జిల్లా కేంద్రం జనసంద్రం
పాత గుంటూరు/విద్యానగర్, న్యూస్‌లైన్ :వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి నామినేషన్ కార్యక్రమం సందర్భంగా గుంటూరు నగరం జనసంద్రంగా మారింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున నామినేషన్ కార్యక్రమానికి తరలివచ్చారు. గురువారం ఉదయం నలందానగర్‌లోని బాలశౌరి కార్యాలయం వద్దకు పార్లమెంటు పరిధిలోని అన్ని ప్రాంతాల నుంచి ప్రజలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావడంతో ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారింది. కార్యాలయానికి అప్పటికే చేరుకున్న పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యే అభ్యర్థులు ఆళ్ళ రామకృష్ణారెడ్డి(మంగళగిరి), మేకతోటి సుచరిత(ప్రత్తిపాడు), లేళ్ళ అప్పిరెడ్డి(గుంటూరు పశ్చిమ), మొహమ్మద్ ముస్తఫా(గుంటూరు తూర్పు), రావి వెంకటరమణ(పొన్నూరు), కత్తెర క్రిష్టినా(తాడికొండ), అన్నాబత్తుని శివకుమార్(తెనాలి) బాలశౌరిని కలిసి పుష్పగుచ్ఛాలు అందించి అభినందనలు తెలిపారు.
కార్యాలయంలో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహించారు. కార్యాలయం బయట వేచి ఉన్న జనానికి అభివాదంచేసి, ఫ్యాను గుర్తును చూపుతూ పార్టీ జెండాఊపి బాలశౌరి, ఎమ్మెల్యే అభ్యర్థులు ర్యాలీని ప్రారంభించారు. ఇటి వద్ద ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన వాహనంపై ఎమ్మెల్యే అభ్యర్థులతోపాటు 9గంటలకు ర్యాలీగా బాలశౌరి బయలుదేరారు. విద్యానగర్, సాయిబాబారోడ్డు మీదుగా కొరిటెపాడుకు ర్యాలీ చేరింది. కొరిటెపాడు సెంటర్ మహాత్మాగాంధీ, లక్ష్మిపురం సెంటర్‌లో మదర్‌థెరిస్సా, లాడ్జ్ సెంటర్‌లో అంబేద్కర్, హిందూకళాశాల సెంటర్‌లో పొట్టి శ్రీరాములు విగ్రహాలకు బాలశౌరి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ర్యాలీలో కళాకారులు పలు వేషదారణలతో చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. మండుటెండను సైతం లెక్కచేయకుండా ప్రజలు వేలాదిగా తరలిరావడంతో వీధులన్నీ జనసంద్రంగా మారాయి.
ర్యాలీ మార్గంలో నగరంలో ఏవీధిలో చూసిన జనసంద్రాన్ని తలపించింది. ప్రతి కార్యకర్త చేతిలో పార్టీ జెండా పట్టుకుని జైజగన్, జైజైజగన్. జైబాలశౌరి, వైఎస్సార్ జోహార్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్థిల్లాలి, రాజన్న రాజ్యం జగనన్నకే సాధ్యం, పులివెందుల పులిబిడ్డ జగన్ అంటూ చేసిన నినాదాలతో నగరం మార్మోగిపోయింది. కార్యకర్తలు ఫ్యానుగుర్తు చూపిస్తూ స్థానికులను ఉత్సాహపరిచారు. ప్రజలు ఎదురు వచ్చి బాలశౌరికి అడుగడుగునా అభినందనలు తెలిపారు. కలెక్టరేట్‌రోడ్డులోని మూడు బొమ్మల సెంటర్ సమీపంలో మహిళలు ఘనంగా స్వాగంతం పలికారు. బాలశౌరికి గుమ్మడికాయతో దిష్టితీసి తిలకం దిద్దారు. అనంతరం బిందెలతో వాహనానికి కాడిపోసి హారతులు పట్టారు. నగరంపాలెంలోని స్టేట్ బ్యాంక్ సమీపంలో వాహనాన్ని దిగి ఎమ్మెల్యే అభ్యర్థులు, ముఖ్యనాయకులతో పాదయాత్రగా కలెక్టరేట్‌లోకి వెళ్లారు. గేటు వద్ద బాలశౌరితోపాటు మరో నలుగురిని మాత్రమే అనుమతించడంతో మేకతోటి సుచరిత, ఆళ్ళ రామకృష్ణారెడ్డి, రావి వెంకటరమణ, మొహమ్మద్ ముస్తఫాలతో కలిసి వెళ్లి ఆయన నామినేషన్ దాఖలు చేశారు. కార్యక్రమంలో పార్టీ యువజన విభాగం జిల్లా కన్వీనర్ కావటి మనోహర్‌నాయుడు, థామస్‌నాయుడు, ఆతుకూరి ఆంజనేయులు, మెట్టు వెంకటప్పారెడ్డి, షేక్ షౌకత్, నసీర్ అహ్మద్, గులాంరసూల్, కిలారి రోశయ్య, విజయసారథి, రాతంశెట్టి సీతారామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.