ఎన్నికైన ప్రతిసారీ ప్రతిపక్షమే!
సిరిసిల్ల, న్యూస్‌లైన్: నిజాం నిరంకుశ పాలనపై అలుపెరగని పోరాటం చేసిన యోధుడు చెన్నమనేని రాజేశ్వర్‌రావు(92). తనయుడికి రాజకీయ భవితవ్యం ఇచ్చేందుకు ఐదున్నర దశాబ్దాల రాజకీయ జీవితం నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్నారు. ఎమెల్యేగా గెలిచిన ప్రతిసారీ ప్రతిపక్షంలోనే కూర్చుండడం విశేషం. రూ.పదిహేను వందలతో ఎమ్మెల్యేనయ్యానని చెప్పుకునే ఆయన గాంధీయిజం, మావోయిజం ప్రభావం తనపై ఉందంటారు. కరీంనగర్ జిల్లా కోనరావుపేట మండలంలోని నాగారం రాజేశ్వర్‌రావు స్వగ్రామం. చెన్నమనేని శ్రీనివాసరావు, చంద్రమ్మ దంపతులకు పెద్ద కుమారుడు. హన్మంతరావు, వెంకటేశ్వర్‌రావు, విద్యాసాగర్‌రావు సోదరులు. విద్యాసాగర్‌రావు బీజేపీ నేతగా, కేంద్ర మాజీమంత్రిగా అందరికీ పరిచయమే. మరో సోదరుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ హన్మంతరావు కేంద్ర ప్రణాళిక సంఘంలో సభ్యుడు.
రాజేశ్వర్‌రావు తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటూనే భార్యతో సహా సాయుధ పోరాటం వైపు అడుగులు వేసి జైలు పాలయ్యారు. ముంబయిలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను కలిసే అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నారు. 1952లో చంచల్‌గూడ జైలు నుంచే నామినేషన్ పత్రాలు పంపినా గడువుకు అరగంట ఆలస్యంగా అవి ఎన్నికల అధికారికి చేరడంతో పోటీచేసే అవకాశం కోల్పోయారు. తర్వాత 1957, 1967, 1985, 1994, 2004 ఎన్నికల్లో విజయం సాధించారు. 1985 నుంచి 1989 వరకు శాసనసభలో సీపీఐ పక్షనేతగా కొనసాగారు. అదే సమయంలో సోదరుడు సీహెచ్.విద్యాసాగర్‌రావు బీజేపీ పక్షనేతగా కొనసాగారు. 1998లో తెలంగాణ స్వాతంత్య్ర సమరయోధుల స్క్రీనింగ్ కమిటీ చైర్మన్‌గా పనిచేశారు. 1999 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. తనయుడు చెన్నమనేని రమేశ్‌బాబు కోసం రాజకీయాల నుంచి తప్పుకున్నారు.