న్యూఢిల్లీ: భారత ఎన్నికల సంఘానికి కొత్తగా ఇద్దరు కమిషనర్ల నియామకమయ్యారు. కేంద్ర ఎన్నికల కమిషనర్లుగా కేరళకు చెందిన మాజీ ఐఏఎస్ జ్ఞానేష్‌కుమార్, పంజాబ్‌కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ సుఖ్‌భీర్ సింగ్ సంధును ఎంపిక చేశారు. కాగా గత నెలలో ఎన్నికల కమిషనర్ అనుప్ చంద్ర పాండే పదవీ విరమణ చేయగా, ఇటీవల అరుణ్ గోయల్ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో రెండు ఎన్నికల కమిషనర్ పోస్టులు ఖాళీ అయిన సంగతి తెలిసిందే.
లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించడానికి ఇంక కొన్ని రోజులే ఉందనగా కేంద్ర ఎన్నికల సంఘంలో ఇద్దరు కమిషనర్ల రాజీనామాతో ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఒక్కరే ఈసీఐలో మిగిలారు. దీంతో తాజాగా ఇద్దరు కమిషనర్లను సెలక్షన్ కమిటీ నియమించింది.
కాగా జ్ఞానేష్‌కుమార్.. 1988 బ్యాచ్ కేరళ కేడర్‌కు చెందిన ఐఏఎస్ మాజీ అధికారి. ఆర్టికల్ 370 రద్దు సమయంలో కేంద్ర హోం శాఖ వ్యవహరాల తరఫున కశ్మీర్ డివిజన్‌ను పర్యవేక్షించారు. గతంలో పలు కేంద్ర మంత్రిత్వ శాఖలకు కార్యదర్శిగా పనిచేశారు.
చదవండి: పంజాబ్ లోక్‌సభ ‘ఆప్’ అభ్యర్థుల జాబితా విడుదల
ఈ సెలక్షన్ కమిటీలో ప్రధానమంత్రితో పాటు ఓ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, లోక్‌సభలో కాంగ్రెస్ నాయకుడు అధిర్ రంజన్ చౌదరి కూడా ఉన్నారు. గురువారం ప్రధాని మోదీ అధ్యక్షతన ఎలక్షన్ కమిషన్ భేటీ అయ్యింది. అనంతరం న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్, హోంశాఖ కార్యదర్శి, శిక్షణ వ్యవహారాలశాఖ కార్యదర్శి సభ్యులుగా ఉన్న సెర్చ్ కమిటీ ప్రతిపాదించిన పేర్ల జాబితాపై చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక రాజీవ్ కుమార్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పదవీ విరమణ చేయనున్నారు.
సెలక్షన్ కమిటీలో సభుడైన కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చైదరి.. కేంద్రంపై మండిపడ్డారు. భారత ప్రధాన న్యాయమూర్తి స్థానంలో కేంద్ర మంత్రిని నియమించడం సరైంది కాదని అన్నారు. ఈ కమిటీలో సీజేఐ ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. గత రాత్రి తనకు 212 పేర్లను పంపించారని, మళ్లీ సమావేశానికి 10 నిమిషాల ముందు ఆరుగురు పేర్లను చెప్పారని అన్నారు. ప్యానెల్‌లో ప్రభుత్వానికే మెజారిటీ ఉందని.. వారు కోరుకున్నదే జరుగుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment