కొద్ది గంటలే..!
సాక్షి, గుంటూరు :సరాలు తెగే ఉత్కంఠ నేడు వీడిపోనుంది. యంత్రాల్లో దాగిన అభ్యర్థుల జాతకాలు బయటపడనున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో ఓటరు దేవుళ్ల తీర్పేమిటో మరికొద్ది గంటల్లో వెల్లడికానుంది. జిల్లాలో మూడు పార్లమెంటు, 17 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ నెల 7వ తేదీన ఎన్నికలు నిర్వహించారు. పార్లమెంటుకు 37మంది, అసెంబ్లీకి 239 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లను శుక్రవారం లెక్కించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
కౌంటింగ్ కోసం విసృ్తత ఏర్పాట్లు..
సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌కు సంబంధించి జిల్లా అధికార యంత్రాంగం విసృ్తత ఏర్పాట్లు చేసింది. గుంటూరు పార్లమెంటుకు సంబంధించి ఏఎన్‌యూలో, నరసరావుపేట పార్లమెంటుకు సంబంధించి నల్లపాడు లయోలా కళాశాలలో కౌంటింగ్‌కు ఏర్పాట్లు చేశారు. బాపట్ల పార్లమెంటు పరిధిలోని రేపల్లె, వేమూరు, బాపట్ల నియోజకవర్గాలకు బాపట్లలోని ఆర్ట్స్, ఇంజనీరింగ్ కళాశాలల్లో ఏర్పాట్లు చేశారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు చేపట్టనున్నారు. ఉదయం 8 గంటల నుంచి ప్రక్రియ ప్రారంభం కానుంది. 10 గంటల కల్లా ఫలితాలు వెలువడేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.
ఎవరి అంచనాలు వారివి..
జమిలి ఎన్నికల్లో గెలుపోటములపై రాజకీయ పార్టీలు ఎవరి అంచనాల్లో వారు మునిగిపోయాయి. గుంటూరు, నరసరావుపేట, బాపట్ల పార్లమెంటు నియోజకవర్గాల్లో రేసుగుర్రాలు ఎవరనే అంశంపై రకరకాల విశ్లేషణలు సాగుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్‌పైనా విసృ్తత చర్చ సాగుతోంది. జిల్లాలో పార్టీలు, అభ్యర్థుల గెలుపోటములపై బెట్టింగులు రూ.200 కోట్లు దాటాయని అంచనా. రెండ్రోజులుగా ఇవి తారస్థాయికి చేరాయి. రాష్ట్ర రాజకీయ రాజధానిగా పేరొందిన గుంటూరులో ఏ పార్టీ ఎన్ని సీట్లు సాధిస్తుందనే అంశంపైనే అందరి దృష్టి నెలకొంది.
‘స్థానిక’ ఫలితాలు ప్రామాణికం కాదు..
ఇప్పటికే మున్సిపల్, పరిషత్ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. ఇక అందరి దృష్టి జమిలీ ఎన్నికల ఫలితాలపైనే ఉంది. పలు సర్వే సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ సీమాంధ్రలో వైఎస్సార్ సీపీ, టీడీపీల మధ్య పోటీ నువ్వా.. నేనా అన్నట్లు ఉందని స్పష్టం చేస్తున్నాయి. మున్సిపల్, స్థానిక ఎన్నికల ఫలితాలు సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు ప్రామాణికం కాబోవని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. సీమాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి రికార్డు సాధిస్తారని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.