
మహాఛీటర్:టీజీ వెంకటేష్
దశాబ్దాలుగా పాలకుల నిరాదరణకు నిలువుటద్దం కర్నూలు నియోజకవర్గం. సీమ ముఖద్వారంలోని ఈ ప్రాంతం నేతల స్వార్థంతో అభివృద్ధికి ఆమడదూరంగా ఉంటోంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో స్థానిక ఎమ్మెల్యే టీజీ వెంకటేష్ రాష్ట్ర మంత్రిగా పనిచేసినా నగరాభివృద్ధిలో మార్పు చోటు చేసుకోకపోవడం గమనార్హం
కర్నూలు అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి టీజీ వెంకటేష్ నిర్వాకం
* ఎన్నికల వేళ అర‘చేతి’లో వైకుంఠం
*తర్వాత ప్రజలకు ప్రత్యక్ష నరకం
* దుర్వాసనతో జొహరాపురంవాసులు ఉక్కిరిబిక్కిరి
*రోడ్ల విస్తరణకు మొదటి అడ్డంకి ఆయన హోటలే
* సొంతింటి కల దరఖాస్తులతో సరి
* ప్రభుత్వ సొమ్ముతో మినరల్ వాటర్ ప్లాంట్లు
* సొంత నిధులు ఖర్చు చేసినట్లుగా ప్రచారం
* ‘కేసీ కాలువ గట్టు’ పనులు నాసిరకం
* భారీగా నిధులు దుర్వినియోగం
సాక్షి ప్రతినిధి, కర్నూలు : దశాబ్దాలుగా పాలకుల నిరాదరణకు నిలువుటద్దం కర్నూలు నియోజకవర్గం. సీమ ముఖద్వారంలోని ఈ ప్రాంతం నేతల స్వార్థంతో అభివృద్ధికి ఆమడదూరంగా ఉంటోంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో స్థానిక ఎమ్మెల్యే టీజీ వెంకటేష్ రాష్ట్ర మంత్రిగా పనిచేసినా నగరాభివృద్ధిలో మార్పు చోటు చేసుకోకపోవడం గమనార్హం. ఆయన హామీలు నీటిమూటలు కాగా.. మరోసారి నందనవనం పేరిట ఓటర్లను బురిడీ కొట్టించేందుకు చేస్తున్న ప్రయత్నం బెడిసికొడుతోంది. తన సొంత ప్రసార మాధ్యమంలో తిమ్మిని బమ్మిని చేసి చూపుతూ.. ప్రధాన రహదారుల్లో గోడలపై గీయించిన రంగుల బొమ్మలే అభివృద్ధిగా భ్రమింపజేస్తుండటం నవ్వులపాలవుతోంది. ఎన్నికల వేళ ప్రజలపై లేని ప్రేమను ఒలకబోయడం.. ఆ తర్వాత పదవిని తన ఆస్తులను కాపాడుకునేందుకు మాత్రమే వినియోగించుకోవడం పరిపాటిగా మారింది. శాసనసభ్యునిగా ఇచ్చిన హామీలు ఏ ఒక్కటీ నెరవేర్చకపోగా తన అనుయాయులకు లబ్ధి కలిగేలా వ్యవహరించారనే అపవాదును మూటగట్టుకున్నారు.
ప్రధానంగా జొహరాపురం వాసులకు డంపింగ్ యార్డు నుంచి విముక్తి కల్పిస్తానని ప్రకటించినా.. ఇప్పటికీ ఆ దుర్వాసనతో స్థానికులు ఎదుర్కొంటున్న అవస్థలు వర్ణనాతీతం. కేవలం యార్డును మరో ప్రాంతానికి తరలించడంతో పనైపోయిందనుకోవడంతో చెత్త తొలగింపులో నిర్లక్ష్యం కారణంగా ప్రజలు తీవ్ర అనారోగ్యాలపాలవుతున్నారు. ఇక నగరంలో 50 ఏళ్ల క్రితం నిర్మించిన చిన్న మురుగు కాలువలే దిక్కయ్యాయి. ఫలితంగా మురుగునీరంతా ఎక్కడికక్కడ తుంగభద్ర, హంద్రీ నదుల్లో కలుస్తూ అనారోగ్యాలకు కారణమవుతోంది. రాజీవ్ ఆవాజ్ యోజన పథకం కింద నగరంలోని మురికివాడల అభివృద్ధికి సుమారు రూ.6 కోట్లు మంజూరైనా 10 శాతం నిధులను కూడా ఖర్చు చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది. కేసీ కాలువ గట్టు అన్యాక్రాంతం కాకుండా రూ.25 కోట్లు నీటి పారుదల శాఖ ద్వారా ఖర్చు చేయించారు. ఈ పనులు నాసిరకంగా చేపట్టడంతో పాటు అసంపూర్తిగా ఉండటంతో ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేకపోయింది.
మురిగిన హామీలు కొన్ని...
ప్రజల దాహార్తి తీర్చేందుకు నగరంలో అసెంబ్లీ అభివృద్ధి నిధుల నుంచి రూ.2 కోట్లకు పైగా ఖర్చు చేసి మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. అయితే టీజీ తన సొంత నిధులతో వీటిని ఏర్పాటు చేసినట్లుగా ప్రచారం చేసుకోవడం ప్రజలను ఆశ్చర్యపరుస్తోంది. పైగా ప్లాంట్లను నగరపాలక సంస్థకు చెందిన స్థలాల్లోనే ఏర్పాటు చేయడం గమనార్హం. వీటి ఏర్పాటుకు పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చినా.. టీజీవీ అడ్డుకున్నారనే చర్చ కొనసాగుతోంది. నగర ప్రజలకు తాగునీటి సమస్య నుంచి శాశ్వత పరిష్కారం చూపుతానన్న ఆయన హామీ కలగానే మిగిలిపోయింది. మునగాలపాడు సమీపంలో ఎస్‌ఎస్ ట్యాంకు పక్కనే స్థలం ఉన్నా అదనపు ట్యాంకు నిర్మాణానికి నిధులు కేటాయించలేకపోయారు.
కర్నూలు నగర ప్రజలను వరద ముప్పు నుంచి కాపాడేందుకు రక్షణ గోడ నిర్మిస్తానని ప్రకటించినా అతీగతీ లేకపోయింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రూ.244 కోట్లు మంజూరు చేసినా టీజీ చొరవ చూపకపోవడం ప్రజలకు శాపంగా మారింది.
నగరంలో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపడంలో భాగంగా పూర్తిస్థాయిలో రోడ్ల విస్తరణను చేపట్టలేకపోయారు. తన సొంత హోటల్ వద్దే విస్తరణకు సహకరించకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇరుకు రోడ్డునే రెండుగా విభజించి తన సొంతింటి వరకు వీధిలైట్లు, రోడ్డు వేయించుకోవడం ప్రజలను ఆశ్చర్యపరుస్తోంది. వీధిలైట్ల కాంట్రాక్టును సైతం అయినవారికే కట్టబెట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారనే చర్చ ఉంది.
నియోజకవర్గంలోని 39 డివిజన్లలో కమ్యూనిటీ హాళ్లు నిర్మిస్తానని హామీ ఇచ్చినా.. రూ.4 కోట్లతో ఏడు కమ్యూనిటీ హాళ్లు మాత్రమే పూర్తి చేయించారు. మిగిలిన వాటి ఊసే మరిచారు.
నగరపాలక సంస్థ నూతన కార్యాలయానికి 2010లో అప్పటి పురపాలక శాఖ మంత్రి చేతుల మీదుగా టీజీవీ శిలాఫలకం ఆవిష్కరింపజేశారు. నిర్మాణం కోసం రూ.9 కోట్ల అంచనాలతో ప్రతిపాదనలు చేసి మూడేళ్లు గడుస్తున్నా దిక్కుమొక్కూ లేకపోయింది.
కర్నూలులో సొంతింటి కల నెరవేరుస్తానంటూ 20 వేల మందికి పైగా నిరుపేదల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. వీరిలో 10వేల మందికి పొజిషన్ సర్టిఫికెట్లతో సరిపెట్టారు. ఇప్పటికీ సెంటు స్థలం చూపకపోవడం గమనార్హం.