రగులుతున్న తమ్ముళ్లు
తొలిజాబితాలో ఐదుగురు అభ్యర్థులు ఖరారు
ఇంకా పెండింగులోనే ‘కోదాడ’
జిల్లా నుంచి మోత్కుపల్లి పోటీ చేయనట్టేనా!
రాజీనామాలకు సిద్ధపడుతున్న నేతలు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ టీడీపీకి జిల్లాలో భువనగిరి, తుంగతుర్తి, కోదాడ నియోజకవర్గాల్లో సిట్టింగు ఎమ్మెల్యేలున్నా, కేవలం భువనగిరి స్థానానికి మాత్రమే తొలి జాబితాలో చోటు దక్కింది. తుంగతుర్తి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిటీ కన్వీనర్ మోత్కుపల్లి నర్సింహులు ఈ సారి జిల్లా నుంచి పోటీ చేయడం ప్రశ్నార్థకంగానే కనిపిస్తోంది. ఈ కార ణంగానే ఆయన పేరును ప్రకటించలేదని చెబుతున్నారు. కోదాడ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్‌రావు టికెట్‌పై ఇంకా సస్పెన్సే కొనసాగుతోంది.
బీసీ సామాజిక వర్గానికి చెందిన బొల్లం మల్లయ్యయాదవ్ ఇక్కడి నుంచి టికెట్ రేసులో ఉన్నారు. టికెట్ కోసం పోటీ త్రీవంగానే ఉంది. ఈ కారణంగానే చివరి నిమిషంలో టికెట్ ఖరారు చేసే ఉద్దేశంతో పెండింగులో పెట్టినట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల పొత్తుల్లో భాగంగా బీజేపీకి వదిలేయాలని దాదాపు నిర్ణయించిన ఆలేరు, మునుగోడు, నల్లగొండ స్థానాల విషయంలోనూ వివాదం జరుగుతోంది. ఆలేరును మినహాయిస్తే, మునుగోడు టీడీపీ శ్రేణులు అధినాయకుని నిర్ణయంపై కస్సుమంటున్నారు.
నియోజకవర్గ ఇన్‌చార్జ్ కర్నాటి వెంకటేశం రాజీనామా చేయాలన్న ఆలోచనకు వచ్చారని సమాచారం. అయితే, ఈ నెల 11వ తేదీన జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నిక జర గనున్నందున అప్పటి దాకా వేచి ఉండి 12వ తేదీన పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఆలోగా ఆయన తన సహచరులు, అనుచరులతో మాట్లాడుకుని ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేయాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. మరో వైపు నల్లగొండలోనూ టీడీపీ శ్రేణులు నిరుత్సాహంగా ఉన్నాయి. మునుగోడు, నల్లగొండలో తన వర్గీయులకు టికెట్ ఇవ్వకుండా బీజేపీకి కేటాయించినందునే భువనగిరి ఎమ్మెల్యే ఉమామాధవరెడ్డి రాజీనామాకు సిద్ధపడినట్లు పార్టీల వర్గాల సమాచారం.
ఈ విషయాలన్నింటినీ విశ్లేషిస్తే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు విడుదల చేసిన తొలి జాబితా పార్టీలో చిచ్చు రేపుతోంది.భువనగిరి సిట్టింగ్ సీటును ప్రస్తుత ఎమ్మెల్యే ఉమామాధవరెడ్డికి కేటాయించారు. ఇప్పటికే ఆమె ఈ నియోజకవర్గం మూడు పర్యాయాలు గెలిచి, నాలుగోసారి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మిర్యాలగూడ నియోజకవర్గానికి గడిచిన అయిదేళ్లుగా కనీసం ఇన్‌చార్జ్‌ను కూడా నియమించ లేదు. పార్టీ నాయకుడు బంటు వెంకటేశ్వర్లుకు ఈ సారి అనూహ్యంగా టికెట్ దక్కింది. జిల్లాలో బీసీ వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వాలనే కారణంగానే ఆయనకు టికెట్ దక్కిందంటున్నారు.
మునుగోడులో కర్నాటి వెంకటేశానికి అవకాశం ఇవ్వలేక పోయినందున ఆ లోటును మిర్యాలగూడలో పూడ్చారు.హుజూర్‌నగర్ నియోజకవర్గ అభ్యర్థిగా వంగాల స్వామిగౌడ్‌ను ఖరారు చేశారు. కొద్ది నెలల కిందటే ఆయనను ఇక్కడ ఇన్‌చార్జ్‌గా నియమించారు.గతంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షునిగా కూడా పనిచేసిన స్వామిగౌడ్ టీడీపీలో చేరి గత ఎన్నికల్లో అభ్యర్థిగా కూడా పోటీ చేశారు. అప్పటి నుంచి మొన్న మొన్నటిదాకా జిల్లా అధ్యక్షునిగా కూడా పనిచేశారు.
దేవరకొండ నియోజకవర్గానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు బిల్యానాయక్‌కు టికెట్ ఇచ్చారు. స్వామిగౌడ్ నుంచి పార్టీ పగ్గాలు స్వీకరించిన బిల్యానాయక్ పెద్దగా ప్రభావం చూపలేక పోయారు. నియోజకవర్గానికే పరిమితమయ్యారు. టికెట్ కోసం పోటీ పడే వారూ లేకపోవడంతోఆయన పేరు తొలి జాబితాల్లోనే చోటు చేసుకుంది.సూర్యాపేట టికెట్ పార్టీలో ఉత్కంఠ రేపింది. నియోజకవర్గ ఇన్‌చార్జ్ పటేల్ రమేష్‌రెడ్డికి టికెట్ ఖరారైంది. ఈ స్థానాన్ని బీజేపీకి వదిలేస్తున్నారని ప్రచారం జరిగింది. దీంతో టీడీపీ శ్రేణులు నాయకత్వంపై ఒత్తిడి పెంచాయి. దీంతో చివరకు రమేష్‌రెడ్డికే టికెట్ దక్కింది.