స్వతంత్య్ర భారతదేశపు మొట్టమొదటి ఓటరు...
భారతదేశంలో ఎన్నికలు జరగబోతున్న తరుణంలో ‘శ్యామ్ శరణ్ నేగీ’ గురించి అందరూ తెలుసుకోవాలి. 97 సంవత్సరాలశ్యామ్ శరణ్ నేగీ ... 1951 - 52 నుంచి తన ఓటుహక్కును వినియోగించుకుంటూనే ఉన్నాడు. 16 వ సారి తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి సిద్ధమవుతున్న శ్యామ్ భారతదేశంలోని అత్యంత వృద్ధ ఓటరుగా నమోదయ్యాడు. ఉత్తర హిమాచల్‌ప్రదేశ్‌లో టీచర్‌గా పని చేసి రిటైరయిన శ్యామ్, భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత 1951 లో జరిగిన మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికల నాటి నుంచి తన ఓటుహక్కును వినియోగించుకుంటూనే ఉన్నారు.
ఈ నెల పద్నాలుగో తారీకున మొత్తం తొమ్మిది విడతలుగా ఎన్నికలు జరగనున్నాయి. ఈప్రక్రియం మొత్తం ఐదు వారాలు జరుగుతుంది. ఎన్నికల ఫలితాలు మే 16న విడుదలవుతాయి. 814 మిలియన్ల మంది ఈ ఎన్నికలలో ఓటుహక్కు వినియోగించుకోనున్నారు.
ఇంతకీ విశేషమేంటంటే స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఓటుహక్కును వినియోగించుకున్న మొట్టమొదటి ఓటరు శ్యామ్ నేగి.
హిమాచలప్రదేశ్ కిన్నూర్ జిల్లా కల్పాలో నివాసం ఉంటున్న శ్యామ్...అత్యంత వృద్ధ ఓటరనీ, ఈయన 2014 మే 7 వ తేదీన తన ఓటుహక్కును వినియోగించుకోనున్నాడనీ ఎలక్షన్ కమిషన్ తెలియచేసింది.
గూగుల్ ఇండియా ఇటీవలే ‘ప్లెడ్జ్ టు ఓట్’ అనే ఒక వీడియోను యూ ట్యూబ్‌లో ఉంచింది. ‘‘ప్రతి ఎన్నికల సమయంలోనూ తన ఓటుహక్కును సద్వినియోగం చేస్తున్న నిజాయితీ ఓటరు’’ అని అందులో పేర్కొంది.
మార్చి 24, 2014న యూట్యూబ్‌లో ఉంచిన నాటి నుంచి ఇప్పటివరకు సుమారు 1.7 మిలియన్ల మంది ఈ వీడియోను సందర్శించారు.
ఈ వీడియోలో... నేగీ టీ తన ఇంటిదగ్గర టీ తాగుతూ, ఆరుబయట కొండల మీద నుంచి రాలుతున్న మంచును చూస్తూ ఉండటంతో ప్రాంభమవుతుంది. ఆ తరువాత - కోటు వేసుకుని, చేతికర్ర సహాయంతో పోలింగ్ సెంటర్‌కు మంచు నేల మీద నడుస్తూ, ఆపిల్, పైన్ తోటల మీదుగా వస్తున్న గాలిని ఆస్వాదిస్తూ, ఎన్నికల కేంద్రానికి చేరుకోగానే, అతడికి మెడలో దండ వేసి, అతనితో ఓటు వేయిస్తారు. శ్యామ్ నేగీ భారతదేశంలోని మొట్టమొదటి ఓటరుగా ఈ వీడియోలో చూపుతారు. మొట్టమొదటి పోలింగ్ కేంద్రాన్ని కల్పా గ్రామంలోనే ఏర్పాటుచేశారని కూడా ఇందులో వివరిస్తారు.
25 అక్టోబరు 1951లో ఇక్కడ ఎన్నికలు జరిగాయనీ, అ రోజులను గుర్తు చేసుకుంటూ చెబుతారు శ్యామ్. నాటి నుంచి ప్రతిసారీ తన ఓటుహక్కును వినియోగించుకుంటున్నాననీ, రానున్న మే 7 వ తేదీన ఓటు వేయబోతున్నాననీ శ్యామ్ తెలిపారు. ‘‘ ఏళ్ల క్రితం జరిగిన ఆసంఘటనలను ఇంకా మర్చిపోలేదు. మొట్టమొదటిసారి ఓటు వేయడానికి వెడుతున్నప్పుడు విపరీతంగా మంచు కురుస్తోంది’’ అంటూ చిరునవ్వుతో చెబుతారు శ్యామ్.
‘ఏ పార్టీకి మద్దతిస్తారని ఎవరైనా అడిగితే, ‘‘దేశాన్ని నిజాయితీగా పరిపాలించి, మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటేచేసేవారికి ఓటు వేస్తాను’’ అని మాత్రమే చెబుతారు. భారత ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన నోటా (నన్ ఆఫ్ ద ఎబౌ) గురించి మాట్లాడటానికి అంతగా ఉత్సాహం చూపట్లేదు. ‘‘నేను నోటాను అంగీకరించను. మనం ఎవ్వరికీ ఓటు వేయకూడదన్నంత చెడ్డవారు ఎవ్వరూ లేరు’’ అంటారు.
- డా. వైజయంతి