మోడీ చరిత్ర సృష్టిస్తారు: అద్వానీ
తిరువనంతపురం: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ఈసారి కేంద్రంలో అధికారంలోకి రావడం ఖాయమని, పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ చరిత్ర సృష్టిస్తారని ఆ పార్టీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌కు మద్దతుగా తిరువనంతపురంలో మంగళవారం నిర్వహించిన బహిరంగ సభలో అద్వానీ పాల్గొన్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత ఎవరి ప్రభుత్వం వస్తుందో ప్రజలందరికీ తెలుసునని, బీజేపీ కూటమికి చరిత్రాత్మక ఫలితాలు వస్తాయని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.
‘నరేంద్ర భాయ్ దేశంలో చరిత్ర సృష్టించనున్నారు. కేరళ నుంచి తిరువనంతపురం సీటును గెలుచుకుని రాజగోపాల్ అందులో భాగస్వామి కావాలని కోరుకుంటున్నాను’ అని అద్వానీ అన్నారు. దేశంలో తొలిసారిగా ప్రధాని మన్మోహన్ సింగ్.. ఇంకా పదవిలో ఉండగానే, ఎన్నికల కంటే ముందే కొత్త నివాసాన్ని వెతుక్కుంటున్నారని ఎద్దేవా చేశారు. జాతీయ రాజకీయాల్లో లెఫ్ట్ పార్టీకు నానాటికీ ప్రాధాన్యత తగ్గిపోతోందని, ఎక్కువ మంది ప్రజలు బీజేపీ వైపు మళ్లుతున్నారని ఆయన పేర్కొన్నారు.