సాక్షి ప్రతినిధి, అనంతపురం : వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ఆత్మకూరుకు షెడ్యూలు ప్రకారం సాయంత్రం 5 గంటలకు చేరాలి. 7.30 గంటలు ఆలస్యంగా అర్ధరాత్రి 12.30 గంటలకు అక్కడికి చేరుకున్నారు. 25 వేల మందికి పైగా జనం ఆయన కోసం 7.30 గంటల పాటు ఎదురుచూశారు. ఏ ఒక్కరి మొహంలోనూ చికాకు కన్పించలేదు. చిక్కటి చిరునవ్వుతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి నీరాజనాలు పలికారు.
బుధవారం మధ్యాహ్నం రెండున్నర.. సూర్యుడు మండుతున్నాడు. కళ్యాణదుర్గం మండలం పాలవాయి గ్రామం మొత్తం రోడ్డుపైకి వచ్చింది.. యువతులు, పండుటాకులు రోడ్డుపై బారులు తీరారు. కాళ్లకు చెప్పులు లేకున్నా మండే ఎండను ఖాతరు చేయకుండా గంటల తరబడి ఎదురుచూశారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అక్కడికి చేరుకోగానే యువతులు, పండుటాకులు ఆయనతో కరచాలనం చేసేందుకు పోటీ పడ్డారు.
ఈ రెండు ఉదంతాలే కాదు.. మంగళ, బుధవారం ప్రతి పట్టణంలోనూ ప్రతి గ్రామంలోనూ ఇవే దృశ్యాలు కన్పించాయి. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం సృష్టిస్తుందనడానికి అవన్నీ సంకేతాలని రాజకీయ విశ్లేషకులు ఒక్కమాటలో తేల్చి చెబుతున్నారు. ఇంటెలిజెన్స్ అధికారులు సైతం ఆ విశ్లేషణతో ఏకీభవిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదిక పంపడం ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ప్రధాన రాజకీయ పార్టీకి చెందిన ఓ లోక్‌సభ అభ్యర్థి.. ‘నా టైం బాగోలేదు.. అనవసరంగా లోక్‌సభకు పోటీచేస్తున్నా.. నేను గెలవడం అసాధ్యం’ అని తన అనునయుల వద్ద బాహాటంగా నిర్వేదం వ్యక్తం చేస్తున్నారంటే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల ప్రచారానికి ఏ స్థాయిలో జనస్పందన లభించిందో విశదం చేసుకోవచ్చు.
వివరాల్లోకి వెళితే.. వైఎస్‌ఆర్ జనభేరి పేరుతో జిల్లాలో మంగళవారం, బుధవారం వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మంగళవారం గుత్తి, పామిడి, వజ్రకరూరు, ఉరవకొండ, ఆత్మకూరుల్లోనూ.. బుధవారం కళ్యాణదుర్గం, తగరకుంట, కనగానిపల్లి క్రాస్, మామిళ్లపల్లి, పెనుకొండల్లోనూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రోడ్‌షోలు నిర్వహించారు. బహిరంగ సభల్లో ప్రసంగించారు. రోడ్‌షోలకు.. బహిరంగ సభలకు జనం పోటెత్తారు. టీడీపీ ప్రాబల్యం అధికంగా ఉన్న ప్రాంతాల్లోనూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రోడ్‌షోలకు జనం విరగబడటం ఆ పార్టీ నేతలను నివ్వెరపరచింది. ‘పామిడిలో మాకు ఎదురులేదని ఇన్నాళ్లూ అనుకున్నాం.. కానీ మంగళవారం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రోడ్‌షోతో ఆ భ్రమలు తొలగిపోయాయి. వైఎస్సార్‌సీపీ గాలి వీస్తోందనడానికి ఇదే తార్కాణం’ అని ఆ నగర పంచాయతీకి చెందిన ఓ కీలక నేత బహిరంగంగా వ్యాఖ్యానిస్తుండటం ఆ పార్టీ అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. మండుటెండను ఖాతరు చేయకుండా.. ఉక్కపోతను లెక్కచేయకుండా.. వడదెబ్బ తగులుతుందేమో అనే ఆందోళన లేకుండా జనం రోడ్లపైకి వచ్చారు. జనవిస్ఫోటనంతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రోడ్‌షో ముందుకు కదల్లేని పరిస్థితి. గంటల తరబడి వేచిచూడాల్సిన పరిస్థితి ఉత్పన్నమైనందుకు ఏ ఒక్కరూ చిరాకు పడలేదు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆ ప్రాంతానికి చేరుకోగానే హర్షధ్వానాలతో ఘన స్వాగతం పలికారు. రోడ్డు పొడవునా యువతులు, పండుటాకులు బారులు తీరి వైఎస్ జగన్‌తో కరచాలనం చేసేందుకు పోటీపడ్డారు. యువతులను ఆశీర్వదించిన వైఎస్ జగన్.. పండుటాకుల నుదుటిని ఆప్యాయంగా ముద్దాడారు.
యువకులతో ఓపిగ్గా కరచాలనం చేశారు. ప్రధానంగా యువతీయువకులు, మహిళలను ఓపినియన్ లీడర్స్(అభిప్రాయ నిర్ణేతలు)గా రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. ఆ వర్గాలు ఎటు వైపు మొగ్గు చూపితే.. విజయం అటు వైపు ఉంటుందన్నది అంచనా. ఇది అనేక సందర్భాల్లో.. అనేక ఎన్నికల్లో స్పష్టమైంది. మొన్నటికి మొన్న అనంతపురం, రాయదుర్గం ఉప ఎన్నికల్లో అది మరోసారి నిరూపితమైంది. సహకార, పంచాయతీ ఎన్నికల్లోనూ అదే స్పష్టమైంది. మున్సిపల్, ప్రాదేశిక ఎన్నికల పోలింగ్ సరళి దాన్నే స్పష్టీకరించింది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనకు అపూర్వ స్పందన లభించిన నేపథ్యంలో.. సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ స్పీడ్ పెరగడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు స్పష్టీకరిస్తున్నారు. ఇదే అంచనాలతో ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ఏకీభవిస్తుండటం గమనార్హం.
ఆ జనం దేనికి సంకేతం?
Published Fri, Apr 18 2014 2:23 AM | Last Updated on Fri, Aug 17 2018 8:19 PM
Advertisement
Advertisement