
‘హవాలా’దే హవా
ఎందుకు.. ఏమిటి అన్న వివరాలు చెప్పక్కర్లేదు. బ్యాంకు లావాదేవీలతో పనిలేదు. పాన్ కార్డులు అక్కర్లేదు. ఇన్‌కమ్‌ట్యాక్స్‌ల బాధే లేదు. ఎంచక్కా... లెక్క లేకుండా కోట్లకు కోట్లు జమ చేసుకోవచ్చు. ప్రపంచంలో ఎక్కడికి కావాలంటే అక్కడకి... ఎప్పుడు కావాలంటే అప్పుడు... ఎవరికి కావాలంటే వారికి... మాట బయటకు రాకుండా... గుట్టు చప్పుడు కాకుండా... ‘నోటి మాటతో’ ఎంతంటే అంత సొమ్ము జమ చేసుకోవచ్చు. అవసరమైతే వేరొకరికి తరలించుకోవచ్చు. ఒక్క ముక్కలో చెప్పాలంటే... ‘నల్ల’ ధనానానికి రాచమార్గం... క్షణంలో జరిగిపోయే ట్రాన్‌సెక్షన్... ఇదే ‘హవాలా’. ఎన్నికల వేళ పట్టుబడుతున్న నోట్ల కట్టలు చూస్తుంటే... హవాలా హవా దెబ్బకు పోలీసుల దిమ్మ ఎంతలా తిరుగుతోందో అర్థమవుతుంది.
హైదరాబాద్:అధికారుల కళ్లు గప్పి నల్లధనం అక్రమ మార్గాల్లో తరలిపోతోంది. ‘నల్ల’ కుబేరులే కాదు... విదేశాల్లో వలస కార్మికులు కూడా హవాలా ద్వారానే స్వదేశాలకు సొమ్ము పంపిస్తున్నారు. అక్రమ వ్యాపారాలు చేసే బడా సంస్థలు, ఉగ్రవాదుల ఆర్థిక లావాదేవీలు జరిగేదీ ఇదే మార్గంలో. ఆర్థిక నేరాలు వెలుగులోకి వచ్చినప్పుడల్లా వినిపించే మాట హవాలా. అరబిక్ భాషలో హవాలా అంటే ‘బదిలీ’ అని అర్థం. బ్యాంకింగ్ రంగాన్ని తలదన్నేలా హైదరాబాద్ మహానగరంలోనూ ఈ వ్యాపారం జోరుగా సాగుతోంది.
ఎలా తరలిస్తారంటే...
ఉదాహరణకు... దుబాయిలో ఉంటున్న మహేష్ హైదరాబాద్‌లో నివాసముంటున్న తన సోదరుడికి డబ్బు పంపాలనుకుందాం. అందుకు అతను... అక్కడి హవాలా ఏజెంట్‌ను ఆశ్రయిస్తాడు. చెప్పిన వ్యక్తికే డబ్బు అందేలా ఒక పాస్‌వర్డ్ గానీ, మరేదైనా సంకేతాన్ని గానీ చెబుతాడు. డబ్బు తీసుకున్న హవాలా ఏజెంట్... నగరంలో అతని నెట్‌వర్క్‌కు చెందిన ఏజెంట్‌కు సమాచారం ఇస్తాడు. ఈ మేరకు... ఇక్కడి ఏజెంట్ ముందుగా అనుకున్న పాస్‌వర్డ్, లేదంటే సంకేతాల ఆధారంగా మహేష్ సోదరుడికి డబ్బు చెల్లిస్తాడు. అందుకు ఇక్కడి ఏజెంట్ కూడా కమీషన్ తీసుకొంటాడు.
నోటి మాటపైనే...
హవాలా ఆర్థిక లావాదేవీలకు ప్రామిసరీ నోట్‌లు, ఇతరత్రా పత్రాలుండవు. కేవలం నోటి మాటపైనే మొత్తం లావాదేవీలు జరుగుతాయి. ఇదంతా క్షణాల్లో జరిగిపోతుంది. నమ్మకంపైనే వేల కోట్ల రూపాయలు రవాణా అవుతాయి. బ్యాంకులో వేసిన డబ్బు మాయమైన సందర్భాలున్నాయేమో గానీ... హవాలా ద్వారా జరిగే లావాదేవీల్లో ఎక్కడా ఒక్క పొరపాటు కూడా జరగదు.
ఇక్కడ వందకు పైగా...
నగరంలో సుమారు వందకు పైగానే ‘హవాలా’ హవా నడిపించేవారున్నారు. వీరికి ప్రపంచం నలుమూలల నుంచే కాకుండా దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి సంబంధాలున్నాయి. నగదు తరలింపునకు బంధువులనో, అత్యంత నమ్మకమైనవారినో ఎంచుకొంటారు. ఎంతో రహస్యంగా జనసమ్మర్ధ ప్రాంతాల ద్వారా చేరాల్సిన వారికి చేరుస్తారు.
కమీషన్ ఇలా...
ఈ ఆర్థిక లావాదేవీల్లో పంపే డబ్బు నుంచే ఏజెంట్లు కమీషన్ తీసుకొంటారు. ఇందులో ఏజెంట్‌తో పాటు ఈ వ్యాపారం నిర్వహించే ప్రధాన సూత్రధారికి, గమ్యస్థానానికి చేరవేసే మరో ఏజెంట్‌కు పంపకాలు జరుగుతాయి. లక్ష రూపాయలకు 300 నుంచి 600 రూపాయల వరకు కమీషన్ ఉంటుంది.
ఇప్పటి వరకు రూ.42 కోట్లు...
సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి నేటి వరకు పోలీసుల తనిఖీల్లో సుమారు రూ.42 కోట్ల నల్లధనం పట్టుబడింది. దీంట్లో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో రూ.20 కోట్లు, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో రూ.22 కోట్లు ఉన్నాయి. 2009 ఎన్నికల్లో పట్టుబడింది కేవలం రూ.6.5 కోట్లు మాత్రమే. అంటే ఈసారి దాదాపు ఏడు రెట్లు అధికం. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు... నల్లధనం ఏ స్థాయిలో పరవళ్లు తొక్కుతోందో! పట్టుబడిన సొమ్మంతా ప్రభుత్వ ఖజానాకు జమ చేశారు.