సాక్షిప్రతినిధి, కర్నూలు : తమ్ముళ్ల ఓటమి భయం సరికొత్త పాలి‘ట్రిక్స్’కు వేదికవుతోంది. అధికార కాంక్ష వారిని ఎంతకైనా బరితెగించేలా చేస్తోంది. కర్నూలు నగరంలో అభ్యర్థుల గెలుపోటములు ముస్లిం ఓటర్లపైనే ఆధారపడింది. ఈ నేపథ్యంలో బీజేపీతో జతకట్టిన టీడీపీకి ఆ వర్గం ఓటర్లు దూరం కావడం అభ్యర్థులను కలవరపరుస్తోంది. ఎలాగైనా వీరి ఓట్లను చీల్చి లబ్ధి పొందేందుకు ‘స్వతంత్ర అభ్యర్థులను’ బరిలోకి దింపినట్లు చర్చ జరుగుతోంది. వాహనాల అనుమతులు.. పోలింగ్ కేంద్రంలో అనుకూలురను ఏజెంట్లుగా నియమించుకోవడం.. ఇతర పార్టీల ఏజెంట్లను భయభ్రాంతులకు గురిచేయడం.. ‘స్వతంత్ర’ నామినేషన్ల వెనుక ఉద్దేశంగా తెలుస్తోంది. కర్నూలు అసెంబ్లీలో అత్యధికంగా 36 మంది పోటీ పడుతున్నారు.
ప్రధాన పార్టీలతోపాటు చిన్నాచితకా పార్టీల అభ్యర్థులు మినహాయిస్తే అదనంగా 19 మంది బరిలో నిలిచారు. వీరిలో అత్యధికులు టీడీపీ అభ్యర్థి సన్నిహితులే కావడం గమనార్హం. ఎన్.కుమార్, జి.దావీద్‌బాబు, ఎస్.నజీర్‌అహ్మద్, పి.రవికుమార్, వి.ప్రకాష్‌రావు, ఎం.నజీర్‌బాషా, అబ్దుల్‌గఫూర్ షేక్, షేక్ అబ్దుల్ గఫూర్, మోహన్‌రెడ్డితో పాటు మరో ఐదుగురు వారిలో ఉన్నట్లు వెల్లడైంది.
వీరి ద్వారా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఓట్లను చీల్చడమే ధ్యేయంగా తమ్ముళ్లు చీప్ ట్రిక్స్ నడుపుతున్నారు. ఇదే సమయంలో ఓటర్లను తికమకపెట్టి ప్రయోజనం పొందాలనేది వారి ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది. ముఖ్యంగా ముస్లిం ఓట్లను చీల్చేందుకు ఆ వర్గీయులు నలుగురిచే నామినేషన్లు వేయించారు. వీరంతా టీడీపీ అభ్యర్థి అనుచరులేననే చర్చ ఉంది. ముస్లింల మధ్య చిచ్చు పెట్టి లాభపడాలనే టీడీపీ శ్రేణుల ప్రయత్నంగా తెలుస్తోంది. ఇదిలా ఉండగా సీపీఎం తరఫున ఎం.అబ్దుల్ గఫూర్ పోటీ చేస్తున్నారు. ఇదే పేరున్న వారిచేత నామినేషన్లు వేయించడం చూస్తే.. ఆ వర్గం ఓటర్లను తికమకపెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. పేర్లు గుర్తుపట్టలేక ఓటర్లు ఎవరో ఒకరికి ఓటు వేస్తే కొన్ని ఓట్లనైనా చీల్చవచ్చని టీడీపీ నేతల పన్నాగంగా రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని తేలిపోవడంతో.. తమ్ముళ్ల డ్రామా రక్తికట్టని పరిస్థితి నెలకొంది.
స్వతంత్రం
Published Mon, Apr 28 2014 2:54 AM | Last Updated on Fri, Mar 22 2019 6:16 PM
Advertisement
Advertisement