-
చంద్రబాబు, వెంకయ్యపై టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ధ్వజం
-
అధికారంలోకి రాకుండా చేసేందుకు వెయ్యి కోట్లు ఖర్చు చేస్తున్నారు
-
ఇదంతా బాబు-వెంకయ్య పన్నాగమే.. నల్లగొండ సభలో కేసీఆర్
-
తెలంగాణ బీజేపీ నేతలు వద్దని మొత్తుకున్నా వారిపై పొత్తును రుద్దారు
-
చివరకు కాంగ్రెస్‌తోనైనా కుమ్మక్కయ్యే నీచుడు చంద్రబాబునాయుడు
-
చిత్తూరు ‘బాబు’కు ఇక్కడేం పని?.. తెలంగాణ టీడీపీ నేతలకు సిగ్గు లేదా?
-
పునర్నిర్మాణమంటే పొన్నాలకు తెలియదు, ఒళ్లు దగ్గరపెట్టుకో పొన్నాలా
-
ఢిల్లీ మెడలు వంచాలంటే టీఆర్‌ఎస్ అభ్యర్థులనే గెలిపించాలని వినతి
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ‘తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకునేందుకు చివరి నిమిషం వరకు ప్రయత్నించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, బీజేపీ నాయకుడు వెంకయ్యనాయుడు ఓ పెద్దకుట్ర పన్నుతున్నారు. తెలంగాణలో టీఆర్‌ఎస్ అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు రూ. వెయ్యి కోట్లు ఖర్చు పెడుతున్నారు. చంద్రబాబు నాయుడు నీచుడు.. చివరకు కాంగ్రెస్‌తో కుమ్మక్కై వారికి మద్దతిచ్చినా ఇస్తాడు’ అని టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం సాయంత్రం నల్లగొండలోని మేకల అభివన్ ఇండోర్ స్టేడియంలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. చిత్తూరు జిల్లాకు చెందిన చంద్రబాబుకు ఇక్కడేం పని? మెడలు పట్టి గెంటినా, తెలంగాణలోనే ఉంటానంటున్నడు. బాబు పార్టీ తరఫున పోటీ చేయడానికి తెలంగాణ టీడీపీ నేతలకు సిగ్గు లేదా?’ అని కేసీఆర్ ధ్వజమెత్తారు.
‘టీడీపీతో పొత్తు వద్దని తెలంగాణ బీజేపీ నేతలు మొత్తుకున్నా, బలవంతంగా వారిపై రుద్దారు. వెయ్యి కోట్లు ఖర్చు పెట్టయినా టీఆర్‌ఎస్‌ను అడ్డుకోవాలని వెంకయ్య, చంద్రబాబు చూస్తున్నార ’ని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్ మాత్రమే ఎందుకు అధికారంలోకి రావాలో ఈ సందర్భంగా వివరించే ప్రయత్నం చేశారు. నల్లగొండ జిల్లాను పట్టిపీడిస్తున్న సమస్యలను ప్రస్తావించారు. తెలంగాణ వెనుకబాటుతనంలో టీడీపీ, కాంగ్రెస్ పాలనల వైఫల్యాన్ని ఎండగట్టారు. తాము అధికారంలోకి వస్తే ఎలాంటి అభివృద్ధి చేస్తామో వివరించారు. ‘‘ఐదున్నర దశాబ్దాల పోరాటం తర్వాత తెలంగాణ కల సాకారమైంది. తెలంగాణ అధికారికంగా, సంపూర్ణంగా ఏర్పాటు కాకముందే, ఓ ప్రత్యేక సందర్భంలో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇంకా నీళ్లు, ఉద్యోగాలు, ఆస్తులు, అప్పుల పంపకం జరగాలే. ఆంధ్రాతో పంచాయితీ అయిపోలేదు. భద్రాచలంలోని ఏడు మండలాలను ఆంధ్రా మంత్రుల ఒత్తిడి మేరకు ఆ రాష్ట్రంలో కలిపేస్తూ గె జిట్ ఇచ్చారు. హైదరాబాద్‌లోని ఎన్‌ఐడీ(నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్)ని విజయవాడకు తరలిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోనే ప్రత్యేక పరిస్థితి ఉందని, టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాలను పక్కనబెట్టుకుని మరీ కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ప్రకటిస్తున్నాడు. తెలంగాణలో ఎనిమిది జిల్లాలు పూర్తిగా వెనుకబడ్డాయని ప్లానింగ్ కమిషన్ ఇచ్చిన నివేదికలు వారికి కనిపించడం లేదు’’ అని టీఆర్‌ఎస్ చీఫ్ దుయ్యబట్టారు.
పొన్నాలా.. నీ పదవి కేవీపీ సిఫారసుతో రాలేదా?
