'ఏలూరును మోడల్ నగరంగా తీర్చిదిద్దుతా'
ఏల్లూరు: కొల్లేరు సమస్యను పరిష్కరించే సత్తా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికే ఉందని ఏలూరు లోక్‌సభ వైఎస్‌ఆర్ సీపీ అభ్యర్థి డాక్టర్ తోట చంద్రశేఖర్ తెలిపారు. కొల్లేరును 5వ కాంటూరు నుంచి 3వ కాంటూరుకు తగ్గిస్తామని ఆయన హామీయిచ్చారు. పోలవరం ప్రాజెక్ట్‌ను 3 నుంచి 5 ఏళ్లలోపు పూర్తి చేస్తామని అన్నారు. ఐఏఎస్ అధికారిగా రెండున్నర దశాబ్దాలు ప్రజలతో కలిసి ఉన్నానని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికే తన తొలి ప్రాధాన్యత అని చెప్పారు. ఏలూరును మోడల్ నగరంగా తీర్చిదిద్దుతానని అన్నారు.
చంద్రబాబు చీకటి పాలనను ప్రజలెవరూ కోరుకోవద్దని విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు పాలనను గుర్తుచేస్తే ప్రజలు ఒక్కసారిగా భయాందోళనలు చెందుతున్నారన్నారు. ప్రస్తుతం చంద్రబాబు స్వయంగా నడవలేక సినిమా యాక్టర్‌ను, మతతత్వ నాయకుడిని ఊతకర్రలుగా చేసుకుని ప్రచారం సాగిస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఉచిత వాగ్దానాలను నమ్మి ఓటేస్తే మళ్లీ చీకటి రోజులు వస్తాయని చంద్రశేఖర్ హెచ్చరించారు.