నామినేషన్ల వెల్లువ
సాక్షి, గుంటూరు: సార్వత్రిక ఎన్నికలకు తొలి అంకమైన నామినేషన్ల ఘట్టంలో మూడో రోజు రాజకీయ పార్టీల అభ్యర్థుల నామినేషన్లు వెల్లువెత్తాయి. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమై ఐదు రోజులు గడుస్తున్నా, మధ్యలో రెండు రోజులు సెలవు దినాలు కావడం, నామినేషన్ల దాఖలుకు మూడో రోజు ముహూర్తబలం ఉండడంతో బుధవారం నామినేషన్లు ఊపందుకున్నాయి. బాపట్ల పార్లమెంటుకు ప్రకాశం జిల్లాలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఉండడంతో ఇక జిల్లాలో రెండు పార్లమెంటు స్థానాలకు ఆరు నామినేషన్లు, 17 అసెంబ్లీ స్థానాలకు గాను 16 స్థానాల్లో 62 మంది అభ్యర్ధులు తమ నామినేషన్లు దాఖలు చేశారు. తాడికొండ నియోజకవర్గంలో ఒక్క అభ్యర్థి కూడా నామినేషను దాఖలు చేయలేదు.
రెండు ఎంపీ స్థానాలకు 17 సెట్ల నామినేషన్లు దాఖలు కాగా, అసెంబ్లీ స్థానాలకు 103 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. పార్లమెంటు స్థానాలకు వైఎస్సార్‌సీపీ తరఫున 1, టీడీపీ నుంచి 3, గ్రేట్ ఇండియా పార్టీ నుంచి 1, స్వతంత్ర అభ్యర్థి ఒకరు నామినేషను దాఖలు చేశారు. 16 అసెంబ్లీ స్థానాలకు గాను వైఎస్సార్ సీపీ నుంచి 22, టీడీపీ నుంచి 17 మంది నామినేషన్లు వేశారు. వీరిలో ముగ్గురు టీడీపీ రెబల్ అభ్యర్థులు(సత్తెనపల్లి నుంచి నిమ్మకాయల రాజనారాయణ, నిమ్మకాయల రత్నకుమారి, నరసరావుపేట నుంచి వల్లెపు నాగేశ్వరరావు) ఉన్నారు. వీరు ముగ్గురూ బీసీలు కావడం గమనార్హం. కాంగ్రెస్ నుంచి 5, సీపీఎం నుంచి 2, స్వతంత్రులు 7, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఒకరు, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి 3, జై సమైక్యాంధ్ర పార్టీ నుంచి 2, ఎంఐఎం నుంచి ఒకరు, ఇండియన్ లేబర్ పార్టీ నుంచి ఒకరు, ఇండియన్ క్రిస్టియన్ సెక్యులర్ పార్టీ నుంచి ఒకరు నామినేషన్లు దాఖలు చేశారు.
నరసరావుపేట ఎంపీ స్థానానికి
ఆళ్ళ ఆయోధ్యరామిరెడ్డి నామినేషన్
నరసరావుపేట ఎంపీ స్థానానికి ఆళ్ళ ఆయోధ్యరామిరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఆయన జిల్లా సంయుక్త కలెక్టరుకు రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. తన భార్య ద్రాక్షాయణి, చిన్న కుమారుడు ఇషాన్‌రెడ్డితో కలిసి నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా అయోధ్యరామిరెడ్డి మాట్లాడుతూ మరో నెల రోజుల్లో రాష్ట్రంలో రాజన్న రాజ్యం వస్తుందని, రానున్న ఐదేళ్ళలో నరసరావుపేట పార్లమెంటు పరిధిలో సమగ్రాభివృద్ధి చేస్తానన్నారు. గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా గల్లా జయదేవ్ నామినేషన్ వేసే సమయంలో బీజేపీ నాయకులను కలుపుకుని వెళ్లలేదని బీజేపీ నేత రంగరాజు అలిగి వెళ్లిపోగా, జయదేవ్ అనుచరులు రంగరాజును బతిమాలి నామినేషన్‌కు తీసుకువచ్చారు. రాయపాటి సాంబశివరావు నరసరావుపేట స్థానానికి నామినేషన్ వేశారు.
వైఎస్సార్ సీపీ జోరు..
నామినేషన్ల రోజు వైఎస్సార్‌సీపీ తరఫున జోరుగా నామినేషన్లు దాఖలు చేయడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. సత్తెనపల్లి, తాడికొండ మినహా జిల్లాలోని మిగిలిన 15 నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేశారు. పెదకూరపాడులో బొల్లా బ్రహ్మనాయుడు, మంగళగిరిలో ఆళ్ళ రామకృష్ణారెడ్డి, పొన్నూరులో రావి వెంకటరమణ, రావి కల్పన కిరణ్, వేమూరులో మేరుగ నాగార్జున, రేపల్లెలో మోపిదేవి వెంకటరమణరావు, మోపిదేవి అరుణ, తెనాలిలో అన్నాబత్తుని శివకుమార్, బాపట్లలో కోన రఘుపతి, కోన రమాదేవి, ప్రత్తిపాడులో మేకతోటి సుచరిత, గుంటూరు వెస్ట్‌లో లేళ్ళ అప్పిరెడ్డి, గుంటూరు తూర్పులో ముస్తఫా, షేక్ షహవాన్, చిలకలూరిపేటలో మర్రి రాజశేఖర్, మర్రి లలిత, నరసరావుపేటలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గోపిరెడ్డి సుస్మిత రెడ్డి, వినుకొండలో నన్నపనేని సుధ, లతీఫ్, గురజాలలో జంగా కృష్ణమూర్తి, మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. టీడీపీలో ఇంకా సీట్లు కొలిక్కి రాకపోవడంతో పార్టీ కేడర్ మొత్తం నిస్తేజంలో ఉంది.