బాబ్బాబు | TDP Rebels Nominated post | Sakshi
Sakshi News home page

బాబ్బాబు

Published Mon, Apr 21 2014 1:09 AM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM

బాబ్బాబు - Sakshi

బాబ్బాబు

 సాక్షి ప్రతినిధి, గుంటూరు :తాంబూలాలిచ్చేసాం... తన్నుకు చావండి అనే రీతిలో రెబల్స్ గురించి టీడీపీ అధినేత చంద్రబాబు పట్టించుకోక పోవడంతో బి.ఫారం పొందిన అభ్యర్థులు తిరుగుబాటుదారులతో మంతనాలకు దిగారు. అవకాశం ఉంటే పార్టీ తరఫున నామినేటెడ్ పోస్టు వచ్చేలా చూస్తామని లేకుంటే ఇప్పటి వరకు నియోజకవర్గంలో పార్టీ పటిష్టానికి చేసిన ఖర్చు చెల్లిస్తామని చెబుతున్నారు. శనివారం నామినేషన్లకు గడువు తేదీ ముగిసినప్పటి నుంచి బి.ఫారాలు పొందిన అభ్యర్థులు ఈ బేరసారాలకు దిగారు. దారికి రాని వారిని బెదిరింపులకు పాల్పడుతున్నారు.
 
 గుంటూరు లోక్‌సభ, తూర్పు అసెంబ్లీ నియోజకవర్గానికి రెబల్‌గా నామినేషన్ వేసిన బోనబోయిన శ్రీనివాస్‌యాదవ్ పార్టీ నాయకుల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకోకుండా స్వతంత్ర అభ్యర్థిగా రంగంలో నిలిచేందుకే మొగ్గు చూపుతున్నారు. మూడు జిల్లాల్లో తన సామాజిక వర్గానికి పార్టీ సీటు ఇవ్వలేదని, తమ సత్తా ఏమిటో పార్టీకి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు. ఇందుకు అనుగుణంగానే ఆదివారం మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలంలో తన సామాజికవర్గం నేతలతో సమావేశం నిర్వహించారు. తమకు పార్టీ న్యాయం చేయాలని, ఇచ్చిన సీట్లలో మార్పు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
 
 పోటీ నుంచి తప్పుకోను: నిమ్మకాయల
 చంద్రబాబు సీటు ఇవ్వకపోయినా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తీరుతానని, ఎన్ని ఒత్తిడులు వచ్చినా బరిలో నుంచి తప్పుకోకుండా బాబుకు, కోడెలకు బుద్ధి చెబుతానని నిమ్మకాయల రాజనారాయణ ఆదివారం మీడియాకు చెప్పారు. పదేళ్లుగా నియోజకవర్గంలో బలహీనంగా ఉన్న పార్టీని ఎన్నో కష్టాలకోర్చి బలోపేతం చేశానని, 2009 నుంచి తనతో కోట్లు ఖర్చు చేయించి ఇప్పుడు టిక్కెట్టు ఇవ్వకుండా నట్టేట ముంచారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ టిక్కెట్టు పొందిన కోడెల శివప్రసాదరావు తనను రూ. 7 కోట్లకు కొన్నానని ప్రచారం చేస్తున్నారని, రూ. కోట్లకు అమ్ముడు పోయే జాతి బీసీలు కాదన్నారు. చంద్రబాబు, కోడెల శివప్రసాదరావులు నమ్మక ద్రోహం చేశారన్నారు. తనను దగా చేసిన పార్టీకి బీసీల సత్తా ఏమిటో చూపిస్తానని, ఇక్కడ విజయం సాధించి తీరుతానన్నారు.
 
 వీరయ్యకు నామినేటెడ్ పోస్టు ఎర..
 టీడీపీ రెబల్‌గా పార్టీ ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్‌చార్జి కందుకూరి వీరయ్య దాఖలు చేసిన నామినేషన్ ఉపసంహరణ గురించి ముఖ్య నాయకులెవరూ ఆయనతో చర్చలు జరపలేదు. అయితే పార్టీ టికెట్టు కేటాయించిన రావెల కిషోర్‌బాబు మాత్రం, వీరయ్యను కలిసి తనకు సహకరించాలని కోరారు. నియోజకవర్గంలోని ఒకరిద్దరు నాయకులు మాత్రం వీరయ్యకు టీడీపీ అధికారంలోనికి వచ్చిన తరువాత ఏదైనా నామినేటెడ్ పోస్టు ఇచ్చే విధంగా పార్టీ అధిష్టానంతో మాట్లాడితే, నామినేషన్ ఉపసంహరించుకుంటాడేమోనన్న ఆలోచనలో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. కాగా వీరయ్య అభిమానులు, కార్యకర్తలు మాత్ర వీరయ్యను ఉపసంహరించుకోవద్దని స్పష్టంగా, బలంగా కోరుతున్నారు.
 
 నరసరావుపేట, మాచర్లలో కొలిక్కిరాని బుజ్జగింపులు..
 నరసరావుపేట, మాచర్ల నియోజకవర్గాల్లో టీడీపీ రెబల్ అభ్యర్థులను బుజ్జగించేందుకు టీడీపీ అభ్యర్థులు నానాపాట్లు పడుతున్నారు. నరసరావుపేటలో అభ్యర్థి బంధువులు, టీడీపీ నాయకులు రెబల్ అభ్యర్థులతో చర్చలు జరిపినప్పటికీ ఎటువంటి ఫలితం లేదు. ఆలోచించుకుని చెబుతామంటూ వారు దాటవేత ధోరణిలో సమాధానం ఇచ్చినట్లు చెబుతున్నారు. మాచర్లలో టీడీపీ అభ్యర్థి చలమారెడ్డి మాజీ ఎమ్మెల్యేలు పిన్నెల్లి లక్ష్మారెడ్డి, కుర్రి పున్నారెడ్డిలను వెంట పెట్టుకుని వె ళ్లి రెబల్ అభ్యర్థులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారు ససేమిరా అన్నట్లు సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement