ప్రచార హోరు
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : పోలింగ్ దగ్గర పడుతున్న కొద్ది ప్రచారం ఊపందుకుంటోంది. అభ్యర్థులు తమ అనుచరులు, కార్యకర్తలతో నిర్వహిస్తున్న ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ మంది ప్రజల్లోకి వెళ్లడం ద్వారా నాలుగు ఓట్లు రాల్చుకునే ప్రయత్నాల్లో మునిగి తేలుతున్నారు. మరోవైపు ఆయా పార్టీల అధినేతలు కూడా రంగంలోకి దిగుతున్నారు. తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆదివారం ఒక్క రోజులోనే జిల్లాను చుట్టేశారు. తొమ్మిది చోట్ల బహిరంగ సభల్లో పాల్గొని ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు.
అధినేత రాకతో ఆ పార్టీ అభ్యర్థుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు జిల్లా పర్యటన కూడా ఖరారైంది. ఈనెల 23న ఆయన జిల్లాకు రానున్నారు. ఆ పార్టీ అభ్యర్థులు పోటీచేస్తున్న కాగజ్‌నగర్, బెల్లంపల్లి, ఆసిఫాబాద్, ఇచ్చోడ, కడెం, నిర్మల్‌లలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నట్లు ఆ పార్టీ ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి ప్రకటించారు. చంద్రబాబు వెంట బీజేపీ అగ్రనేతలు కూడా పాల్గొంటారని తెలిపారు. టీఆర్‌ఎస్, టీడీపీలకు ధీటుగా అగ్రనేతలతో ప్రచారం నిర్వహించాలని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఈనెల 24న తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను ఆదిలాబాద్‌కు రప్పించేందుకు ఆ పార్టీ అభ్యర్థి భార్గవ్‌దేశ్‌పాండే ప్రయత్నిస్తున్నారు. రాహుల్ వంటి జాతీయ అగ్రనేతలను జిల్లాకు రప్పించేందుకు సిర్పూర్ అభ్యర్థి ప్రేంసాగర్‌రావు ప్రయత్నించారు.
కానీ సమీప జిల్లాల్లో ఈనేతల పర్యటనలు జరుగుతున్నాయే తప్ప, ఆదిలాబాద్ జిల్లాకు అగ్రనేతలు రాకపోవడం కొంత నిరుత్సాహానికి గురిచేస్తోంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఈనెల 16న కరీంనగర్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభకు జిల్లా అభ్యర్థులు పలువురు తరలివెళ్లారు. అలాగే సోమవారం నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలో రాహుల్‌గాంధీ బహిరంగ సభ జరిగింది. ఈ సభకు కూడా కాంగ్రెస్ అభ్యర్థులు వెళ్లారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించేందుకు జిల్లాలో పర్యటించాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొమ్ముల వినాయక్‌రెడ్డి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిలను విజ్ఞప్తి చేశారు. అలాగే బీఎస్పీ రాష్ట్ర నాయకుల ద్వారా నిర్మల్, సిర్పూర్‌లలో ప్రచారం చేయించాలని ఆ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, కోనేరు కొనప్పలు భావిస్తున్నారు.