యాడికి బోయినా ఎలచ్చన్ల లొల్లే..
బాలరాజు: నర్సింహ పెదనాయినా.. యాడికి బోతానవే.. వారం రోజులైంది. నిన్ను జూసి.. ఏదైనా ముచ్చట జెప్తవేమోనని రోజూ ఒచ్చిపోతున్న. నువ్వేమో కనబడ్తలేవ్.
నర్సింహ: ఏడ బిడ్డా.. పనికిబోక వారం రోజులైతాంది. ఎలచ్చన్లు గదా.. ఒకటా రెండా.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీ అన్నీ ఒక్కసారిగ వచ్చే.. మళ్లీ ఐదేండ్ల దాకా ఎలచ్చన్లు ఉండయి. గప్పటిదాకా మళ్లీ ఎవ్వరు పల్కరియ్యరు. అందుకే గిప్పుడే ఎలచ్చన్ల సిత్రాలు జూద్దామని బోయిన.
బాలరాజు: అవును గదనే యాడజూసినా గివే ముచ్చట్లు జెప్పుకుంటున్రు. ఇగ పార్టీలల్ల ఉన్న పోరగాండ్లు పొద్దున బోయి రాతిరికి ఎప్పుడోస్తున్రో దెలుస్తలేదు.
నర్సింహ: అవును బిడ్డా. ఈ ఎలచ్చన్లలో మనోడు గెల్వక బోతే ఐదేండ్లదాక ఎవ్వడూ దేకడంటూ పోరగాండ్లు వాళ్ల లీడరు కోసం తిర్గుతున్నరు. పార్టీలు గూడా అంతే. ఈ సారి ఎలచ్చన్ల గెల్వకపోతే పార్టీలకు ఠిఖానా ఉండది.
బాలరాజు: అవునుగని జిల్లాల, మన నియోజకవర్గంల, మనమండల్ల యెట్లుందో జెప్పకపోతివి జర.
నర్సింహ: ఏముందిరా.. అన్ని పార్టీలల్ల ఆగమాగం. జిల్లాల జూస్కుంటుంటే నిన్న మొన్నటిదాకా ఒక పార్టీలో ఉన్నోళ్లు వే రొగపార్టీకి - గా పార్టీల ఉన్నోళ్లు ఇంకో పార్టీలోకి దుంకుతున్నరు. టిక్కెట్లు ఇయ్యరేమోనని కొందరు.. గాలి ఎటు మళ్లిందో సూస్కుంట పార్టీలోకి ఉర్కేటోళ్లు కొందరు... మన జెడ్పీ పదవి జనరల్ ఆడోళ్లకు అయ్యింది గదా.. కొన్ని ఊర్లు జీహెచ్‌ఎంసీల గల్వకుంట కోర్డు అడ్డుబడింది. ఇగ జూస్కో... సూస్కుందాం అంటే సూస్కుందాం అనేటట్టు ఎలచ్చన ్లల్ల కొట్లాడ్తున్నరు.
బాలరాజు: అదిసరేగని మన నియోజకవర్గం కథేందే..
నర్సింహ: మనది మేడ్చల్ కిందికి వస్తది గదా. నాలుగు మండలాల్ల జెడ్పీటీసీ ఎలచ్చన్లు జోరుమీద ఉన్నయి. ఇగ అన్ని పార్టీలోళ్లు డ్వాక్రా గ్రూపులనీ, ఆడబడుచుల లాంచనాలనీ, ఏదో తీర్గ వారిని మచ్చిక జేసుకునే పనిలో ఉన్నరు. ఇగ మొగొళ్లకేమో అది జేస్తం. ఇది జేస్తం అంటూ చెప్తున్నరు. జెడ్పీటీసీ, ఎంపీపీ సీట్లు గెల్చుకుంటే ఇక అటెన్క ఎమ్మెల్యే ఎలచ్చన్లలో ఎట్లజెయ్యాలనేది తెలుస్తదని అన్ని పార్టీలోళ్లు అనుకొంటుండ్రు.
బాలరాజు: గమ్మతుగుంది గదనే.. మరి మన మండల్ల..
నర్సింహ: మన మండల్ల కాంగ్రెస్, టీడీపీలు కుస్తీ పట్లు పడ్తున్నయి. మోకా జూస్కొని టీఆర్‌ఎస్ గూడా కోషీష్‌జేస్తోంది. మండలంల గిట్ల పాగా వేస్తేనే వచ్చే ఎమ్మెల్యే ఎలచ్చన్లల్ల ఓట్లు రాలుతయని అందరూ సోచాయిస్తుండ్రు. ఇంగ.. ముందుగల్ల జెడ్పీటీసీ టిక్కటు ఎవరికిస్తరో ఆ తర్వాతనే మేము గూడా జెప్తమంటున్రు కాంగ్రెస్ -టీడీపోల్లు -సొంచాయించగా.. సొంచాయించగా.. టీడీపోళ్లు బండారు రమాదేవి అనే ఆమెకో.. లేదా చీర్యాల దుర్గమ్మకో టిక్కటు ఇయ్యాలని అనుకుంటుండ్రట.
కాంగ్రెస్ పార్టోళ్లు నాగారం గ్రామానికి చెందిన మాధవికి, లేదా కీసరకు చెందిన పంతులమ్మ పద్మమ్మకు టిక్కటు ఇద్దామని అనుకుంటుండ్రట. ఐతారం కల్ల ఎవ్వరెవ్వరు నిలబడుతరో పురాగ తెలుస్తది. యాడ జూసినా ఎలచ్చన్ల కథే నడుస్తున్నది. బతిమాలుడు- బుజ్జగించుడు.. అయ్యా అప్పా అని దండాలు పెట్టుడు- ఒగటేమిటీ సినిమాలల్ల గూడా ఇంత ఖుషీ దొరకదు మనకు. ఇయన్నీ జూద్దామనే రోజూ బోతున్న బిడ్డా.
బాలరాజు: పెదనాయనా.. నువ్వు చెప్తుంటే చిత్రంగుందే. సూస్తే ఇంకెట్లుం టదో.. నేను గూడా నీతో వస్తా.. పా.. - బి.అంజిరెడ్డి/కీసర