‘తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాలకు ఆంధ్రా ప్రాంత నేత కేవీపీ సిఫారసుతోనే పదవి వచ్చింది. ఆయన తెలంగాణకు ఏం న్యాయం చేస్తడు. ఉద్యోగాలకు ఆప్షన్లు ఉండొద్దని నేనంటుంటే, పొన్నాల, జానా, దామోదర రాజనర్సింహ ఎందుకని అంటున్నరు. పునర్నిర్మాణం అంటే పొన్నాలకు తెలియదు. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడు పొన్నాలా? నువ్వు ఎప్పటికీ కేసీఆర్‌వి కాలేవు. మీరు ఎన్నడన్నా ఉద్యమం చేసినోళ్లా? ఒకవైపు ఉద్యమం జరుగుతుంటే, మంత్రులుగా పల్లకీలో ఊరేగారు’ అని కాంగ్రెస్ నేతలపై కేసీఆర్ నిప్పులు చెరిగారు.
జీవన విధ్వంసం.. కాంగ్రెస్, టీడీపీల పుణ్యమే
తెలంగాణ జిల్లాల్లో జీవన విధ్వంసం జరగడానికి పూర్తిగా కాంగ్రెస్, టీడీపీలే కారణమని ఆయన ఆరోపించారు. ‘నల్లగొండను ఫ్లోరైడ్ భూతం వెంటాడుతోంది. నల్లగొండ ‘నో మ్యాన్ జోన్’గా మార కుండా ఉండాలంటే సర్ఫేస్ వాటర్ ఇవ్వాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ఎప్పుడో నివేదికలు ఇచ్చింది. కానీ, ఆ హెచ్చరికలను మంత్రులు ఎందుకు పట్టించుకోలేదు? ఏం చేశారో, ఎందుకు చేయలేదో సమాధానం చెప్పండి. మంత్రులందరిదీ అసమర్థుల జీవన యాత్రే’నని కేసీఆర్ వ్యాఖ్యానించారు. టీడీపీ, కాంగ్రెస్‌ల పాలన వల్లే జీవన విధ్వంసం జరిగిందని మండిపడ్డారు. అంగన్‌వాడీ కార్యకర్తలను గుర్రాలతో తొక్కించిన ఘన చరిత్ర చంద్రబాబుది కాదా అని ప్రశ్నించారు.
ఉత్తమ్‌పై నిప్పులు: ‘తెలంగాణ అమరుడు శ్రీకాంతాచారి కుటుంబానికి ఎంత చేసినా తక్కువే. హుజూర్‌నగర్‌లో అమరుడి తల్లి శంకరమ్మను పోటీకి పెట్టాం. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. నువ్వు ఉత్తముడవేనా? ఉద్యమకారుడివేనా? అయితే, పోటీ నుంచి తప్పుకో. ఎవరూ ఆయనను కాపాడలేరు.
హుజూర్‌నగర్‌కు వస్తా.. అందరికీ దండం పెడ్తా. 119 అసెంబ్లీ స్థానాల్లో ఎక్కడ నిలబెట్టినా అత్యధిక మెజారిటీతో శంకరమ్మను గెలిపించుకుంటం’ అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై కేసీఆర్ నిప్పులు చెరిగారు. ఢిల్లీ మెడలు వంచాలంటే టీఆర్‌ఎస్ ఎంపీలు ఉండాలని, తమ లోక్‌సభ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. పేరుపేరునా పార్టీ అసెంబ్లీ అభ్యర్థులు, లోక్‌సభ అభ్యర్థులను ప్రజలకు పరిచయం చేశారు. సుమారు 45 నిమిషాల సేపు ప్రసంగించిన కేసీఆర్ నల్లగొండ జిల్లాకు సంబంధించిన అనేక సమస్యలను ప్రస్తావించారు.
మేనిఫెస్టోలోని అంశాల ప్రస్తావన
* టీఆర్‌ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలోని కొన్ని అంశాలను ఈ సందర్భంగా కేసీఆర్ ప్రస్తావించారు. వ్యవసాయరంగానికి చేయూతనిచ్చి రైతులను లక్షాధికారులను చేస్తానని భరోసానిచ్చారు.
* టీఆర్‌ఎస్ పక్కా సెక్యులర్ పార్టీ. ముస్లిం మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్ అమలు చేస్తాం. సచార్ కమిటీ సిఫార సుల అమలు కోసం రూ.1000 కోట్ల బడ్జెట్ కేటాయిస్తాం.
* ఉద్యోగులకు తెలంగాణ ప్రత్యేక ఇంక్రిమెంట్ ఇస్తాం. ప్రభుత్వంలో ఉద్యోగులదే క్రియాశీలక భాగస్వామ్యం. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు ముందుండి పోరాడారు. అందుకే వారికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా పెన్షన్ ఉంటుంది.
* దళితుల అభ్యున్నతి కోసం ఐదేళ్లలో రూ. 50 వేల కోట్లు ఖర్చు పెడతాం. ప్రతీ కుటుంబానికి మూడెకరాల సాగు భూమి ఇస్తాం.
* నల్లగొండలో ఫ్లోరైడ్ సమస్య పరిష్కారానికి అవసరమైతే రూ.600-రూ.700 కోట్లు ఖర్చు చేస్తాం.