
బోగస్ ఓట్లను తేల్చండి
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్:
బోగస్ ఓట్లకు సంబంధించిన విచారణను ఈ నెల 20వతేదీలోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి ఎన్నికల అధికారుల (ఆర్వోలు)ను ఆదేశించారు. ఈ మేరకు ఆయన మంగళవారం కలెక్టరేట్ నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల రిటర్నింగ్ ఆఫీసర్లు ఏఆర్‌ఓలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
బోగస్ ఓటర్లపై ఫిర్యాదులు, ఒకే ఫొటోతో వేర్వేరు చోట్ల ఓటు కల్గి ఉన్న వారిని గుర్తించాలన్నారు. ఇందుకు సంబంధించి విచారణను సత్వరమే పూర్తి చేసి తగు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం ద్వారా వచ్చిన ఫారం-6 దరఖాస్తులపై విచారణను కూడా సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి అర్హులైన వారి పేర్లను జాబితాలో చేర్చాలన్నారు.
ప్రతి రిటర్నింగ్ అధికారి తమ పరిధిలోని ప్రతి పోలింగ్ కేంద్రాన్ని తనిఖీ చేయాలని, మౌలిక సదుపాయాలను పరిశీలించాలని సూచించారు. ఇప్పటి వరకు ఎన్ని పోలింగ్ కేంద్రాల్లో వసతులు కల్పించారు, ఇంకా పెండింగ్‌లో ఎన్ని ఉన్నాయి తదితర వివరాలు ఆరా తీశారు. పోలింగ్ కేంద్రాల్లో ర్యాంపులున్నాయో లేదో పరిశీలించాలన్నారు.
ఎన్నికల నియమావళిని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు పాటించేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. అభ్యర్థులు, రాజకీయ పార్టీల ఎన్నికల వ్యయాన్ని సమగ్రంగా లెక్క కట్టాలన్నారు. నియోజకవర్గాల వారీగా ఏర్పాటు చేసిన టీము ల పని తీరును మెరుగుపరచాలన్నారు. సమస్యాత్మక గ్రామాల్లో జరిగే పోలింగ్ ప్రక్రియను వెబ్‌క్యాస్టింగ్ చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జేసీ కన్నబాబు, ఎన్నికల సెల్ ఓఎస్‌డీ సంపత్‌కుమార్, డిప్యూటీ తహసీల్దార్లు శివరాముడు, లక్ష్మిరాజు తదితరులు పాల్గొన్నారు.