సాక్షి, కడప: పుర సమరంలో ప్రచార పర్వం ఉరకలేస్తోంది. వరుస ఎన్నికల పరంపరలో తొలిదైన మున్సిపోల్స్‌కు కేవలం ఆరు రోజులు మాత్రమే గడువు ఉంది. బరిలో ఉన్న అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇప్పటికే అభ్యర్థులకు మండే ఎన్నికలు పరీక్షగా మారాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో అభ్యర్థులు గడప గడపకు వెళ్లి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. వివిధ వర్గాలను ప్రసన్నం చేసుకునేందుకు ముమ్మర యత్నాలు చేస్తున్నారు. మున్సిపాల్టీల్లో పాగా వేసి సార్వత్రిక ఎన్నికలకు బాటలు వేసుకునేందుకు ప్రధాన పార్టీలు శత విధాల ప్రయత్నిస్తున్నాయి. సర్వ శక్తులు ఒడ్డుతున్నాయి..
వైఎస్సార్‌సీపీ దూకుడు....
మున్సిపోల్స్‌లో వైఎస్సార్ దూకుడు పెంచింది. పోలింగ్ సమయం దగ్గర పడుతుండటంతో ఠమొదటిపేజీ తరువాయి
ఆ పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేస్తూనే వ్యూహలకు పదును పెడుతోంది. తెలుగు దేశం పార్టీ నాయకులు ఎక్కువ హడావిడి చేస్తున్న డివిజన్‌లు, వార్డులపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. అక్కడ అభ్యర్థులకు మట్టి కరిపించేందుకు తన దైన శైలిలో ప్రచారాన్ని ఉధృతం చేసింది. వైఎస్సార్‌సీపీ ప్రవేశ పెట్టేబోయే పథకాలను వివరిస్తూ ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసింది. కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో అభ్యర్థులను దింప లేక ఇప్పటికే చేతులెత్తేసింది.
వైఎస్‌ఆర్ జిల్లా స్థానిక పరిశీలకులు వైఎస్ అవినాష్ రెడ్డి ప్రచారాన్ని పర్యవేక్షిస్తున్నారు. నాయకులతో మంతనాలు జరుపుతూ గెలుపు బాటలకు మార్గం సుగమం చేస్తున్నారు. కడప కార్పొరేషన్‌లో మేయర్ అభ్యర్థి కె.సురేష్ బాబు, మాజీ మేయర్ పి.రవీంద్రనాథరెడ్డి, నియోజక వర్గ సమన్వయ కర్త అంజాద్‌బాషాతో పాటు ముఖ్య నేతలు వ్యూహత్మకంగా వెళుతూ అన్నీ తామై నడిపిస్తున్నారు. డివిజన్‌లలో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. టీడీపీ ప్రచారంలో బాగా వెనకబడింది. ఆపార్టీ నాయకుల మధ్య సయోధ్య లేక పోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. టీడీపీ మేయర్ అభ్యర్ధి బాలకృష్ణా యాదవ్ అంత ప్రభావం చూపలేక పోతున్నారని ఆ పార్టీ శ్రేణులే పెదవి విరుస్తున్నాయి.
మున్సిపాలిటీలలో....
ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో వైఎస్సార్‌సీపీ, టీడీపీ మధ్యే ప్రధానంగా పోటీ నెలకొంది. అక్కడ వైఎస్సార్‌సీపీ నియోజక వర్గ సమన్వయకర్త రాచమల్లు ప్రసాదరెడ్డి, ముక్తియార్, ఈవీ సుధాకర్‌రెడ్డితో పాటు ముఖ్య నేతలంతా ఏక తాటిపై నిలబడి గెలుపుకోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రచారంలో దూసుకు పోతున్నారు. టీడీపీ స్థానిక నేతల మధ్య లుకలుకలతో అక్కడ పార్టీ సతమతమవుతోంది. పులివెందుల్లో వైఎస్సార్‌సీపీ దూసుకు పోతోంది. అక్కడ టీడీపీ, కాంగ్రెస్ ప్రభావం నామ మాత్రంగానే ఉంది. బద్వేలులో నియోజక వర్గ సమన్వయ కర్త డీసీ గోవిందరెడ్డి, రాయచోటిలో ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత రెడ్డి అధ్వర్యంలో ఇప్పటికే జనాదరణ పెంచుకున్న వైఎస్సార్‌సీపీ ప్రచారంలో ముందంజలో పయనిస్తోంది.
ఇక్కడ టీడీపీ నాయకులు సర్వ శక్తులు ఒడ్డుతున్నా క్షేత్ర స్థాయిలో మాత్రం ఆపార్టీ అపసోపాలు పడుతోంది. జమ్మలమడుగు, ఎర్రగుంట్లలో ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, కేంద్ర పాలక మండలి సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి నేతృత్వంలో అన్నివిధాల పార్టీ ముదంజలో ఉంది. ఇక్కడ టీడీపీ పరువు నిలుపుకునేందుకు కాంగ్రెస్ పార్టీతో కుమ్మకై పడరాని పాట్లు పడుతోంది. మైదుకూరు మున్సిపాలిటీలో ఎస్ .రఘరామిరెడ్డి అధ్వర్యంలో ప్రచారాన్ని ముమ్మరం చేశారు.
పార్టీ శ్రేణులను ఏక తాటిపైకి తెచ్చి పీఠాన్ని కైవసం చేసుకునేందుకు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. పరువు నిలుపుకునేందుకు డాక్టర్ డీఎల్ రవీంద్రారెడ్డి, తెలుగుదేశం పార్టీ నియోజక వర్గ ఇన్‌ఛార్జి సుధాకర యాదవ్ పడరాని పాట్లు పడుతున్నారు. మొత్తం మీద మున్సిపోల్స్‌కు గడువుకు ఆరు రోజులే ఉండటంతో ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరింది.
ప్రచార వేడి
Published Mon, Mar 24 2014 1:47 AM | Last Updated on Tue, Oct 16 2018 6:35 PM
Advertisement
Advertisement