
'పరుగెత్తేవారి కాళ్లలో కాళ్లుపెడుతున్నారు'
హైదరాబాద్: చంద్రబాబుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోబియా పట్టుకుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత గట్టు రామచంద్రరావు ఎద్దేవా చేశారు. చంద్రబాబు మాట్లాడిందే ఈనాడు రాసిందని ఆరోపించారు. ఎన్నికల్లో పరుగెత్తలేక పరుగెత్తేవారి కాళ్లలో చంద్రబాబు, రామోజీరావు కాళ్లుపెడుతున్నారని ధ్వజమెత్తారు. టైటానియం ప్రాజెక్టు కుంభకోణంలో వైఎస్ఆర్ సమీప బంధువు పాత్ర ఉందని 'ఈనాడు'లో వచ్చిన కథనాన్ని ఆయన ఖండించారు.
రామోజీరావు, చంద్రబాబు చుట్టూ బిగిసిన ఉచ్చులపై విచారణ జరిగి ఉంటే అదివేరేలా ఉండేదన్నారు. సోనియా గాంధీ కాళ్లు పట్టుకుని విచారణ నుంచి తప్పించుకోకుంటే వీళ్ల చుట్టూ ఉచ్చు గట్టిగానే బిగుసుకునేదన్నారు. చంద్రబాబు జనామోదాన్ని పొందలేక ఇలాంటి రాతలు రాస్తున్నారని ఆరోపించారు. అభియోగాలు ఎదుర్కొంటున్న వ్యక్తి తాను ముడుపులేవీ ఇవ్వలేదని చెప్తున్నారని తెలిపారు.
దేశ నాయకుల మీద అమెరికా చట్టాలు అభియోగాలు మోపిన విషయం మరిచిపోరాదన్నారు. సిక్కుల అల్లర్లకేసులో సోనియా, గోద్రా అల్లర్ల కేసులో మోడీకి వీసా రానీయకుండా అడ్డుకున్నది అమెరికా చట్టాలేనని గుర్తు చేశారు. అభియోగాలు నిరూపించాల్సింది దేశంలోని కోర్టులు తప్ప ఇతరత్రాకావని గట్టు రామచంద్రరావు స్పష్టం చేశారు.