కేసీఆర్ రాక
20న జిల్లాలో సుడిగాలి పర్యటన
తొమ్మిది నియోజకవర్గాల్లో సభలు
ఒక్క చెన్నూరు మాత్రం మినహాయింపు
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు ఈనెల 20న జిల్లాలో పర్యటించనున్నారు. ఒక్క రోజులోనే తొమ్మిది నియోజకవర్గాలను చుట్టి వెళ్లాలని నిర్ణయించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అన్నిచోట్ల బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ఒక్క చెన్నూరు నియోజకవర్గాన్ని మాత్రం కేసీఆర్ మినహాయించడం గమనార్హం.
అయితే సమయం సరిపోక పోవడంతోనే చెన్నూరు నియోజకవర్గంలో బహిరంగ సభను నిర్వహించ లేకపోతున్నామని ఆ పార్టీ పశ్చిమ జిల్లా అధ్యక్షుడు లోకభూమారెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన కేసీఆర్ పర్యటన వివరాలను వెల్లడించారు.20వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు కేసీఆర్ ముథోల్ నియోజకవర్గంలోని భైంసా మార్కెట్ యార్డుకు చేరుకుంటారు.
అక్కడ నిర్వహించనున్న బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అక్కడి నుంచి మధ్యాహ్నం ఒంటి గంటకు నిర్మల్‌కు చేరుకుని బాలుర జూనియర్ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేయనున్న బహిరంగ సభలో పాల్గొంటారు. బోథ్ నియోజకవర్గంలోని ఇచ్చోడలో కూడా బహిరంగ సభలను నిర్వహిస్తున్నారు. ఈసభలో ప్రసంగించిన అనంతరం మధ్యాహ్నం 3.40 గంటలకు ఆదిలాబాద్‌లోని డైట్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేయనున్న సభలో ప్రసంగిస్తారు. అక్కడి నుంచి ఉట్నూర్‌కు చేరుకుని అక్కడ సాయంత్రం 4.40కి స్థానిక ఆర్టీసీ గ్రౌండ్‌లో జరిగే సభలో పాల్గొంటారు.
సాయంత్రం 4.40 గంటలకు కాగజ్‌నగర్ చేరుకుని అక్కడి సిర్పూర్ పేపర్ మిల్లు మైదానంలో ఏర్పాటు చేయనున్న సభలో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం 5.40 గంటలకు ఆసిఫాబాద్‌లోని బాలికల పాఠశాల మైదానంలో జరుగనున్న సభలో మాట్లాడతారు. అక్కడి నుంచి రాత్రి 7.30 గంటలకు బెల్లంపల్లి చేరుకుని తిలక్ స్టేడియంలో బహిరంగ సభను ముగించుకుంటారు.
ఆ తర్వాత మంచిర్యాలకు చేరుకుని డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేయనున్న సభలో కార్యకర్తలను దిశా నిర్దేశం చేస్తారు. ఈ మేరకు జిల్లా అధికార యంత్రాంగం గురువారం అనుమతులు మంజూరు చేసింది. చెన్నూరు నియోజకవర్గంలోని కార్యకర్తలను, ప్రజలను మంచిర్యాల సభకు తరలించాలని భావిస్తున్నారు.
పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు..
అధినేత కేసీఆర్ పర్యటనల ద్వారా ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపాలని ఆ పార్టీ భావిస్తోంది. తొమ్మిది నియోజకవర్గాల్లో పర్యటించడం ద్వారా జిల్లాలో ఒక్కసారి ఊపు తేవాలని యోచిస్తోంది. ఇప్పుటి వరకు ఆయా నియోజకవర్గాల ఆ పార్టీ అభ్యర్థులు ప్రచారం నిర్వహిస్తున్నప్పటికీ, శ్రేణుల్లో ఆశించిన మేరకు ఉత్సాహం నింపలేకపోతున్నారు. పైగా ప్రచారానికి పెద్దగా సమయం లేకపోవడంతో ఒక్కరోజులోనే జిల్లా అంతటా చుట్టేయాలని నిర్ణయించారు.