పట్టుకున్న డబ్బంతా ఎన్నికలదేనా?
ఎక్కడ ఏ డబ్బు చూసినా.. ఎన్నికల అధికారులు మాత్రం ఎన్నికల్లో ఓటర్లకు పంపిణీ చేయడానికి తీసుకెళ్తున్నదనే భావిస్తున్నారు. ముందు, వెనకా చూడకుండా ముందు స్వాధీనం చేసేసుకుంటున్నారు. ఆ తర్వాతే దానికి సంబంధించిన విచారణ చేస్తున్నారు. గడిచిన రెండు రోజుల్లోనే ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో కొంతమంది వ్యక్తులు బ్యాంకు నుంచి డ్రా చేసుకుని 2 కోట్ల రూపాయలు తీసుకెళ్తుంటే పోలీసులు, ఎన్నికల అధికారులు పట్టుకున్నారు. ఇంకేముంది, ఆ సొమ్ము మొత్తం ఒక పార్టీ ఎన్నికల్లో పంచిపెట్టడానికి తీసుకెళ్తున్నదేనంటూ వదంతులు వ్యాపించాయి. కానీ తీరా చూస్తే, ఒక పెద్ద నిర్మాణ సంస్థ తమ సంస్థలోని ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి ఆ సొమ్ము డ్రా చేసినట్లు తర్వాత తేలింది.
అలాగే, కృష్ణా జిల్లా నూజివీడులో మత్స్యకారుల సంఘానికి చెందిన 35 లక్షల సొమ్మును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాస్తవానికి ఈ డబ్బు నూజివీడు ప్రాంతంలోని 4 మండలాల్లో చేపల చెరువులకు సంబంధించినది. దాదాపు 170 కుటుంబాలకు చెందిన ఈ డబ్బు వారి యూనియన్ అధ్యక్షుడు షేక్ బాజీ దగ్గర ఉంది. చేపలు అమ్మగా వచ్చిన మొత్తం ఇలా అధ్యక్షుడి వద్ద ఉంచి, ఆరు నెలలకోసారి పంచుకోవడం వాళ్లకు ఎప్పటినుంచో ఉన్న అలవాటు. అలా పంచుకోవడానికి ఉంచిన డబ్బు గురించి ఎవరో ఫోన్ చేసి చెప్పడంతో.. పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇలా, లెక్కల్లోకి మాత్రం ఘనంగా 125 - 130 కోట్ల వరకు దొరికిందని ప్రకటిస్తున్నా, అందులో నిజంగా ఎన్నికల సొమ్ము ఎంతో, ఇతరత్రా సొమ్ము ఎంతో అనే విషయం మాత్రం ఇంకా తేలాల్సి ఉంది.