సాక్షి, మంచిర్యాల : కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీల్లో బీ-ఫారాల పంపిణీ ముసలం పుట్టించింది. రెండు పార్టీల్లోనూ జెడ్పీటీసీ, ఎంపీటీసీ బీ-ఫారాలు అందని అసంతృప్తవాదులు సోమవారం నాయకులతో గొడవకు దిగారు. ఒక పార్టీ నాయకుడు తమకే బీ-ఫారం దక్కాలని ఒంటిపై పెట్రో లు పోసుకోగా.. మరో నాయకుడు సొంత పార్టీ నాయకుడి చేతిలోని ఫారాన్ని చించేశారు. ఇక అసంతృప్తికి ఆలవాలమైన కాంగ్రెస్‌లో బీ-ఫారం దక్కిన వ్యక్తి దానిని చించేశారు.
తన మిత్రులకు పార్టీ గుర్తింపు పత్రం దక్కకపోవడం ఆయన అసంతృప్తికి కారణమైంది. నామినేషన్ల ఉపసంహరణ, బీ-ఫారాల సమర్పణకు చివరి రోజైన సోమవారం జిల్లాలో ఈ చిత్రాలు చోటు చేసుకున్నాయి. తలోదారిలో ఉన్న నేతలను సమన్వయ పరిచేందుకు చివరి రోజు వరకూ బీ-ఫారం అందజేయకూడదనే ఎత్తుగడను పార్టీలు అమలుపరిస్తే అసంతృప్తులు అంతకు తగ్గట్లే నాయకులు వ్యవహరించడం కొసమెరుపు.
గులాబీకి గుచ్చుకున్న ముళ్లు
జిల్లాలోనే అత్యధిక నామినేషన్లు టీఆర్‌ఎస్ నుంచి దాఖలైన ఆనందం ఆ పార్టీ నేతల్లో నిలిచే అవకాశాన్ని గులాబీ నాయకులు కల్పించలేదు. దాదాపు అన్నిచోట్లా అసంతృప్తుల బెడదను ఆ పార్టీ ఎదుర్కొంది. కొన్నిచోట్ల అది సిగపట్లకు దారితీసింది. తన తల్లికి పార్టీ తరఫున పోటీ చేసే అవకాశం కల్పిస్తామని చెప్పి చివరి క్షణంలో మొండిచేయి చూపడాన్ని తట్టుకోలేక కోటపల్లి మండలంలోని ఓ టీఆర్‌ఎస్ కార్యకర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కోటపల్లి మండలం ఎదుల్లబందం ఎంపీటీసీ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వ్ కాగా ఆ స్థానానికి టీఆర్‌ఎస్ నుంచి తన తల్లి అయిన గోమాస రాజును పోటీకి దింపాలని ఆ పార్టీ కార్యకర్త మురళీకృష్ణ భావించాడు.
ఈ మేరకు పార్టీ నేతల నుంచి హామీ పొందినా చివరి నిమిషంలో మొండి చేయి చూపడాన్ని ఆయన జీర్ణించు కోలేకపోయారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఒంటి పైన పెట్రోల్ పోసుకొని నిప్పటించుకొనే ప్రయత్నం చేశారు. స్థానికులు గమనించి అడ్డుకోవడంతో స్వల్పగాయాలతో బయటపడ్డారు. కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు టిక్కెట్ ఇవ్వడం లేదని, టీఆర్‌ఎస్ నాయకులు టిక్కెట్లు అమ్ముకుంటున్నారని మురళీకృష్ణ ఆక్రోశం వెల్లగక్కారు. ఇదిలాఉండగా.. దండేపల్లి మండలం గూడెం ఎంపీటీసీ స్థానానికి పార్టీ బీ-ఫారం దక్కించుకునేందుకు ఏడుగురు అభ్యర్థులు పోటీపడగా అందులో కానుగంటి తిరుపతి ఆ అదృష్టం వరించింది. తిరుపతిని తోడ్కొని పార్టీ మండల అధ్యక్షుడు నామినేషన్ దాఖలు చే సుకునేందుకు ఎన్నికల కేంద్రంలోకి వెళుతుండగా ఉద్రిక్తత నెలకొంది. తమకు కావాల్సిన వారికి పార్టీ బీ-ఫారం రాలేదన్న అక్కసుతో అక్కడే ఉన్న కొందరు అభ్యర్థుల మద్దతుదారులు బీ-ఫారంను లాక్కొని చించేశారు. ఇరువర్గాల మధ్య వివాదం నెలకొని ఒకరినొకరు తోసుకున్నారు.
దీంతో పరిస్థితి ఉద్రిక్తత గమనించిన పోలీసులు లాఠీలకు పని చెప్పి ఆందోళనకారులను తరిమేసి వివాదానికి పాల్పడిన వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా పరిషత్ కార్యాలయంలో టీఆర్‌ఎస్ పశ్చిమ జిల్లా యువజన విభాగం కార్యదర్శి కిరణ్‌కుమార్‌రెడ్డి పార్టీ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఉద్యమంలో భాగస్వామ్యులైన వారిని గుర్తించకుండా నిన్న గాక మొన్న వచ్చిన వారికే తమ పార్టీ ప్రాధాన్యం ఇస్తోందని ఆక్షేపించారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన టీఆర్‌ఎస్ బోథ్ రాములునాయక్‌ను నిలదీశారు.
కాంగ్రెస్‌లో కలహాలు
అంతర్గత కుమ్ములాటలకు చిరునామా అయిన కాంగ్రెస్‌ను బీ-ఫారం కేటాయింపు గొడవ వదల లేదు. బీ-ఫారాలు ముందుగా ఇస్తే కలహాలు వస్తాయని గ్రహించిన పార్టీ పెద్దలు ఆఖరి రోజు వరకు వేచి ఉండేలా చేసి చివరి నిమిషంలో సంబంధిత పత్రాలు ఇచ్చినా ఆ రోజు తన్నులాట తప్పలేదు. సాక్షాత్తు పార్టీ నాయకుల సమక్షంలోనే తనకెందుకు బీ-ఫారం అంటూ చించివేశారు. ముథోల్ మండలంలోని బాసర-1 ఎంపీటీసీ స్థానానికి బరిలో ఉన్న రమేష్ తను బలపరుస్తున్న ఇద్దరు అభ్యర్థులకు కాంగ్రెస్ బీ-ఫారం దక్కలేదని అలక వహించారు. మిత్రులకు దక్కని బీ-ఫారం తనకెందుకని అసహనం వ్యక్తం చేస్తూ అక్కడికక్కడే పార్టీ బీ-ఫారం చించేశారు.
తనను పక్కనపెట్టి కావాలనే కొందరికీ బీ-ఫారం కేటాయించారని బోథ్ నియోజకవర్గ నాయకుడు అనిల్‌జాదవ్ అనుచరులు మండిపడ్డారు. కొంతకాలంగా కాంగ్రెస్‌కు చేసిన సేవలకు ప్రతిఫలం ఇదేనా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల వేళ కూడా తమ నాయకులు వర్గపోరును, ఆధిపత్య ఆలోచనను వీడకుండా ఉంటే ఫలితాలు ప్రత్యర్థి పార్టీలకు అనుకూలంగా ఉండక ఏం చేస్తాయని ఓ ప్రధాన పార్టీ కార్యకర్త ఆవేదన వ్యక్తం చేశారు.
బీ-ఫారాల జగడం
Published Tue, Mar 25 2014 2:19 AM | Last Updated on Tue, Oct 9 2018 5:27 PM
Advertisement
Advertisement