ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్ : వరుస ఎన్నికల నేపథ్యంలో మద్యం విక్రయాలపై ఎక్సైజ్‌శాఖ నిఘా ముమ్మరం చేసింది. జిల్లా నలుమూలలా ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేసింది. ఇంతకు ముందెన్నడూ లేని విధంగా ఒకేసారి మున్సిపల్ ఎన్నికలతో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ.. ఆ వెంటనే సార్వత్రిక ఎన్నికలు రావడంతో అధికారులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు.
ఎన్నికల నియమావళితో పాటు అదే సమయంలో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కొనసాగుతుండటంతో మద్యం విక్రయాలపై ఎక్సైజ్ అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. నిన్న మొన్నటి వరకూ పాలకుల కనుసన్నల్లో నడిచిన మద్యం షాపులు, బార్‌లు వాటికి అనుసంధానంగా నడిచే బెల్ట్‌షాపులపై ఇప్పుడు అధికారులు చర్యలకు పూనుకుంటున్నారు. విచ్చలవిడి మద్యం అమ్మకాలతో పాటు అక్రమ మద్యం తరలింపు, ఎన్‌డీపీ మద్యం వచ్చే దారులపై నిఘా ఉంచారు. ఎన్నికలనగానే ప్రధానంగా చర్చకు వచ్చేది మద్యం వ్యవహారమే.
మద్యం లేనిదే ఏ పార్టీ కార్యకర్తా ప్రచారానికి ఒక్క అడుగు కూడా ముందుకు వేయడు. అలాంటి పరిస్థితుల్లో గతేడాది ఎంతైతే మద్యం విక్రయించారో ఇప్పుడు కూడా అంతే మద్యం విక్రయించాలని ఎక్సైజ్‌శాఖ నిబంధన మద్యం వ్యాపారుల్లో గుబులు రేకెత్తిస్తోంది. సాధారణంగా నెల మొత్తం మీద వినియోగించే మద్యం ప్రస్తుత పరిస్థితుల్లో వారానికి కూడా సరిపోదంటే అతిశయోక్తికాదు.
శాఖల మధ్య సమన్వయం
ఎన్నికల్లో ఓటుకు నోటు కార్యక్రమాన్ని పోలీసులు, ఎన్నికల అధికారులు ఏ విధంగా అరికట్టాలో.. మద్యం ప్రవాహాన్ని కూడా పోలీసులు, ఎక్సైజ్ శాఖాధికారులు యూనిట్‌గా ఏర్పడి అరికట్టాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. జిల్లాలో మొత్తం 278 మద్యం షాపులు, 41 బార్‌లు ఉన్నాయి.
ఇక బెల్ట్‌షాపులు సరేసరి. హైవే, రహదారుల వెంట నడుస్తున్న దాబాల్లో ఎక్కడా మద్యం విక్రయించకూడదు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే మద్యం షాపుల యజమానులపై ఫిర్యాదు చేసేందుకు అధికారులు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఫిర్యాదులను 08592-233182 నంబర్‌కు ఫోన్ చేసి చెప్పవచ్చు. సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యే వరకు 24 గంటలూ కంట్రోల్ రూమ్ అందుబాటులో ఉంటుంది.
మద్యం అక్రమ రవాణాకు చెక్
అక్రమ మద్యం, ఎన్‌డీపీ మద్యం, కల్తీ మద్యం, బెల్లం ఊట, నాటుసారాను అరికట్టేందుకు జిల్లావ్యాప్తంగా ఎక్సైజ్‌శాఖ 8 చెక్ పోస్టులను ఏర్పాట చేసింది. అవి 5వ నంబర్ జాతీయ రహ దారిపై టంగుటూరు టోల్‌ప్లాజా వద్ద, ఒంగోలు-కర్నూలు హైవేలో చీమకుర్తి వద్ద, అద్దంకి-హైదరాబాద్ హైవే బొల్లాపల్లి టోల్‌ప్లాజా వద్ద చెక్‌పోస్టులు రోజుమార్చి రోజు ఏర్పాటు చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకున్నారు.
దోర్నాల, గిద్దలూరు సమీపంలోని వైఎస్సార్ జిల్లా సరిహద్దు ఆదిమూర్తిపల్లి, కర్నూలు జిల్లా సరిహద్దు దిగువమెట్ట, పామూరు ప్రాంతాల్లో కూడా చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. వీటితో పాటు రెండు మొబైల్ పార్టీలను నియమించారు. రైళ్లలో మద్యం తరలింపును అరికట్టేందుకు ట్రైన్ చెకింగ్ టీమ్‌ను కూడా నియమించారు. వీటికి తోడుగా ఇంటెలిజెన్స్ డిటెక్షన్ టీమ్‌ను రంగంలోకి దించారు. షాపుల్లో మద్యాన్ని ఎంఆర్‌పీకే విక్రయించాలని, అలా కాకుండా నిబంధనలు అతిక్రమిస్తే ఆయా షాపులపై కేసులు నమోదు చేసి యజమానులపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు ఎక్సైజ్‌శాఖ అధికారులకు వచ్చాయి.
అధికారులు కఠినంగా ఉండాలి : ఎం.భాస్కరరావు ఈఎస్
ఎన్నికల నియమావళి అమలులో ఎక్సైజ్ అధికారులు కఠినంగా ఉండాలి. నిఘా ముమ్మరం చేసి ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు చర్యలు తీసుకోవాలి. మద్యం షాపులు సమయపాలన పాటించాలి. మద్యం అధిక ధరలకు విక్రయిస్తే కేసులు నమోదు చేయాలి. జిల్లాలో ఇప్పటికే 143 బైండోవర్ కేసులు నమోదు చేశాం.
మద్యం విక్రయాలపై డేగకన్ను
Published Sun, Mar 23 2014 2:04 AM | Last Updated on Thu, Jul 11 2019 8:43 PM
Advertisement
Advertisement