధువులంతా తెలంగాణలోనే ఉన్నారు. తెలంగాణతో మమేకమయ్యాను అనడానికి ఇంతకన్నా ఏం కావాలి? నా సర్వీసులో తొమ్మిదేళ్లు మినహా మిగిలిన కాలం మొత్తం హైదరాబాద్‌లోనే. కాబట్టే ఇక్కడ నుంచి పోటీచేయాలని నిర్ణయించుకున్నా.
 
 అభివృద్ధి చేసి చూపిస్తా
 మల్కాజిగిరి దేశంలోనే అతిపెద్ద లోక్‌సభ స్థానం. అనేక ప్రాంతాల వాళ్లు ఇక్కడ రక్షణ కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ల రక్షణ కోసం కేం ద్రస్థాయిలో ఎంతకైనా వెళ్లగల నేత ఉండాలని భావిస్తున్నారు. అనేక మంది నా దగ్గరకొచ్చి ఇదే అభిప్రాయం వెలిబుచ్చారు. ఇక ఈ ప్రాం తంలో నిరుద్యోగులున్నారు. అభివృద్ధికి దూరమైన వాడలున్నాయి. బడుగు, బలహీనవర్గాల మహిళలు రక్షణ కోరుకుంటున్నారు. అందు కే ఈ స్థానాన్ని చాలెంజ్‌గా తీసుకున్నా. అభివృద్ధి చేసి చూపిస్తా.
 
 ప్రాణాలు పణంగా పెట్టడానికైనా సిద్ధం

 పోలీసు అధికారిగా ప్రజలను నేరుగా కలిసే అవకాశం ఉండేది కాదు. కానీ ఏ గల్లీలో ఏం జరిగినా వెంటనే స్పందించేవాణ్ని. పరిష్కారం చూపేవాడిని. అయితే ఈ విషయం ప్రజలకు పెద్దగా తెలియకపోవచ్చు. కానీ ఇప్పుడు నేను నేరుగా వారి వద్దకే వెళ్తా.  సమస్యలు తెలుసుకుంటా. ఏ క్షణంలోనైనా నాతో నేరుగా మాట్లాడేందుకు ప్రత్యేకంగా టోల్‌ఫ్రీం నంబరు ఏర్పాటు చేస్తా. మైనార్టీలకు బాసటగా నిలుస్తాను. అవసరమైతే ప్రాణాలు పణంగా పెడతాను. క్రమశిక్షణ నరనరాన నిండిన మాజీ పోలీసు అధికారిగా ఇస్తున్న భరోసా ఇది. నన్ను నమ్మండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement